- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ములుగులో ఎయిమ్స్ సహకారంతో గిరిజన ఆరోగ్య పరిశోధన కేంద్రం..!
ములుగు జిల్లా కేంద్రంలో గిరిజన ఆరోగ్య సేవలు, వైద్య పరిశోధనలను బలోపేతం చేసే దిశగా అత్యాధునిక కేంద్రం ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తెలిపారు.

దిశ, ములుగు జిల్లా ప్రతినిధి : ములుగు జిల్లా కేంద్రంలో గిరిజన ఆరోగ్య సేవలు, వైద్య పరిశోధనలను బలోపేతం చేసే దిశగా అత్యాధునిక కేంద్రం ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తెలిపారు. బుధవారం కలెక్టర్ తన ఛాంబర్‌లో బీబీనగర్ ఎయిమ్స్ డీన్ (రిసెర్చ్) డా. రాహుల్ నరాంగ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలిసి, ములుగు జిల్లాలో సమ్మక్క–సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ సహకారంతో సెంటర్ ఫర్ ట్రైబల్ హెల్త్ అండ్ అకడమిక్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసే ప్రతిపాదనపై చర్చించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిపాదిత కేంద్రం ద్వారా గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన ఆరోగ్య సేవలను బలోపేతం చేయడంతో పాటు తలసీమియా, రక్తహీనత నివారణ, టెలీమెడిసిన్ సేవల విస్తరణకు దోహదపడుతుందన్నారు. అలాగే సికిల్ సెల్ అనీమియా, మలేరియా, డెంగ్యూ, క్షయవ్యాధి, స్క్రబ్ టైఫస్, జూనోసిస్ వంటి వ్యాధులు గిరిజన ప్రాంతాల్లో అధికంగా కనిపిస్తున్న నేపథ్యంలో వాటి పై సమగ్ర అధ్యయనం నిర్వహించేందుకు ఈ పరిశోధన కేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌వో) డాక్టర్ గోపాలరావు, ములుగు, ఏటూరునాగారం ఏరియా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ సురేష్, ఎయిమ్స్ వైద్య బృందం సభ్యులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.






