- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదంపై అనుమానాలెన్నో?.. ప్రమాదమా? కుట్రకోణమా?
హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో జరిగిన అగ్నిప్రమాదం రాజకీయంగా సంచలనం రేపుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‍లో సంభవించిన అగ్నిప్రమాదం రాజకీయంగా సంచలనం రేపుతోంది. ఇవాళ ఉదయం ఈ భవనంలోని మొదటి అంతస్తులోని కంప్యూటర్ ల్యాబ్‍లో మంటలు చెలరేగి అంతటా వ్యాపించాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది 5 ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. అయితే ఈ ప్రమాదంలో 40 నుంచి 50 కంప్యూటర్ల దగ్ధం అయినట్లు పోలీసులు ప్రాథమికంగా చెబుతున్నారు. ప్రమాదానికి గురైన మొదటి అంతస్తులోనే వివిధ కేసులకు సంబంధించిన చాలా విలువైన హార్డ్ డిస్కులు, డాక్యుమెంట్లు ఉన్నాయని ఇవన్నీ ఇప్పుడు అగ్నికి ఆహుతయినట్లు తెలుస్తోంది. మిస్టరీగా మారిన విజయారెడ్డి ఆత్మహత్య కేసుకు సంబంధించిన కీలక ఆధారలు సైతం ఇదే ల్యాబ్‍లో ఉన్నాయని ఇప్పుడివన్నీ బూడిదపాలైనట్లు తెలుస్తోంది. దీంతో అగ్నిప్రమాదం యాదృచ్ఛికమేనా లేక కుట్రకోణం ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఘటనపై అనుమానాలు?:
నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లోనే పలు కీలక కేసుల్లో ఆధారాలతో పాటు ఎఫ్ఎస్ఎల్ కంప్యూటర్లలోనే కీలక కేసుల సమాచారం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన ఆధారాలు. గత కొన్ని ఏళ్ల నుంచి ఇక్కడే ఉన్న ఓటుకు నోటు ఆడియో, వీడియో ఫైల్స్, ఇదే ల్యాబ్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించిన కీలక ఫైల్స్ ఈ ల్యాబ్ లోనే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఇటువంటి ల్యాబ్‍లో అగ్నిప్రమాదం సంభవించడంపై రాజకీయంగా పలు అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ఈ ఘటన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎఫ్‍ఎల్సీ ల్యాబ్ తగలపడిపోవడంపై ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ నేత క్రిశాంక్ ఏ ఆధారాలను చెరిపేస్తున్నారు రేవంత్ రెడ్డి అంటూ సీఎంను ప్రశ్నించారు. ఈ ట్వీట్ పై స్పందించిన కేటీఆర్ ఓటుకు నోటు కేసు వాయిస్ రికార్డింగ్ సాక్ష్యాలు లేకుండా చేస్తున్నారేమోనని కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. అలాగే ఫోన్ ట్యాపింగ్ వంటి కల్పిత రాజకీయ కేసుల్లో ఆధారాలు లేకపోవడాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని భావిస్తున్నట్లు వ్యాఖ్యలు చేశారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసులకు సంబంధించిన ముఖ్యమైన ఆధారాలు ఉండే ఈ భవనంలో అగ్నిప్రమాదాల విషయంలో అత్యంత జాగ్రత్తతో ఉంటారని తెలుస్తోంది. అయినా ఈ ప్రమాదం సంభవించడం ఏకంగా 50 వరకు కంప్యూటర్లు కాలిపోవడం అది కూడా కేవలం సీజ్డ్ ప్రాపర్టీ భద్రపరిచే గదిలోనే ప్రమాదం జరగడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
విజయరెడ్డి కేసు ఆధారాలు ఇక్కడే:
చర్లపల్లి రైల్వే ట్రాక్ వద్ద తొమ్మిది రోజుల క్రితం తన ఇద్దరు చిన్నారులతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ విజయరెడ్డి కేసులో పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టింది. మిస్టరీగా మారిన ఈ సూసైడ్ వెనుక ఉన్నది ఎవరు అనే దానిపై స్పష్టత రాకపోవడంతో సోషల్ మీడియాలో రకరాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఈ కేసులో ఏం జరిగిందో క్లారిటీ రావాలంటే ఆమె వినియోగించిన మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్‌లోని డేటానే కీలకమని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసును ఛేదించేందుకు విజయరెడ్డి ఉపయోగించిన మొబైల్ ఫోన్ కాల్ లిస్ట్, వాట్సాప్ చాట్స్, ల్యాప్‌టాప్‌లోని డాక్యుమెంట్స్ ఆధారంగా విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులతో పాటు తల్లి వద్ద నుంచి కూడా పోలీసులు సమాచారం సేకరించినట్లు తెలిపారు. ఆమె వాడిన మొబైల్, ల్యాప్‌టాప్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించగా, వాటి ద్వారా కీలక ఆధారాలు లభిస్తాయని పోలీసులు ఆశించారు. అయితే, ఫోరెన్సిక్ ల్యాబ్‌లో జరిగిన అగ్ని ప్రమాదం ఈ కేసులో కీలక మలుపుగా మారింది. ఆ ఘటనలో విజయరెడ్డి మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్ కాలిపోయాయా? లేక సురక్షితంగా ఉన్నాయా? అన్న అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం: శిల్పవల్లి
ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‍లో అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణం అని ప్రాథమికంగా భావిస్తున్నట్లు సెంట్రల్ జోన్ డీసీపీ కె.శిల్పవల్లి తెలిపారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు అగ్నిప్రమాదంపై సమాచారం అందిందని ప్రస్తుతం మంటలు అదపులోకి వచ్చినట్లు వెల్లడించారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన శిల్పవల్లి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. నేర పరిశోధనకు సంబంధించిన ఫైల్ ఎవిడెన్స్ లాబరేటరీ మొత్తం ఇక్కడ నుండే ఆపరేషన్ జరుగుతుందని చెప్పారు. ఈ అగ్ని ప్రమాదంలో ఏం తగులబడ్డాయో ఇంకా స్పష్టత లేదని తెలిపారు. 5 ఫైరింజర్ల సాయంతో మంటలను ఫైర్ సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్‌లో పని చేస్తున్న వార్డు బాయ్ కృష్ణ మంటలను ఆర్పేందుకు ప్రయత్నించగా.. అపస్మారక స్థితిలోకి వెళ్లాడని, అతడిని చికిత్స నిమిత్తం 108లో హాస్పిటల్‌కు తరలించామని తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు నలుగురు ఉద్యోగులు లోపల ఉన్నారని, వారు మంటలు గమనించి సురక్షితంగా బయటి వచ్చేశారని ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి వివరించారు.






