ఓయూలో బీ-కేటగిరీ సెక్యూరిటీ తొలగించాలని ఐక్య విద్యార్థి సంఘాల డిమాండ్

by Kodari Anjali |

ఉస్మానియా యూనివర్సిటీలో విధులు నిర్వహిస్తున్న బీ-కేటగిరీ సెక్యూరిటీ సిబ్బందిని వెంటనే తొలగించాలని ఓయూ ఐక్య విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు.

ఓయూలో బీ-కేటగిరీ సెక్యూరిటీ తొలగించాలని ఐక్య విద్యార్థి సంఘాల డిమాండ్
X

దిశ, సికింద్రాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో విధులు నిర్వహిస్తున్న బీ-కేటగిరీ సెక్యూరిటీ సిబ్బందిని వెంటనే తొలగించాలని ఓయూ ఐక్య విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మనబోయిన సైదులు యాదవ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ, యూనివర్సిటీలో విద్యార్థుల భద్రత కంటే విద్యార్థి సంఘాలపై నిర్బంధ చర్యలకే సెక్యూరిటీ సిబ్బంది ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. విద్యార్థి ప్రజాస్వామ్యాన్ని అణిచివేసే విధంగా సెక్యూరిటీ అధికారులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. యూనివర్సిటీలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నప్పటికీ వాటిని అడ్డుకోవడంలో సెక్యూరిటీ విఫలమవుతోందని, బయటి వ్యక్తుల రాకపోకలను నియంత్రించడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆరోపించారు. విద్యార్థి సంఘాల విషయంలో మాత్రం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. యూనివర్సిటీలో సుమారు 300 మంది సెక్యూరిటీ సిబ్బంది పనిచేస్తుండగా, మహిళా సిబ్బంది నియామకాల విషయంలో కూడా నిబంధనలు పాటించడం లేదని ఆరోపించారు. బీ-కేటగిరీ సెక్యూరిటీ వ్యవస్థపై సమగ్ర విచారణ జరిపి, సంబంధిత కాంట్రాక్టును రద్దు చేయాలని వైస్‌చాన్సలర్‌ను డిమాండ్ చేశారు. అదేవిధంగా సెక్యూరిటీ సిబ్బంది జీతభత్యాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై కూడా విచారణ చేపట్టాలని కోరారు. విద్యార్థుల భద్రతను పక్కనపెట్టి, విద్యార్థి ఉద్యమాలను అణచివేయడమే లక్ష్యంగా సెక్యూరిటీ వ్యవస్థ పనిచేస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో జార్జ్ రెడ్డి పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వరరావు, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు స్వాతి, రీసెర్చ్ స్కాలర్ మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story