సాంకేతికత సహాయంతో కేసులను త్వరితగతిన ఛేదించాలి

by Taduka Kalyani |

సాంకేతికత సహాయంతో కేసులను త్వరితగతిన ఛేదించాలి
X

దిశ, మొయినాబాద్ : సాంకేతికతను పరిజ్ఞానాన్ని వీలైనంత ఎక్కువగా ఉపయోగించుకుని దాని సాయంతో కేసులను త్వరితగతిన ఛేదించాలని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి అన్నారు. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నేరాల నియంత్రణ, పెండింగ్ కేసుల పరిష్కారంపై పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డ్రీమ్ వ్యాలీ రిసార్ట్‌లో జరిగిన చేవెళ్ల జోన్ నెలవారీ నేర సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసు అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో భాగంగా సీపీ తరుణ్ జోషి మాట్లాడుతూ.. గ్రేవ్ అన్‌డిటెక్టెడ్ (UI) కేసుల విషయంలో నిర్లక్ష్యం వహించకుండా సీసీటీవీ ఫుటేజ్, ఫోరెన్సిక్, ఇతర సాంకేతిక ఆధారాల సాయంతో నిందితులను పట్టుకోవాలన్నారు. ముఖ్యంగా పోక్సో, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులు, మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల పట్ల పోలీసులు అత్యంత సున్నితంగా వ్యవహరించాలని, బాధితులకు సత్వర న్యాయం అందేలా చూడాలని ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా చార్జ్ షీట్లను కోర్టుల్లో దాఖలు చేసి, న్యాయ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.

నార్కోటిక్స్ నియంత్రణపై ప్రత్యేకంగా స్పందిస్తూ.. రాష్ట్రంలో మాదకద్రవ్యాల విక్రయం, రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలని అధికారులను ఆదేశించారు. డ్రగ్ పెడ్లర్లపై నిరంతర నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైన పక్షంలో రౌడీ షీటర్లు, పాత నేరస్థులపై పీడీ యాక్ట్ (PD Act) నమోదుకు ప్రతిపాదనలు పంపాలని పేర్కొన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, బాధితులకు అండగా ఉంటూ నిందితులను త్వరగా గుర్తించాలని వివరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రస్తావిస్తూ.. నిరంతరం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టాలని, ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని సీపీ అధికారులకు సూచించారు. సీసీటీఎన్‌ఎస్ (CCTNS) వ్యవస్థలో డేటా నాణ్యతను పెంచాలని, ఈ-సాక్షి (e-Sakshi) విధానం ద్వారా కోర్టు విచారణల్లో ఎలాంటి జాప్యం లేకుండా సాక్ష్యాధారాలు సమర్పించాలని ఆదేశించారు. బీట్ పోలీసింగ్‌ను పటిష్టం చేయడం ద్వారా ప్రజలతో నేరుగా సంబంధాలు నెలకొల్పుకోవాలని కోరారు. ఈ సమీక్షా సమావేశంలో చేవెళ్ల జోన్ డీసీపీ యోగేష్ గౌతమ్, ఐపీఎస్, అడిషనల్ డీసీపీ (ఎస్‌ఓటీ) షేక్ జహంగీర్, చేవెళ్ల ఏసీపీ బి.కిషన్ పాల్గొన్నారు. వీరితో పాటు సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ ఎస్.వెంకటేశం, ఐటీ సెల్ ఇన్‌స్పెక్టర్ బి.జేమ్స్ బాబు, సీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ బి.వీరబాబు, చేవెళ్ల జోన్ పరిధిలోని ఎస్‌హెచ్‌వోలు, సబ్ ఇన్‌స్పెక్టర్లు సమావేశానికి హాజరయ్యారు. ప్రజా భద్రత విషయంలో రాజీ పడకుండా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి సూచించారు.

Next Story