- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరీంనగర్‌లోని భగత్‌నగర్ భారీ చోరీ కేసులో పురోగతి
కరీంనగర్ పట్టణంలోని భగత్‌నగర్‌లో మంగళవారం అర్ధరాత్రి జరిగిన భారీ చోరీ కేసులో పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి.

దిశ, హుజురాబాద్ రూరల్: కరీంనగర్ జిల్లా కేంద్రంలో బుధవారం అర్థరాత్రి ఘోర దోపిడీ ఉదంతం చోటుచేసుకుంది. నగరంలోని భగత్ నగర్‌కు చెందిన అజ్మాత్ ఆలీ ఇంట్లోకి చొరబడిన ఐదుగురు సాయుధ దొంగలు, కుటుంబ సభ్యులను బొమ్మ తుపాకీలతో బెదిరించి ఒక గదిలో బంధించారు. అనంతరం ఇంట్లోని రూ. 15 లక్షల నగదు, 65 తులాల బంగారం, కిలో వెండిని దోచుకెళ్లారు. బాధితుల ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న రెండు మోటార్ సైకిళ్లపై నిందితులు పరారయ్యారు. పట్టణ నడిబొడ్డున జరిగిన ఈ దారుణం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
క్లూస్ ఇచ్చిన బైక్‌లు..
కరీంనగర్ పోలీస్ కమిషనర్ మహ్మద్ గౌస్ ఆలం ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించిన కొద్ది గంటల్లోనే కీలక ఆధారాలు లభించాయి . హుజూరాబాద్ మండలం పెద్ద పాపయ్యపల్లి గ్రామం శివార్లలోని ఎస్సారెస్పీ కెనాల్ వద్ద నిందితులు వదిలేసి వెళ్లిన రెండు బైక్‌లను గ్రామస్థులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన హుజూరాబాద్ ఏసీపీ వాసంశెట్టి మాధవి, సీఐలు కరుణాకర్, శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. వీరితో పాటు కరీంనగర్ నుంచి డీసీపీ వెంకటరమణ, సీఐ కోటేశ్వర్, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌లు రంగంలోకి దిగి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాయి.
పోలీసుల అనుమానాలు...
దొంగలు ఈ ప్రాంతానికే చెందినవారా? లేక పోలీసుల దృష్టి మళ్లించేందుకు స్థానిక దొంగలే ఈ పథకం పన్నారా? అనే కోణంలో ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ బృందాలు లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి.
రంగంలోకి 11 ప్రత్యేక బృందాలు...
ఇటీవల కరీంనగర్‌లోని ఒక జ్యువెలరీ షాపులో దొంగతనం జరిగిన సంఘటన మరవకముందే ఈ ఘాతుకం జరగడంతో సీపీ గౌస్ ఆలం ఈ కేసును అత్యంత తీవ్రంగా పరిగణించారు. నిందితులను పట్టుకునేందుకు 11 ప్రత్యేక గాలింపు బృందాలను ఏర్పాటు చేశారు. కరీంనగర్ నుంచి హుజూరాబాద్ వరకు ఉన్న మానకొండూర్, శంకరపట్నం, హుజూరాబాద్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని సీసీ కెమెరాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఉప్పల్, జమ్మికుంట, బిజిగిరి షరీఫ్ రైల్వే స్టేషన్‌లతో పాటు ప్రధాన ఆర్టీసీ బస్టాండ్లలోని సీసీటీవీ ఫుటేజీలను నిశితంగా పరిశీలిస్తున్నారు. అతిత్వరలోనే ఈ ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేసి, దొంగిలించబడిన సొత్తును రికవరీ చేస్తామని పోలీస్ ఉన్నతాధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.






