వాతావరణానుకూల సాగు చేపట్టాలి : ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

by Batti.Sumithra |

ఖరీఫ్ సీజన్ మొదలైన నేపథ్యంలో ప్రస్తుతం మారుతున్న వాతావరణం, నీటి వనరుల లభ్యతను బట్టి రైతులు పంటల సాగు విధానాన్ని మార్చుకోవాలని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు.

వాతావరణానుకూల సాగు చేపట్టాలి : ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
X

దిశ, నర్సంపేట : ఖరీఫ్ సీజన్ మొదలైన నేపథ్యంలో ప్రస్తుతం మారుతున్న వాతావరణం, నీటి వనరుల లభ్యతను బట్టి రైతులు పంటల సాగు విధానాన్ని మార్చుకోవాలని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. నీటి వనరుల లభ్యత వర్షాభావ పరిస్థితులు, ఆరుతడి పంటల పై రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. నర్సంపేట డివిజన్ పరిధిలో 6 మండలాల పరిధిలోని రైతులు వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వ నిర్దేశాల మేరకు రైతులు ప్రత్యామ్నాయ పంటలకు వెళ్లాల్సిందిగా సూచించారు. నియోజకవర్గ పరిధిలో మొత్తం లక్షా 30 వేల ఎకరాల వ్యవసాయ సాగు జరుగుతున్నట్లు తెలిపారు. పాకాల చెరువు, రంగయ్య చెరువు, మాదన్నపేట చెరువు కింద జరుగుతుందన్నారు. మిగతావి చిన్న చిన్న చెరువులు , బోర్ల ద్వారా పండుతున్నాయన్నారు.

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాలు పడకపోవడం లేదా అధిక వర్షాలు పడే అవకాశం ఉన్నందున రైతులు నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం నిర్దేశించిన ఆరుతడి పంటలు వేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావం వల్ల రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు పంటల ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. నీటి వినియోగాన్ని దృష్టిలో ఉంచుకొని ఆరుతడి పంటల సాగుపై శాస్త్రీయ సూచనలను పాటించాలన్నారు. వ్యవసాయం, ఉద్యానవనం, నీటిపారుదల, భూగర్భ జలాలు, వాతావరణ శాఖల అధికారులు తమ శాఖలకు సంబంధించిన వివరాలను రైతులకు వివరించి, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా చేపట్టాల్సిన చర్యల పై అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్, అదనపు కలెక్టర్ రెవెన్యూ జి.సంధ్యారాణి, నర్సంపేట ఆర్డీవో ఉమారాణి, జడ్పీ సీఈవో రామ్ రెడ్డి వ్యవసాయ శాఖ అధికారి విజయ్ భాస్కర్, జిల్లా హార్టికల్చర్ అధికారి శ్రీనివాసరావు, ఎలక్ట్రిసిటీ ఎస్ ఈ ఆనందం, ఇరిగేషన్ ఎస్.ఈ సంబంధిత మండలాల తహశీల్దార్లు, సంబంధిత శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Next Story