- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రియల్టర్లు చేసిన వెంచర్ మ్యాప్
పెద్దలే గద్దలైనారు, కొంతమంది రియల్ బ్రోకర్లను అడ్డం పెట్టుకుని ఏకంగా ప్రభుత్వ భూమికే ఎసరు పెట్టారు.

దిశ, నేలకొండపల్లి : పెద్దలే గద్దలైనారు, కొంతమంది రియల్ బ్రోకర్లను అడ్డం పెట్టుకుని ఏకంగా ప్రభుత్వ భూమికే ఎసరు పెట్టారు. ఇది ఎక్కడో మారుమూల గ్రామంలో కాదు, నేలకొండపల్లి నడిబొడ్డున జాతీయరహదారి, కూసుమంచి రహదారికి ఆనుకొని ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఎదురుగా ఉన్న అత్యంత ఖరీదైన సర్వే నంబర్ 159/1 భూమిపై ఆ రియల్టర్ల కళ్ళు పడ్డాయి. ఇంకేముంది రాళ్లు పాతేసి, ఎక్కడో ఉన్న సర్వే నంబర్లు వేసి వెంచర్ నమూనా తయారు చేశారు. పక్కనే తమకున్న 9కుంటల భూమిని ఏకంగా 30కుంటలకు మార్చేసి అమ్మకాలు మొదలు పెట్టారు. అంతేకాదు ఇప్పటికే సర్కారు భూమిలో సుమారు 500 గజాలు కూసుమంచి సబ్ రిజిస్టార్ పరిధిలో రిజిష్ట్రేషన్లు చేసేశారు.
ఏమిటా సర్వే నంబర్ 159/1..
నేలకొండపల్లి లోని సింగారెడ్డిపాలెం రెవిన్యూ పరిధిలోని సర్వే నంబర్ 159/1 మొత్తం ప్రభుత్వ భూమిగా ఉంది. జాతీయ రహదారిని ఆనుకొని, కూసుమంచి రోడ్డు వారగా ఉండే ఈ సర్వేనంబర్ 159 లో కొంత భూమిని ప్రభుత్వ జూనియర్ కాలేజీకి కేటాయించగా, రోడ్డుకు ఇవతలి వైపున మిగిలిన 25కుంటల భూమిని ౨౦౦౯ జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు కేటాయించారు. అయితే అప్పట్లో అటుపక్క పెద్దగా అభివృద్ధి లేకపోవటం తో జర్నలిస్టులు ఎవరూ అక్కడ ఇళ్ల నిర్మాణం జరపలేదు. దీంతో2018 సంవత్సరంలో జాతీయ రహదారి నిమిత్తం ఆ భూమిని ప్రభుత్వ అవసరాలకోసం వెనక్కి తీసుకొన్నారు. జాతీయ రహదారి నిర్మాణం పూర్తి కాగానే ఎలక్ట్రికల్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్కు కేటాయించాలని నిర్ణయించారు. అయితే కొంత కాలంగా ఆప్రతిపాదన కూడా ముందుకు పడని సమయంలో, భూముల కు విపరీతమైన గిరాకీ పెరిగి రియల్టర్ల కన్ను ఆ భూమిపై పడింది. దీంతో ఒక్కరిద్దరు రెవిన్యూ శాఖ లోని సిబ్బంది సహకారంతో భూమిని కొట్టేసేందుకు వ్యూహం పన్నారు. ఎక్కడో 400మీటర్ల అవతల ఉన్న సర్వే నంబర్ 121 తో కలిపి వెంచర్ ప్లాన్ తయారు చేశారు. జాతీయ రహాదారి పక్కనే కావటం, కూసుమంచి రోడ్డుకు కార్నర్ ప్లాట్ల్స్ అంటూ మాయ చేశారు. అలా ఇప్పటికే కూసుమంచి సబ్ రిజిస్టార్ కార్యాలయం ద్వారా 3 ప్లాట్లను అమ్మేశారు.
పంట కాలువనూ కమ్మేశారు..
సర్వే నంబర్ 159/1 పక్క నుండే నేలకొండపల్లి చెరువుకు వెళ్లే పంట కాలువ ఉంది. కోరట్ల గూడెం డొంక పక్కకు వై ఆకారంలో చీలి వెళ్తున్న ఈ పంట కాలువను రియల్ బ్రోకర్లు పూడ్చేశారు. గతంలో ఇక్కడ కాలువ ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నా కూడా అధికారులనే బెదిరించే స్థితికి రియల్టర్లు తెగబడ్డారు. గతంలో ఇలానే మట్టితో కాలువను పూడ్చివేసే ప్రయత్నాన్ని అధికారులు సమర్ధవంతంగా అడ్డుకుని రాళ్లు పాతారు. అయితే ఇప్పుడు మాత్రం అధికారులకే ఎదురు తిరిగి కాలువ లేదంటూ బుకాయిస్తున్నారు.
ఆర్డీవో క్షేత్రస్థాయి పరిశీలన..
ప్రభుత్వ భూమిని టోకున అమ్మేస్తున్నారన్న విషయం తెలుసుకున్న ఖమ్మం ఆర్డీవో శ్రీనివాసరావు తహసీల్దార్ రాంప్రసాద్ తో కలిసి సర్వే నంబర్ 159లో క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. ప్రభుత్వ భూమిని అమ్ముకున్న విషయమై ఆరా తీశారు. రియల్టర్ల బాగోతాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. తక్షణమే తహసీల్దార్ మరియు సిబ్బందికి సర్వే నిర్వహించామని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ భూములను ప్రజల అవసరాల మేరకే వినియోగిస్తామని, ఆక్రమించి అమ్ముకుంటే చట్టపరమైన చర్యలకు వెనుకాడమని హెచ్చరించారు.
సమగ్ర సర్వే నిర్వహిస్తాం...
ప్రభుత్వ భూమిని అమ్ముకొంటున్నారని మాకు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా సర్వే నిర్వహిస్తున్నాం. ఎక్కడా కూడా ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం కానీయమని తహసీల్దార్ రాంప్రసాద్ తెలిపారు. సర్వే పూర్తి కాగానే ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్ వేస్తామని తెలిపారు.






