BRS: కేసీఆర్‍కు తెలియకుండానే బాయ్‍కాట్? ఆయన సొంత నిర్ణయంతో పార్టీకి డ్యామేజ్!

by Prasad Jukanti |   (  Updated:2026-01-06 07:58:06  IST  )

అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తూ బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న నిర్ణయం పట్ల సొంత పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది.

BRS: కేసీఆర్‍కు తెలియకుండానే బాయ్‍కాట్? ఆయన సొంత నిర్ణయంతో పార్టీకి డ్యామేజ్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు కొత్త మలుపు తిరిగాయి. తొలిరోజు సభకు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కావడం, నీళ్ల పంచాయతీపై చర్చకు ప్రభుత్వం సైతం ఓకే చెప్పడంతో కృష్ణా, గోదావరి నీటి అంశంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ఉండబోతోందని అంతా భావించారు. అదే సమయంలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్‍గా హరీశ్ రావును నియమించడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య బిగ్ ఫైట్ తప్పదనే ఉత్కంఠ ఏర్పడింది. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఏకంగా అసెంబ్లీ సమావేశాలను బీఆర్ఎస్ బాయ్‍కాట్ చేయడం అందరిని విస్మయానికి గురి చేసింది. తమకు పట్టున్న సబ్జెక్ట్ లో కేసీఆరే స్వయంగా సభకు వచ్చి అధికార పక్షాన్ని ఇరుకున పెడతారని అంతా భావించగా అందుకు విరుద్ధంగా సెషన్ ను బహిష్కరించడం రాజకీయ వర్గాలతో పాటు సొంత పార్టీ శ్రేణులను సైతం షాక్ కు గురి చేసింది. దీంతో ఈ నిర్ణయం వెనుక ఎవరున్నారు అనేది గత రెండు రోజులుగా పార్టీలో సీరియస్ డిస్కషన్ నడుస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

అధినేతకు తెలియకుండానే నిర్ణయం?:

అసెంబ్లీ సమావేశాలను బీఆర్ఎస్ పార్టీ బాయ్‍కాట్ చేయడం వెనుక రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. అయితే కేసీఆర్‍కు తెలియకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారనే గుసగుసలు ఇప్పుడు గులాబీ పార్టీలో జోరుగా వినిపిస్తున్నాయి. అధినేతకు తెలియకుండానే డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఉన్న హరీశ్ రావు ఈ నిర్ణయం తీసుకున్నారని దీంతో అధికార పక్షానికి అనవసరంగా ఆయుధం ఇచ్చినట్లు అయిందనే ఊహాగానాలు పార్టీలో వినిపిస్తున్నాయి. కేసీఆర్ కు తెలియకుండా జరిగిన ఈ నిర్ణయంతో ఇటు సొంతపార్టీ సభ్యుల నుంచి వ్యతిరేకత వస్తోంది ఈ నిర్ణయంతో జరిగిన డ్యామేజ్ ను కంట్రోల్ చేసుకునేందుకు బీఆర్ఎస్ రకరకాల ప్రయత్నాలు చేస్తోందనే టాక్ వినిపిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల హరీశ్ రావు పీపీటీ ఇవ్వగా తాజాగా బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాక్ అసెంబ్లీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత శాసనసభ సమావేశాల్లో విపక్షాలకు తగిన సమయం ఇవ్వడం లేదని, ప్రజా సమస్యలపై చర్చకు అవకాశం కల్పించడం లేదని నిరసిస్తూ బీఆర్‌ఎస్ అసెంబ్లీని బైకాట్ చేసి ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఈ ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది.

ఇలా చేశారేంటబ్బా?:

అసెంబ్లీ సమావేశాల బహిష్కరణ అంశంలో తెలంగాణ భవన్ లో పలువురు నేతలు పెదవి విరుస్తున్నారట. అంతా మనకే అనుకూలంగా ఉన్న సమయంలో బాయ్ కాట్ నిర్ణయంతో ఇలాచేశారేంటని నేతలు ఒకరినొకరితో చర్చించుకుంటున్నారట. ఇటీవల హరీశ్ రావు పీపీటీ అయినా ఇప్పుడు మాక్ అసెంబ్లీ పేరుతో జరుగుతున్న ప్రయత్నాలైనా నేరుగా సభలో పాల్గొని మాట్లాడితే ప్రజలకు చేరేది. రికార్డులో నమోదు అయ్యేది కదా? సభకు దూరంగా ఉండటం పార్టీ తప్పుచేసిందనే అపవాదు మూటగట్టుకోవడంతో పాటు అధికార పక్షానికి మార్గం మరింత సులభం చేసినట్లైందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక బాయ్ కాట్ కు ముందు కవిత హరీశ్ రావును టార్గెట్ చేశారు. ఆ మరుసటి రోజే పార్టీ బహిష్కరణ నిర్ణయం తీసుకోవడంతో తన వల్లే అసెంబ్లీ వదిలి వెళ్లిపోయారని పరిస్థితిని కవిత తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తంగా బాయ్ కాట్ ఇష్యూలో ఏం జరిగింది అనేది పార్టీ అధికారికంగా స్పందిస్తుందా అనేది వేచి చూడాలి.

Read More..

Kavitha: వెక్కి వెక్కి ఏడ్చినా కవితకు డిపాజిట్లు కూడా రావు..మాజీ ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు

తెరపైకి మళ్లీ జిల్లాల పునర్వ్యవస్థీకరణ.. అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

Next Story