మెడిసిన్ సప్లై‌లో గ్యాప్ ఉండకూడదు: మంత్రి దామోదర్ రాజనర్సింహా

by Gantepaka Srikanth |   (  Updated:2026-04-22 17:18:55  IST  )

భారత సంప్రదాయ వైద్య సేవలకు ప్రాచుర్యం కల్పించి, ప్రజలకు ఉపయోగపడేలా ఆయుష్ డిపార్ట్‌మెంట్ పనివిధానం ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సూచించారు.

మెడిసిన్ సప్లై‌లో గ్యాప్ ఉండకూడదు: మంత్రి దామోదర్ రాజనర్సింహా
X

దిశ, తెలంగాణ బ్యూరో: భారత సంప్రదాయ వైద్య సేవలకు ప్రాచుర్యం కల్పించి, ప్రజలకు ఉపయోగపడేలా ఆయుష్ డిపార్ట్‌మెంట్ పనివిధానం ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సూచించారు. ఓపీ, ఐపీ పేషెంట్ల సంఖ్య మరింత పెరగాలని అన్నారు. అవసరమైన చోట డాక్టర్లు, సిబ్బందిని నియమించుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఆయుష్ వైద్య సేవలపై నేచర్‌క్యూర్ హాస్పిటల్‌లో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ బుధవారం సమీక్ష చేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆయుష్ హాస్పిటల్స్, క్లినిక్‌లు, కాలేజీలు, తదితర అంశాలను మంత్రి ఆరా తీశారు. ప్రభుత్వ కాలేజీలు, హాస్పిటళ్ల అభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులకు మంత్రి సూచించారు. సిద్ధిపేట, వికారాబాద్, భూపాలపల్లిలోని ఇంటిగ్రేటెడ్ ఆయుష్ హాస్పిటల్స్‌లో పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించి, వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి ఆదేశించారు.

ఆయుష్ మెడిసిన్ సప్లై‌లో గ్యాప్ ఉండకూడదని, పేషెంట్లకు అవసరమయ్యే అన్నిరకాల మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రభుత్వ ఆయుర్వేద, హోమియోపతి డాక్టర్లు, సిబ్బంది అటెండెన్స్‌ను స్ట్రిక్ట్‌గా మానిటర్ చేయాలని మంత్రి ఆదేశించారు. డ్యూటీలకు గైర్హాజరయ్యే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సరియైన అనుమతులు, అర్హతలు లేకుండా, ఆయుర్వేద, హోమియోపతి తదితర హాస్పిటళ్లు, క్లినిక్‌లు నడిపిస్తూ, తప్పుడు ప్రకటనలతో ప్రజలను దోచుకుంటున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆయుష్ డైరెక్టర్‌ శ్రీకాంత్ బాబును మంత్రి ఆదేశించారు. తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా ఆయుర్వేద, హోమియోపతి తదితర పేర్లతో నడుస్తున్న క్లినిక్‌లు, హాస్పిటళ్లను తనిఖీ చేయాలని, అవసరమైన అనుమతులు లేని హాస్పిటళ్లపై చర్యలు ప్రారంభించాలని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తూ, ఆయుష్ డైరెక్టర్ శ్రీకాంత్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Read More..

నోరు తెరిచి నిద్రపోతున్నారా? వామ్మో ఎంత డేంజరో తెలుసా?

Next Story