హిందుత్వం బీజేపీ డీఎన్ఎ.. అది ఎజెండా కాదు : ఎంపీ అర్వింద్

by Taduka Kalyani |   (  Updated:2026-02-04 16:04:52  IST  )

హిందుత్వం కోసం రాజకీయాలు చేసే అవసరం బీజేపీకి లేదని, అభివృద్ధి మా ఎజెండా‌‌ అని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి అన్నారు.

హిందుత్వం బీజేపీ డీఎన్ఎ.. అది ఎజెండా కాదు :  ఎంపీ అర్వింద్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ ఫిబ్రవరి 04: హిందుత్వం కోసం రాజకీయాలు చేసే అవసరం బీజేపీకి లేదని, అభివృద్ధి మా ఎజెండా‌‌ అని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి అన్నారు. నిజామాబాద్ లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నిజామాబాదు కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి కార్పొరేషన్ కు బకాయి పడ్డ రూ. 8.16 కోట్లు ఎగవేత ధోరణితో ఇంత కాలం చెల్లించకుండా ఉన్నారని, కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ కోసమే అస్తిపన్ను బకాయిలు రూ. 8.16 కోట్లు కట్టాడని అర్వింద్ అన్నారు. ఆయన ఇన్నాళ్లుగా డబ్బుల్లేక కాదని, డబ్బులు పుష్కలంగా ఉన్నా చెల్లించే నియ్యత్ లేక కార్పొరేషన్ కు చెల్లించలేదన్నారు. అంత పెద్ద మొత్తాన్ని కట్టించింది మేమేనని అర్వింద్ అన్నారు. ఇన్ని రోజులు కట్టిచ్చేటోళ్లు లేరని, ఇప్పుడు కట్టించేటోళ్లు కక్కించెటోల్లచ్చిండ్రు కాబట్టే రూ. 8.16 కోట్లు కట్టాడని అర్వింద్ అన్నారు. మేయర్ పదవి కోసం ఒక్క రోజులో అంత పెద్ద మొత్తంలో కార్పొరేషన్ కు చెల్లించిన వ్యక్తి రేపు మేయర్ అయితే నిలువు దోపిడీ జరుగుతదని, కార్పొరేషన్ లో బహిరంగ దోపిడీ జరుగుతదని అర్వింద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇందూరు నగరాన్ని పూర్తిగా దోచుకుంటాడన్నారు.

17 ఏళ్లుగా ఎందుకు కట్టలే..

న్యాయ బద్దంగా ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఆస్తి పన్ను 17 యేళ్లుగా ఎందుకు చెల్లించలేదో, కార్పొరేషన్ ఎన్నికల సమయంలో ఒక్క రోజులోనే ఎందుకు చెల్లించారో ప్రజలకు వివరించాలన్నారు.

లాటరీ ఏమైనా తగిలిందా?

లంకెబిందెలు దొరికాయా..? అని అర్వింద్ ప్రశ్నించారు. 17 ఏళ్లుగా పన్ను కట్టకుండా ఏ కార్పొరేషన్ నైతే మోసం చేశారో, అదే కార్పొరేషన్ కు మేయర్ కావాలను కుంటున్నారని అర్వింద్ ఎద్దేవా చేశారు. ప్రజలను మోసం చేసిన వ్యక్తికి పోటీ చేసే నైతికత కూడా లేదన్నారు. అలాంటి వ్యక్తి రేపు మేయర్ అయితే నిజామాబాదు కార్పొరేషన్ ను శ్రీరాముడే కాపాడాలని అర్వింద్ ఆవేదన వ్యక్తం చేశారు. నైతికత, బాధ్యత లేకుండా ప్రజలకు శఠగోపం పెట్టాలనే నైజం నరేందర్ రెడ్డిదన్నారు. ఇలాంటి వారిని ఓటు ద్వారానే శిక్షించాలని అర్వింద్ ప్రజలకు పిలుపునిచ్చారు. 19వ డివిజన్ లో కాంగ్రెస్ అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కకుండా చేయాలన్నారు. ఇలాంటి వారిని గెలిపిస్తే సమస్యలెవరికి చెప్పుకుంటారని ప్రజలను ప్రశ్నించారు. సోనియా రేవంత్ కంటే నాకే దగ్గరని, అయినా కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేకి కాబట్టే నేను కాంగ్రెస్ లోకి వెళ్లలేదన్నారు.

అభివృద్దే మా ఎజెండా..

ప్రతీ రూపాయి ప్రజల కోసం ఖర్చు పెట్టి అభివృద్ధి చేయడమే బీజేపీ అజెండా అని అర్వింద్ అన్నారు. వినీతిపరులకు, పార్టీ మారిన వారికి బీజేపి టికెట్ ఇవ్వలేదన్నారు. బీజేపీ కి ప్రజలు ముందు.. పార్టీ సెకండ్ అని ఇదే మా ఎజెండా అన్నారు. స్వచ్చ పాలన కోసం బీజేపీకి ప్రజలు ఓటేయాలని ప్రజలను కోరారు. నిజామాబాదు కార్పొరేషన్ లో బీజేపీ మేయర్ పదవి గెలిస్తే ఏ వర్గానికి, ఓటు బ్యాంక్ కు లొంగకుండా నిజామాబాద్ లో ఆక్రమణలు తొలగిస్తామని అర్వింద్ నగర ప్రజలకు హామీ ఇచ్చారు. అవినీతిరహిత పాలనను, సుపరిపాలనను అందిస్తామన్నారు. బీజేపీ మేయర్ అభ్యర్థిని ఎవరినేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. మెజారిటీ, మైనార్టీ కాదు అభివృద్ధి ఎజెండా గా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు. నిజామాబాదుకు వందే భారత్ తెచ్చే బాధ్యత నాదన్నారు.

‘నా జోలికొస్తే నీ బతుకు రోడ్డుకీడుస్తా’.. కేటీఆర్‌పై నిప్పులు చెరిగిన బండి

Next Story