గ్రేటర్‌లో పొలిటికల్ హీట్!

by Jakkula.Mamatha |   (  Updated:2026-04-05 10:14:29  IST  )

నగర రాజకీయాలు మెల్లగా వేడెక్కుతున్నాయి.

గ్రేటర్‌లో పొలిటికల్ హీట్!
X

దిశ, ఖైరతాబాద్: నగర రాజకీయాలు మెల్లగా వేడెక్కుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల షెడ్యూల్ ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా, రాజకీయ పార్టీలకు చెందిన ఆశావాహులు ముందస్తుగా ప్రచార బాట పట్టడం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా సనత్ నగర్ నియోజకవర్గంలో ఎన్నికల సందడి ముందుగానే కనిపిస్తున్నది. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని అమీర్పేట్, సనత్ నగర్ డివిజన్లతో పాటు తాజా పునర్విభజనలో భాగంగా పరిధి పెరగడంతో కొత్త డివిజన్లలో కూడా రాజకీయ కదలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఒక్కో పార్టీ నుంచి 5 నుంచి 10 మంది వరకు ఆశావహులు టికెట్ కోసం పోటీ పడుతూ ప్రజల్లో గుర్తింపు పొందేందుకు వినూత్న ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాలనీల్లో చిన్న సమావేశాలు, సేవా కార్యక్రమాలు, ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవడం వంటి చర్యల ద్వారా ప్రజలతో మమేకం కావడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు చేపడుతున్నారు.

రిజర్వేషన్ ఒప్పందాలు.. రాజకీయ చర్చ

ఈ సారి ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశం కీలకంగా మారనున్నది. రిజర్వేషన్ మాకు వస్తే మీరు మద్దతివ్వాలి.. మీకు వస్తే మేము మద్దతిస్తాం.. అంటూ ఒకే పార్టీకి చెందిన నాయకుల మధ్య అంతర్గత ఒప్పందాలు జరుగుతున్నాయనే చర్చ డివిజన్లలో వినిపిస్తున్నది. ఇది స్థానిక రాజకీయాల్లో కొత్త ట్రెండ్‌గా మారింది.

సోషల్ మీడియా కీలక ఆయుధం..

ఈ ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వేదికల ద్వారా ప్రచార వీడియోలు, పోస్టులు పంచుకుంటూ యువతను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. డిజిటల్ ప్రచారంతో పాటు గ్రౌండ్ లెవల్‌లో కూడా చురుకైన కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.

టికెట్ల కోసం తీవ్ర పోటీ..

ప్రతి డివిజన్‌లోనూ పలువురు నేతలు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తమ సామాజిక వర్గాల మద్దతు, స్థానిక ప్రజాభిమానాన్ని పార్టీ అధిష్టానానికి చూపించేందుకు కసరత్తు చేస్తున్నారు. దీంతో పార్టీల్లో అంతర్గత పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారింది. ప్రజా సమస్యలే అజెండాగా మార్చుకుంటున్నారు. ప్రజలతో ప్రత్యక్షంగా కలుసుకుంటూ స్థానిక సమస్యలను తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా రహదారుల దుస్థితి, మురుగు కాలువల సమస్య, తాగునీటి సరఫరా లోపాలు, ట్రాఫిక్ ఇబ్బందులు, పార్కుల అభివృద్ధి వంటి సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉంటామని నాయకులు హామీ ఇస్తున్నారు. ఇప్పటికే కొందరు ఆశావహులు సేవా కార్యక్రమాలు ప్రారంభించి ప్రజల్లో గుర్తింపు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఎన్నికల హడావిడి..

ఎన్నికల షెడ్యూల్ ప్రకటించక ముందే సనత్ నగర్ నియోజకవర్గంలో ఎన్నికల వాతావరణం స్పష్టంగా కనిపిస్తుంది. హోర్డింగులు, బ్యానర్లు, సమావేశాలతో రాజకీయ వేడి రోజురోజుకూ పెరుగుతున్నది. రాబోయే రోజుల్లో ప్రచార కార్యక్రమాలు మరింత వేగం పుంజుకుని నగర రాజకీయాలను ఉత్కంఠభరితంగా మార్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

BREAKING: ఖానాపూర్ మున్సిపల్ పీఠం బీజేపీ సొంతం

Next Story