రామాయపట్నం పోర్టుపై జగన్ సంచలన ఆరోపణలు.. కూటమి సర్కార్ తీరుపై ఫైర్

by Naga Rani Yarlagadda |

రామాయపట్నం పోర్టు విషయమై వైసీపీ అధినేత వైఎస్ జగన్.. కూటమి ప్రభుత్వ తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.

రామాయపట్నం పోర్టుపై జగన్ సంచలన ఆరోపణలు.. కూటమి సర్కార్ తీరుపై ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: రామాయపట్నం పోర్టు విషయమై వైసీపీ అధినేత వైఎస్ జగన్.. కూటమి ప్రభుత్వ తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి, భవిష్యత్తుకు అత్యంత కీలకమైన రామాయపట్నం పోర్టును టీడీపీ పెద్దల జేబులు నింపేందుకు భారీ స్కామ్ గా మార్చారని, రాష్ట్ర ఖజానాకు వేలకోట్ల రూపాయల నష్టం కలిగించేందుకు సిద్ధమైనట్లు సంచలన ఆరోపణలు చేస్తూ.. ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతికి అత్యంత కీలకమైన రామాయపట్నం పోర్టును కూటమి ప్రభుత్వం ఒక పెద్ద స్కామ్‌గా మార్చేసిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రయోజనాలను, ప్రభుత్వ ఖజానాను పణంగా పెట్టి, టీడీపీ పెద్దల జేబులు నింపుకోవడానికే ఈ పోర్టులో పెట్టుబడుల ఉపసంహరణకు తెరలేపారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు రామాయపట్నం పోర్టు భవిష్యత్తుపై ఆయన కూటమి ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేశారు.

మా ప్రభుత్వంలో పోర్టుల విప్లవం.. అన్నీ మేమే చేశాం!

పోర్టుల ఆధారిత అభివృద్ధే నవ్యాంధ్రప్రదేశ్ ఆర్థిక రంగానికి ఊపిరి పోస్తుందనే నమ్మకంతో తమ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట వంటి మూడు కీలక పోర్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని వైఎస్ జగన్ గుర్తుచేశారు. "మా ప్రభుత్వ హయాంలోనే భూసేకరణ, ఆర్థిక వనరుల సమీకరణ (ఫైనాన్షియల్ క్లోజర్)తో పాటు అన్ని రకాల చట్టబద్ధమైన అనుమతులను శరవేగంగా పూర్తి చేశాం. ఈపీసీ (EPC) కాంట్రాక్టులను ఖరారు చేసి, జూన్ 2024 నాటికే ఈ మూడు పోర్టుల నిర్మాణంలో గణనీయమైన భౌతిక పురోగతిని సాధించాం" అని జగన్ స్పష్టం చేశారు.

రాష్ట్రానికి రావాల్సిన భారీ పెట్టుబడులను అడ్డుకుంటున్నారు

తాము చేసిన కట్టుదిట్టమైన ఏర్పాట్ల వల్లే రామాయపట్నం పోర్టును నమ్ముకుని రాష్ట్రానికి భారీ పరిశ్రమలు తరలివచ్చాయని వైఎస్ జగన్ పేర్కొన్నారు. దాదాపు లక్ష కోట్ల పెట్టుబడితో, 9-12 MMTPA సామర్థ్యంతో రానున్న బీపీసీఎల్ (BPCL) గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఈ పోర్టు సామీప్యత వల్లే సాధ్యమైందన్నారు. అలాగే ఇండోసోల్ సోలార్ (Indosol Solar) గిగా స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్, కడపలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ (JSW Steel) నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌కు అవసరమైన ముడి పదార్థాల రవాణా కోసం రామాయపట్నంలో రెండు బెర్తుల అభివృద్ధి పూర్తిగా ఈ పోర్టు ద్వారానే సాధ్యపడుతోందని వివరించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా వేలాది మంది యువతకు ఉపాధి లభించడంతో పాటు, రాష్ట్రానికి పన్నుల రూపంలో భారీ ఆదాయం సమకూరుతుందని, అయితే కూటమి ప్రభుత్వం ఈ ప్రయోజనాలన్నింటినీ నాశనం చేస్తోందని మండిపడ్డారు.

రూ.4,929 కోట్ల పోర్టు.. కేవలం రూ. 1,500 కోట్లకే దారాదత్తమా?

కూటమి ప్రభుత్వ తీరుపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. "ప్రభుత్వం ఏకంగా రూ. 4,929 కోట్లు ప్రజాధనాన్ని ఖర్చు చేసి నిర్మిస్తున్న రామాయపట్నం పోర్టును, కేవలం రూ. 1,500 కోట్ల అప్ ఫ్రంట్ (ముందస్తు) చెల్లింపులకే ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయడానికి టీడీపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఇంతకంటే ఘోరమైన స్కామ్ మరొకటి ఉంటుందా?" అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లడమే కాకుండా, సదరు పోర్టు కోసం తెచ్చిన రూ. 3,500 కోట్లకు పైగా అప్పుల భారాన్ని రాష్ట్ర ప్రజల నెత్తిన రుద్దుతున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు. కేవలం తమ పార్టీ పెద్దలకు నగదు ప్రవాహాలు సృష్టించడానికే కూటమి ప్రభుత్వం ఈ దోపిడీకి తెరలేపిందని ఆయన దుయ్యబట్టారు.

Next Story