- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెబ్బెన లో బస్టాండ్ లేక ప్రయాణికుల ఇక్కట్లు..
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రంలో బస్టాండ్ లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

దిశ, రెబ్బెన: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రంలో బస్టాండ్ లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంచిర్యాల, బెల్లంపల్లి, తాండూర్, హైదరాబాద్, కరీంనగర్, గోదావరిఖని తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు రహదారిపైనే బస్సుల కోసం వేచి ఉండాల్సి వస్తోంది. జాతీయ రహదారి–363 నిర్మాణం అనంతరం రెండు వైపులా సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేసినప్పటికీ, ఒక వైపు మాత్రమే బస్ షెల్టర్ ఉండగా మరోవైపు ఎలాంటి సౌకర్యం లేదు. దీంతో ఎండ, వర్షంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు ఆలస్యమైతే సమీపంలోని దుకాణాల్లో ఆశ్రయం పొందాల్సి వస్తుంది. అండర్‌పాస్, రైల్వే స్టేషన్‌కు వెళ్లే మార్గం ఇదే ప్రాంతంలో ఉండటంతో రద్దీ మరింత పెరుగుతోంది.
అదేవిధంగా సర్వీస్ రోడ్ల నిర్వహణ ను కూడా నేషనల్ హైవే అధికారులు పట్టించుకోవడం లేదని స్థానిక వ్యాపారులు ఆరోపిస్తున్నారు. దుకాణాల ముందు పేరుకుపోయిన ఇసుక, రాళ్లు, మట్టిని తొలగించడం లేదని, పారిశుద్ధ్య పనులను గ్రామ పంచాయతీ సిబ్బందే నిర్వహిస్తున్నారని తెలిపారు. నేషనల్ హైవే అధికారులు తమ బాధ్యతగా సర్వీస్ రోడ్లను నిత్యం శుభ్రంగా ఉంచి నిర్వహణ చేపట్టాలని కోరుతున్నారు. ప్రతిరోజూ విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మహిళలు, వృద్ధులు వందల సంఖ్యలో ఈ మార్గంలో ప్రయాణిస్తున్నప్పటికీ బస్టాండ్ లేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి సంబంధిత అధికారులు, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, ఇన్‌చార్జ్ మంత్రి స్పందించి రెబ్బెనలో ఆధునిక బస్టాండ్ నిర్మించడంతో పాటు సర్వీస్ రోడ్ల నిర్వహణను మెరుగుపరచాలని ప్రయాణికులు, వ్యాపారులు విజ్ఞప్తి చేస్తున్నారు.






