- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మీ జాతికే ఆయన ‘జాతిపిత’ ప్రజలకు కాదు.. కేసీఆర్‌పై ధ్వజమెత్తిన సీఎం రేవంత్
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలకు డిపాజిట్లు కూడా రావని సీఎం రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు.

దిశ, వెబ్‌డెస్క్: రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP)లకు డిపాజిట్లు కూడా రావని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) జోస్యం చెప్పారు. ఇవాళ నల్గొండ జిల్లా మిర్యాలగూడ పర్యటనలో భాగంగా గూడూరులో ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు శంకుస్థాపన చేసి, ఇతర అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో ఎక్కడా వివక్ష చూపడం లేదన్నారు. ఏప్రిల్‌లో కొత్త బడ్జెట్‌లో లక్షలాది ఇళ్లను పేదలకు ఇస్తామని చెప్పారు. పేదల ఆత్మగౌరవం పెంచే బాధ్యతను తానే తీసుకుంటానని రేవంత్ రెడ్డి అన్నారు.
బీఆర్ఎస్‌కు ఓటు అడిగే హక్కు ఉందా..
గత ప్రభుత్వం నల్గొండ జిల్లాపై కోపంతో ఎస్‌ఎల్‌బీసీ (SLBC) పనులను పూర్తిగా పక్కన పెట్టిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. నల్గొండ ప్రజలు విషపు నీరు తాగడానికి కారణం బీఆర్ఎస్ పార్టీనే అని ధ్వజమెత్తారు. రెండేళ్లలో పూర్తి చేసే లక్ష్యంతో ఎస్‌ఎల్‌బీసీ పనులు చేపట్టామని.. అదే సమయంలో దురదృష్టవశాత్తూ 8 మంది చనిపోయారని పేర్కొన్నారు. ఎస్‌ఎల్‌బీసీ పనులు ఆగితే మామ అల్లుళ్లు దావత్‌లు చేసుకున్నారని ఆరోపించారు. నల్గొండపై విషం చిమ్ముతున్న బీఆర్ఎస్‌కు అసలు ఓటు అడిగే హక్కు ఉందా అని ప్రశ్నించారు.
ఎర్రవెల్లి, జన్వాడ ఫామ్‌హౌస్‌లు ప్రజలకు ఇస్తారా..
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ (KCR)కు నోటీసులు ఇస్తే.. జాతిపితకు నోటీసులు ఇస్తారా? అని ప్రశ్నిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, కృష్ణారావు వంటి నేతలకు ఆయన జాతిపిత కావచ్చు.. కానీ ప్రజలకు ఆయనతో ఏం పని అని మండిపడ్డారు. నేరాలు, ఘోరాలు చేస్తే పోలీసులు ముసుగు వేసి పట్టుకుని వస్తారని.. హరీశ్ రావు, కేటీఆర్‌లను కూడా ముసుగు వేసి పట్టుకుని రావాల్సిందని అన్నారు. కేసీఆర్‌కు నోటీసులు ఇస్తే తెలంగాణ జాతికి ఇచ్చినట్లుగా చెబుతున్నారని, అలా అయితే ఎర్రవెల్లి (Erravelli), జన్వాడ (Janwada) ఫామ్‌హౌస్‌లు ప్రజలకు ఇస్తారా అని ప్రశ్నించారు. వేల కోట్లు కొల్లగొట్టిన సొమ్ములో నిరుద్యోగులకు ఏమైనా ఇస్తారా అని నిలదీశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు అన్నీ అనుభవించారని.. కానీ తెలంగాణ సమాజానికి ఏమైనా ఇచ్చారా? అని ధ్వజమెత్తారు. తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ (Professor Jaya Shankar) జాతిపిత అవుతారు కానీ.. కేసీఆర్ ఎలా అవుతారని ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ తెలంగాణ తల్లి అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.






