అర్ధరాత్రి హడావిడిగా CM ప్రెస్‌మీట్.. అదే కేసీఆర్ పవర్: హరీష్ రావు

by Gantepaka Srikanth |   (  Updated:2025-12-23 11:11:39  IST  )

అర్ధరాత్రి హడావిడిగా CM ప్రెస్‌మీట్.. అదే కేసీఆర్ పవర్: హరీష్ రావు

అర్ధరాత్రి హడావిడిగా CM ప్రెస్‌మీట్.. అదే కేసీఆర్ పవర్: హరీష్ రావు
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao) తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, రాజకీయ కక్ష సాధింపు చర్యలపై మండిపడ్డారు. కేసీఆర్ ప్రెస్‌మీట్ తర్వాత రేవంత్ సర్కార్ పూర్తి డిఫెన్స్‌లో పడిందని విమర్శించారు. 25 ఏళ్ల నా రాజకీయ జీవితంలో ఒక ముఖ్యమంత్రి రాత్రి 9:30 గంటలకు చిట్-చాట్ పెట్టి వివరణ ఇచ్చుకోవడం ఎప్పుడూ చూడలేదు. అరడజను మంది మంత్రులు పోటీపడి ప్రెస్ మీట్లు పెట్టారంటే అదే కేసీఆర్ పవర్ అని అన్నారు. అందాల పోటీలు, ఫుట్‌బాల్ షోకులు, గ్లోబల్ సమ్మిట్‌లు పేదవాడికి అన్నం పెడతాయా? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డికి సచివాలయం అంటేనే భయం పట్టుకుంది. వాస్తు భయంతో సెక్రటేరియట్ మెట్లు ఎక్కడం లేదని ఎద్దేవా చేశారు. గేట్లు, తలుపులు మార్చినా భయం పోక కేవలం కమాండ్ కంట్రోల్ రూమ్‌కే పరిమితం అయ్యారని అన్నారు.

స్థానిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 4,000 మందికి పైగా బీఆర్ఎస్ మద్దతుదారులు సర్పంచ్‌లుగా గెలవడంతో రేవంత్ రెడ్డికి ఏం చేయాలో తోచడం లేదని విమర్శనాస్త్రాలు సంధించారు. అందుకే కో ఆపరేటివ్ ఎన్నికలు పెట్టకుండా, కాంగ్రెస్ కార్యకర్తలను నామినేషన్ల ద్వారా నియమించాలని చూస్తున్నారు. దమ్ముంటే కో ఆపరేటివ్ ఎన్నికలు జరపాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఓయూకు ఒంటరిగా వస్తానని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి.. వేలాది మంది పోలీసుల పహారాలో వెళ్లారు. విద్యార్థి నాయకులను అరెస్టు చేయించి వెళ్లడం ఆయన పిరికితనానికి నిదర్శనని అన్నారు. సాగునీటిపై ప్రభుత్వం ఇచ్చే PPT(పవర్ పాయింట్ ప్రజెంటేషన్)ని స్వాగతిస్తున్నాం. కానీ వాస్తవాలు చెప్పడానికి బీఆర్ఎస్‌కు కూడా PPT ఇచ్చే అవకాశం ఇవ్వాలని కోరారు. అసెంబ్లీలో సీపీఐ, ఎంఐఎం, బీజేపీ కంటే తక్కువ సమయం మాకు ఇస్తూ మా గొంతు నొక్కుతున్నారు.. మైకులు కట్ చేస్తున్నారని ఆవేదన చెందారు. అవకాశం ఇస్తే అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ సర్కార్ బండారాన్ని బయటపెడతామని అన్నారు. ఇది ప్రభుత్వం కాదు.. ఒక కన్సల్టెన్సీ కంపెనీ. బొంబాయి బ్రోకర్ల సలహాలతో నడుస్తోందని ఆరోపణలు చేశారు.

READ MORE ....

నన్ను అరెస్ట్ చేస్తే చేసుకోండి.. SIT నోటీసులపై హరీశ్‌రావు హాట్ కామెంట్స్

Next Story