- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫోరెన్సిక్ ల్యాబ్‌లో భారీ అగ్నిప్రమాదం.. నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
నగర నడిబొడ్డున ఉన్న నాంపల్లి స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (FSL)లో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: నగర నడిబొడ్డున ఉన్న నాంపల్లి స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (FSL)లో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పలు కీలక కేసుల సాక్ష్యాధారాలపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటన వివరాల్లోకి వెళితే.. శనివారం మధ్యాహ్నం కార్యాలయంలోని కంప్యూటర్ ల్యాబ్ విభాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. లోపల రసాయనాలు, కీలక పత్రాలు ఉండటంతో మంటలు వేగంగా ఇతర విభాగాలకు వ్యాపించాయి. దట్టమైన పొగ కమ్ముకోవడంతో లోపల ఉన్న సిబ్బంది ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
దగ్ధమైన కీలక సాక్ష్యాలు
ఈ ప్రమాదంలో 'సీజ్డ్ ప్రాపర్టీస్' (స్వాధీనం చేసుకున్న వస్తువులు) భద్రపరిచే గది పూర్తిగా కాలిపోయింది. వివిధ నేరాలకు సంబంధించి సేకరించిన భౌతిక సాక్ష్యాధారాలు (Physical Evidence) బూడిదయ్యాయని అధికారులు చెబుతున్నారు. సుమారు 40 నుంచి 50 సీజ్ చేసిన కంప్యూటర్లు అగ్నికి ఆహుతయ్యాయి. రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఆధారాలు. ఏళ్ల తరబడి విచారణలో ఉన్న ఓటుకు నోటు కేసు ఆడియో, వీడియో ఫైల్స్. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించిన కీలక డేటా కూడా ఈ కంప్యూటర్లలోనే ఉన్నట్లు తెలుస్తోంది.
పోలీసుల దర్యాప్తు..
ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ అగ్నిప్రమాదంపై నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎఫ్.ఎస్.ఎల్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ మంటలు చెలరేగి ఉండవచ్చని జిల్లా ఫైర్ ఆఫీసర్ (DFO) శ్రీదాస్ ప్రాథమికంగా వెల్లడించారు. అయితే, కీలక కేసుల విచారణ జరుగుతున్న తరుణంలో ఈ ప్రమాదం జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరైనా కావాలని సాక్ష్యాలను రూపుమాపేందుకు ఈ పని చేశారా? లేక ప్రమాదవశాత్తు జరిగిందా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి ఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. జరిగిన ఆస్తి నష్టం, సాక్ష్యాధారాల నష్టంపై అధికారులు పూర్తిస్థాయి నివేదిక సిద్ధం చేస్తున్నారు.






