- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హెటెరో ఫార్మాతో ఇంటర్ విద్యాశాఖ ఎంఓయూ
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణతో పాటు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యాశాఖ, ప్రముఖ రసాయన-ఔషధ తయారీ సంస్థ హెటెరో ఫార్మాస్యూటికల్స్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది..

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణతో పాటు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యాశాఖ, ప్రముఖ రసాయన-ఔషధ తయారీ సంస్థ హెటెరో ఫార్మాస్యూటికల్స్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. బుధవారం హైదరాబాద్‌లో ఇంటర్ బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ సమక్షంలో ఈ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.
ఈ భాగస్వామ్యం ద్వారా ఇంటర్మీడియట్, వృత్తి విద్య పూర్తి చేసిన, ముఖ్యంగా 'లైఫ్ సైన్సెస్' అనుబంధ విభాగాలు చదివే విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. అర్హులైన విద్యార్థులకు క్యాంపస్ సెలక్షన్స్ ద్వారా ఉద్యోగాలు, ఇంటర్న్‌షిప్‌లు ఇస్తారు. పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా విద్యార్థులకు, అధ్యాపకులకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు.హెటెరో సంస్థ తమ సీఎస్‌ఆర్ నిధుల కింద ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రయోగశాలలను అభివృద్ధి చేస్తుంది.
ఈ సందర్భంగా ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ విద్యార్థులకు సార్థకమైన వృత్తి అవకాశాలు కల్పించాలనే నిబద్ధతతోనే హెటెరోతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. ఫార్మా రంగానికి అవసరమైన శిక్షణనిచ్చి, యువతకు దీర్ఘకాలిక, స్థిరమైన ఉపాధిని అందిస్తామన్నారు.
హెటెరో సంస్థ హెచ్‌ఆర్ వైస్ ప్రెసిడెంట్ డా. ఎస్. వెంకట జయపాల్ రెడ్డి మాట్లాడుతూ ఇంటర్ అర్హత కలిగిన యువతకు తమ సంస్థలో 300కు పైగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా యువత ఉపాధి సామర్థ్యాన్ని పెంపొందించడంలో తాము భాగస్వాములవుతున్నందుకు గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ యెంక్యా నాయక్, ఎస్ఐవీఈ ప్రిన్సిపాల్ డా. జ్యోత్స్నా రాణి, హెటెరో ప్రతినిధులు మాధురి ఐ, కర్ణకంటి వేణుమాధవ్ తదితరులు పాల్గొన్నారు.






