- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుప్తనిధుల కోసమే 800 ఏళ్ల చరిత్ర ఉన్న ఆలయాన్ని కూల్చారా? : హరీష్ రావు సంచలన ఆరోపణలు
వరంగల్ లో వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయాన్ని కూల్చివేయడంపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు ధ్వజమెత్తారు.

దిశ, వెబ్‌డెస్క్: వరంగల్ లోని అశోక్ నగర్లో 800 ఏళ్ల చరిత్ర కలిగిన.. శైవక్షేతంగా పిలిచే అతి పురాతన ఆలయాన్ని ప్రభుత్వం కూల్చివేయడంపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఫైరయ్యారు. ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం పేరుతో ఆలయాన్ని కూల్చివేయడంపై విమర్శలు గుప్పించారు. సోమవారం వరంగల్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూల్చడం తప్ప కట్టడం రాదని ధ్వజమెత్తారు. పేదల ఇళ్లతో పాటు దేవాలయాలను కూడా కూల్చుతున్నారని ఆరోపించారు. ఆ ప్రాంతంలో నిజంగా స్కూల్ నిర్మాణమే చేపడితే.. అర్థరాత్రి పనులు చేయాల్సిన అవసరం ఏంటని హరీష్ రావు ప్రశ్నించారు.
ఆలయాన్ని కూల్చివేసింది గుప్తనిధుల కోసమేనని.. పురాతన ఆలయాలను ఇందుకోసమే తవ్వుతున్నారేమోనన్న అనుమానాలు వస్తున్నాయన్నారు. ఆలయాన్ని కూల్చివేయడంపై పురావస్తుశాఖ ఫిర్యాదు చేసినా ఎలాంటి కేసు నమోదు చేయలేదని, దీని వెనుక ఏదో కుట్ర ఉన్నట్లుగా తెలుస్తోందన్నారు. కూల్చిన ఆలయం గర్భగుడి కింద 24 అడుగుల గొయ్యి తవ్వారని, అక్కడ నిధులేమైనా దొరికితే ఎత్తుకెళ్లి ఉండొచ్చని ఆరోపించారు. అక్కడ గొయ్యి తవ్వినట్లు పురావస్తుశాఖ అధికారులే గుర్తించారన్నారు. రేవంత్ రెడ్డి లంకె బిందెల వేటలోనే ఈ దేవాలయాన్ని కూల్చారన్నారు. సరిగ్గా విగ్రహం ఉన్న చోటే తవ్వకాలు ఎందుకు జరిపారని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా ఆలయం కూల్చివేతపై హరీష్ రావు కొన్ని డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. పురావస్తుశాఖ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా తక్షణమే ఆలయం కూల్చివేతపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, ఆలయాన్ని కూల్చివేసిన వారిని అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా హరీష్ రావు డిమాండ్ చేశారు. యుద్ధ ప్రాతిపదికన ఆ దేవాలయాన్ని పునరుద్ధరించాలని,1958 పురావస్తు శాఖ చట్ట ప్రకారం వందేళ్లకు పైబడిన ఏ ఆలయం అయినా, దానికి సంబంధించినవైనా పురావస్తుశాఖ పరిధిలోకి వస్తుందని దాన్ని వెంటనే ఆ శాఖ అప్పగించాలని కూడా డిమాండ్లలో పేర్కొన్నారు. అర్థరాత్రి జరిపిన తవ్వకాల్లో గుప్తనిధులు బయటపడితే.. అవి ఎవరి ఇళ్లలోకి పోయాయో విచారణ జరిపించి నిజానిజాలు బయటపెట్టాలని కోరారు. తమ పాలనలో కాకతీయుల గొప్పతనాన్ని ప్రపంచం గుర్తించేలా చేస్తే.. రేవంత్ సర్కార్ అదే కాకతీయుల గొప్పతనాన్ని కూల్చివేసిందని దుయ్యబట్టారు.






