- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసీఆర్ ఉంటే రెండేళ్ల క్రితమే పూర్తయ్యేది: ‘టిమ్స్’ ప్రారంభంపై కేటీఆర్ ఫైర్

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్య సదుపాయాలను చేరువ చేయాలనే సంకల్పంతోనే కేసీఆర్ (KCR) ప్రభుత్వం టిమ్స్ (TIMS) హాస్పిటల్స్‌కు అంకురార్పణ చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. సనత్‌నగర్ ‘టిమ్స్’ నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన, ఈ సందర్భంగా ఆసుపత్రి ప్రత్యేకతలు, గత ప్రభుత్వ కృషిని వివరించారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ.. గతంలో కేవలం గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులపైనే భారం ఉండేదని, కానీ నేడు అంతర్జాతీయ ప్రమాణాలతో టిమ్స్ అందుబాటులోకి వచ్చిందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో AIIMS స్థాయి వైద్యం అందించాలనేది కేసీఆర్ విజన్ అని ఆయన స్పష్టం చేశారు. మొత్తం 22 ఎకరాల విశాలమైన ప్రాంగణంలో ‘టిమ్స్’ నిర్మాణం జరిగిందని, దాదాపు రూ.1,200 కోట్ల వ్యయంతో అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దినట్లుగా వెల్లడించారు. 300 ఐసీయూ (ICU) బెడ్లతో సహా వేలాది మందికి చికిత్స అందించే సదుపాయం ఉందని అన్నారు. 16 ఆపరేషన్ థియేటర్లు, ఎంఆర్ఐ (MRI), సీటీ స్కాన్ వంటి డయాగ్నస్టిక్ సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కిడ్నీ సంబంధిత వ్యాధులపై ప్రత్యేక పరిశోధన కేంద్రాలు, రీసెర్చ్ బ్లాక్స్ కూడా ఏర్పాటు చేశారని కేటీఆర్ తెలిపారు.
ప్రజా వైద్యంలో విప్లవాత్మక మార్పులు..
నగరంలోని సనత్‌నగర్, ఎల్‌బీ నగర్, ఆల్వాల్ ప్రాంతాల్లో ‘టిమ్స్’ ఏర్పాటు చేశామని, వరంగల్‌లో 2,000 పడకలతో మరో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణంలో ఉందని కేటీఆర్ గుర్తుచేశారు. నిమ్స్ (NIMS) విస్తరణతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 350 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసి వైద్య వ్యవస్థను ప్రజల వద్దకు తీసుకెళ్లామని వివరించారు. కేసీఆర్ ప్రభుత్వం కొనసాగి ఉంటే ‘టిమ్స్’ ఆసుపత్రి రెండేళ్ల క్రితమే పూర్తయ్యేదని అన్నారు. మిగిలి ఉన్న పనులను ప్రస్తుత ప్రభుత్వం వెంటనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. రోగుల బంధువుల కోసం ధర్మశాల, 1,000 కార్ల పార్కింగ్, ఎమర్జెన్సీ ర్యాంప్ వంటి సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కేటీఆర్ ప్రజలకు సూచించారు.






