మహిళల పేరిటే రిజిస్ట్రేషన్లు.. CM రేవంత్ సంచలన ప్రకటన

by Gantepaka Srikanth |

తెలంగాణ రాష్ట్రంలో మహిళల భద్రత, ఆర్థిక సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

మహిళల పేరిటే రిజిస్ట్రేషన్లు.. CM రేవంత్ సంచలన ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో మహిళల భద్రత, ఆర్థిక సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సోమవారం హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మహిళలు, చిన్నారుల తక్షణ రక్షణ కోసం ఏర్పాటు చేసిన 'స్పందన' (SPANDANA) టీమ్‌లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న మహిళా సంక్షేమ పథకాలను వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో మహిళలకు, చిన్నారులకు వేగంగా రక్షణ కల్పించడమే ఈ టీమ్‌ల ప్రధాన ఉద్దేశ్యం. స్పందన సభ్యులకు బాధితుల పట్ల ఎలా వ్యవహరించాలి, నిందితులను ఎలా అదుపు చేయాలనే అంశంపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఒక్కో ఏసీపీ (ACP) జోన్‌కు రెండు స్పందన టీమ్‌లను కేటాయించారు. ఇవి డయల్ 100/112లతో అనుసంధానమై నిరంతరం అందుబాటులో ఉంటాయి. ఫిర్యాదు అందిన వెంటనే ఎటువంటి ఆలస్యం లేకుండా సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు భరోసా కల్పిస్తారు.

మహిళల పేరిటే రిజిస్ట్రేషన్లు..

మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక మార్పులను సీఎం ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 67 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆర్టీసీలో 1000 బస్సులకు మహిళలనే యజమానులను చేశామని, సోలార్ ఎనర్జీ బిజినెస్‌లోనూ వారిని భాగస్వాములను చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా క్యాంటీన్లు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు, 'అమ్మ ఆదర్శం' పథకం ద్వారా పాఠశాలల నిర్వహణ బాధ్యతలను మహిళలకే అప్పగించామని గుర్తు చేశారు. కొత్తగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరిటే రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు సీఎం తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించి, వారిని పాలనలో భాగస్వాములను చేసిన ఘనత కాంగ్రెస్‌దేనని అన్నారు. ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మహిళలకు నెలకు పెద్ద మొత్తంలో డబ్బు ఆదా అవుతోందని పేర్కొన్నారు.

బీజేపీ తీరుపై విమర్శలు..

మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. "మహిళా బిల్లు తెచ్చింది కాంగ్రెస్ పార్టీనే. కానీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం బిల్లు వీగిపోతుందని తెలిసి కూడా మహిళలను అవమానించేలా వ్యవహరించింది. బీజేపీకి మహిళల పట్ల ఏనాడూ చిత్తశుద్ధి లేదు" అని విమర్శించారు. నేటికీ సమాజంలో మహిళల పట్ల ఉన్న వివక్షను పోగొట్టి, వారికి పూర్తి భద్రత కల్పించేందుకు షీ టీమ్స్, స్పందన వంటి వ్యవస్థలను మరింత పటిష్టం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.

Next Story