ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్.. మంత్రి పొంగులేటి మరో తీపి కబురు

by Prasad Jukanti |   (  Updated:2026-04-27 12:57:14  IST  )

ఇందిరమ్మ ఇండ్ల పథకంపై మంత్రి పొంగులేటి సమీక్ష నిర్వహించారు. పట్టణ ప్రాంతాల వారికి వెసులుబాటు కల్పిస్తూ కీలక విషయాలు వెల్లడించారు.

ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్.. మంత్రి పొంగులేటి మరో తీపి కబురు
X
దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని మానవీయ కోణంలో అమలుచేస్తున్నదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాజకీయాలకతీతంగా ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లను మంజూరు చేశాం. ప్రభుత్వం పేదల కోసం చేసే ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు కూడా మరింత విస్తృతంగా భాగస్వామ్యులు కావాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని మరింత వేగవంతంగా , పారదర్శకంగా అమలు చేయడానికి అధికార వికేంద్రీకరణ చేసి, జిల్లా కలెక్టర్లకు మరిన్ని బాధ్యతలు అప్పగిస్తున్నామని, ఇందిరమ్మ ఇండ్లకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా హౌసింగ్ అధికారులతో ప్రతి వారం సమీక్షించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు. ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుని పథకం అమలులో వేగం పెంచడానికి ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తున్నామని తెలిపారు.
హౌసింగ్, రెవెన్యూ అంశాలపై ఇవాళ హైదరాబాద్‍లోని హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ఇన్ ఛార్జి మంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, హౌసింగ్ అధికారులతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గాల వారీగా హౌసింగ్ , రెవెన్యూ అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించి ఆయా జిల్లాల ప్రజాప్రతినిధులు ప్రస్తావించిన అంశాలపై అక్కడికక్కడే స్పందించి తగిన ఆదేశాలు ఇచ్చారు.

పట్టణ లబ్ధిదారులకు వెసులుబాటు:

గతంలో ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసుకోని వారు, ఇప్పుడు దరఖాస్తుకున్నా కూడా అర్హత ఉంటే వారికి కూడా ఇంటిని మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు. వివిధ కారణాలతో ఇండ్లు నిర్మించుకోలేని వారు, తమకు ఇల్లు అవసరం లేదని తెలియచేస్తే వారి స్థానంలో మరొకరికి కేటాయించాలని అధికారులకు సూచించారు. ఇంటి బేస్‍మెంట్ నిర్మాణం పూర్తైన తరువాత కొంత నిధులు విడుదల చేశాక వివిధ సాంకేతిక కారణాలతో బిల్లులు రానివారికి తక్షణమే విడుదల చేయాలని అధికారులను ఆదేశించడారు. పేదవారి అభివృద్ధి సంక్షేమం విషయంలో అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. గత ప్రభుత్వం అక్కడక్కడా నిర్మించి, అసంపూర్తిగా వదిలేసిన డబుల్ బెడ్ రూం ఇండ్లను పూర్తి చేసి, మంచినీరు, కరెంటు, డ్రైనేజి వంటి మౌలిక వసతులను కల్పించి, ఇండ్లు ఏ స్థాయిలో ఉన్నా తక్షణమే లబ్ధిదారులకు కేటాయించాలని అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో స్థలాల కొరతను దృష్టిలో పెట్టుకుని 400 చదరపు అడుగులకు తగ్గకుండా 600 చదరపు అడుగులకు మించకుండా జి ప్లస్ వన్ పద్ధతిలో ఇండ్లను నిర్మించుకునేలా వెసులుబాటు కల్పంచినట్లు తెలిపారు.

భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం:

రాష్ట్రంలోని ఐదు మండలాలలో ప్రయోగాత్మకంగా సర్వే మ్యాపుతో రిజిస్ట్రేషన్ చేస్తున్నామని మంత్రి తెలిపారు. రిజిస్ట్రేషన్ పూర్తైన తరువాత సర్వే మ్యాపు నెంబరు, భూదార్ నెంబరు కేటాయిస్తున్నామని సాదా బైనామాలకు సంబంధించి వీలైనంత త్వరగా దరఖాస్తులను పరిష్కరిస్తామన్నారు. ఈ దరఖాస్తుల పరిష్కారం మరింత వేగవంతం చేయడానికి వీలుగా ఆర్డీవోలకే అధికారాలను అప్పగిస్తున్నట్టు చెప్పారు.రాష్ట్ర వ్యాప్తంగా దశలవారీగా, తహశీల్దార్ కార్యాలయాలను నిర్మిస్తామని తొలిదశలో శిధిలావస్థకు చేరిన చోట నిర్మిస్తామన్నారు. ప్రతిజిల్లా కేంద్రంలో అత్యాధునిక వసతులతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. దశాబ్దాల నుంచి రెవెన్యూ, ఫారెస్టు, ఎండోమెంట్, వక్ఫ్ మధ్య సరిహద్దు వివాదాలు ఉన్నాయని అలాంటి చోట్ల ఉమ్మడి సర్వే నిర్వహించి ఇటువంటి సమస్యలు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో నిజామాబాద్ ఇంఛార్జి మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) (Danasari Seethakka), ఆదిలాబాద్ ఇంఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao), మంత్రి వివేక్ వెంకటస్వామి (Vivek Venkatswamy), ప్రభుత్వ సలహాదారులు పి.సుదర్శన్ రెడ్డి, పోచారం శ్రీనివాస రెడ్డి, మహ్మద్ షబ్బీర్ అలీ, ఆయా జిల్లా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రెవెన్యూ కార్యదర్శి, హౌసింగ్ సెక్రటరీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మహిళల పేరిటే రిజిస్ట్రేషన్లు.. CM రేవంత్ సంచలన ప్రకటన

Next Story