రానున్న రోజుల్లో వీధి కుక్కల దాడులు పెరిగే అవకాశం..?

by Dishanational1 |
రానున్న రోజుల్లో వీధి కుక్కల దాడులు పెరిగే అవకాశం..?
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: వీధి కుక్కల నుంచి ముందు ముందు మరింత ప్రమాదం ముంచుకు రానుంది. ఈసారి ఎండలు తీవ్రంగా ఉండబోతుండటమే దీనికి కారణం కాబోతుంది. ఇదే విషయాన్ని చెబుతున్న పశువైద్యులు ప్రభుత్వం.. అధికార యంత్రాంగాలు మరింత అప్రమత్తం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెబుతున్నారు. ప్రతీ సంవత్సరం వేసవి కాలం మొదలు కాగానే వీధి శునకాలు స్వైర విహారం చేస్తుండటం తెలిసిందే. దీనిపై సంతోష్​నగర్​లో పశు వైద్యశాల నడుపుతున్న డాక్టర్​కిరణ్​తో మాట్లాడగా ఎండలు పెరిగే కొద్దీ కుక్కలు అస్వస్థతకు గురవుతుంటాయని చెప్పారు. ప్రధానంగా డీహైడ్రేషన్ కు లోనవుతుంటాయన్నారు. మండే ఎండల కారణంగా వీధి కుక్కల ఊపిరితిత్తుల్లో తేమ లేకుండా పోతుందని వివరించారు. తాగటానికి నీళ్లు దొరకక తీవ్ర అసహనానికి గురవుతుంటాయని తెలిపారు. అందుకే వేసవి కాలం మధ్యాహ్నం సమయాల్లో వీధి శునకాలు నీడను వెతుక్కుంటాయని చెప్పారు. సిటీలో చాలా కుక్కలకు నీడ కూడా దొరకని పరిస్థితి నెలకొని ఉందన్నారు. దాంతో కుక్కల్లో టెంపరేచర్​విపరీతంగా పెరిగిపోతుందన్నారు. ఈ క్రమంలోనే అవి వైల్డ్​గా ప్రవర్తిస్తాయని వివరించారు. ఇటువంటి పరిస్థితుల్లోనే తమను ఎదిరించలేని చిన్నపిల్లల్ని ఎక్కువగా టార్గెట్​చేస్తూ క్రూర మృగాల్లా దాడులు చేస్తుంటాయని చెప్పారు.

టెరిటరీలు కూడా ఓ కారణం...

వీధి కుక్కలకు టెరిటరీలు ఉండటం కూడా ఈ పరిస్థితికి కారణమని డాక్టర్ కిరణ్​విశ్లేషించారు. ప్రతీ పది నుంచి ఇరవై కుక్కలకు దాదాపు అరకిలోమీటర్​వ్యాసార్థంలో టెరిటరీ ఉంటుందని చెప్పారు. దీనిని దాటి అవి బయటకు పోవని తెలిపారు. కొత్తగా ఏదైనా కుక్క తమ టెరిటరీ పరిధిలోకి రావటానికి ప్రయత్నిస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తాయని వివరించారు. ఒకేసారి అయిదు నుంచి పది కుక్కలు కొత్తగా తమ టెరిటరీలోకి వచ్చిన జాగిలాలపై ఎగబడి అవి పారిపోయేవరకు వెంటాడుతాయని చెప్పారు. ఈ క్రమంలో తీవ్ర గాయాలకు సైతం గురవుతాయన్నారు. గాయాలైనపుడు అప్పటికే అసహనంలో ఉండే కుక్కలు మరింత ఉన్మాద స్థితికి చేరుకుంటాయని వివరించారు. అందుకే డాగ్​స్క్వాడ్ల సిబ్బంది ఎక్కడి నుంచి కుక్కలను పట్టుకుపోతారో తిరిగి అక్కడికే తెచ్చి వదిలిపెడుతుంటారన్నారు. ఇక, టెరిటరీ పరిధిలో వీధి కుక్కలకు నీళ్లు దొరికే అవకాశాలు తక్కువేనని చెప్పారు. వేసవి కాలంలో వాటికి ప్రధానంగా కావాల్సింది ఆహారంకన్నా నీళ్లే అన్నారు. అధికారులు వీధి కుక్కలకు యాంటీ రేబిస్ ఇంజక్షన్లు ఇస్తూ...కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసి వదిలిపెడుతున్నారు తప్పితే ఎండాకాలంలో వాటికి ఏం కావాలన్న దాన్ని పట్టించుకోవటం లేదన్నారు. వీధి కుక్కలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అవి తాగటానికి తొట్లలో నీళ్లు ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా పరిస్థితి ఇంత తీవ్రంగా ఉండదని చెప్పారు. కుక్కల బెడదను నివారించటానికి యేటా ఇరవై అయిదు కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నట్టు చెబుతున్న అధికార యంత్రాంగాలకు ఈ మాత్రం చర్యలు తీసుకోవటం పెద్ద కష్టసాధ్యం కాదన్నారు. ఎన్ని విషాదాలు జరుగుతున్నా ఎవ్వరూ ఈ దిశలో కనీసం ఆలోచించకపోవటం శోచనీయమని వ్యాఖ్యానించారు.

మూగ జీవాలను సైతం బలి...

పట్టణాల్లో ప్రధానంగా చిన్న పిల్లలపై దాడులు చేస్తూ కొన్నిసార్లు వారి ప్రాణాలు బలి తీసుకుంటున్న వీధి శునకాలు పల్లె ప్రాంతాల్లో మూగ జీవాలను వేటాడుతున్నాయి. ముఖ్యంగా గొర్రెలు, మేకల మందలపై దాడులు చేస్తూ పదుల సంఖ్యలో వాటిని చంపుతున్నాయి. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే వీధి కుక్కలు ఎక్కువగా రాత్రళ్లు మాత్రమే మూగ జీవాలపై దాడులు జరుపుతుండటం. దీనికి నిదర్శనంగా గత సంవత్సరం యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పొడిచేడు గ్రామంలో జరిగిన సంఘటనను పేర్కొనవచ్చు. ఆ గ్రామానికి చెందిన బండ నర్సయ్య, బండ వెంకన్న, బండ సైదులు అన్నదమ్మలు. గొర్రెలను పెంచుతూ జీవనాలు గడుపుతున్నారు. గత సంవత్సరం ఏప్రిల్​లో పగలంతా గొర్రెలను మేతకు తీసుకెళ్లి రాత్రికి తీసుకొచ్చి షెడ్​లో పెట్టి తమ తమ ఇళ్లకు వెళ్లిపోయారు. తెల్లారి తిరిగి వచ్చేసరికి వీధి కుక్కలు వందకు పైగా గొర్రెలను చంపటం చూసి కుప్పకూలిపోయారు. రేపోమాపో మార్కెట్​కు తరలించి సొమ్ము చేసుకుందామనుకున్న సమయంలో ఈ ఘోరం జరగటంతో వారి కుటుంబాలు తీవ్ర ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయాయి.

ఇదొకటే కాదు....ఎండాకాలంలో గొర్రెలు, మేకల మందలపై కుక్కల దాడులు చేస్తున్న సంఘటనలు ప్రతీ సంవత్సరం పదుల సంఖ్యలో ఉంటున్నాయి. అధికశాతం మంది పెంపకం దారులు బీమా చేయించకపోవటం...మూగజీవాలు చనిపోయిన తరువాత ప్రభుత్వ పరంగా ఎలాంటి ఆర్థిక సాయం అందకపోతుండటంతో ఉన్నదంతా పోగొట్టుకుని వీధుల పాలవుతున్నారు. చెరువుగట్టు ప్రాంతానికి చెందిన విజయ్​కుమార్​మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో అపుడపుడైనా వీధి కుక్కలను పట్టుకుంటుంటారు...పల్లెల్లో పట్టించుకునే నాధుడే ఉండడని చెప్పారు. మూగ జీవాలను పెట్టే షెడ్ల వద్ద పెంపుడు కుక్కలను పెడతామని, అయితే వీధి శునకాలు గుంపులుగా దాడులు చేస్తుండటంతో అవి పారిపోతుంటాయని వివరించారు. రాత్రి షెడ్​లో మూగ జీవాలను వదిలి తెల్లారి వెళ్లి చూసేవరకు తమ మనసు మనసులో ఉండదన్నారు. అధికార యంత్రాంగాలు పల్లెలపై కూడా దృష్టి సారించి వీధి శునకాల బెడదను నివారించటానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

Next Story

Most Viewed