- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
11 లక్షల మందికిపైగా ఉద్యోగాలు..! ఐటీ రంగంలో ఇమేజ్ 2.0 పాలసీల ప్రారంభానికి ప్రభుత్వం కసరత్తు
ఐటీ రంగంలో లక్ష్యాలను వేగంగా సాధించేందుకు తెలంగాణ ప్రభుత్వం బలమైన అడుగులు వేస్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే గ్లోబల్ కేపబులిటీ సెంటర్(జీసీసీ) పాలసీ, ఇమేజ్ 2.0 పాలసీలను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తుంది.

దిశ, తెలంగాణ బ్యూరో: ఐటీ రంగంలో లక్ష్యాలను వేగంగా సాధించేందుకు తెలంగాణ ప్రభుత్వం బలమైన అడుగులు వేస్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే గ్లోబల్ కేపబులిటీ సెంటర్(జీసీసీ) పాలసీ, ఇమేజ్ 2.0 పాలసీలను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తుంది. గ్లోబల్ కంపెనీల పెట్టుబడులను ఆకర్షించడం, ఉపాధి అవకాశాలను పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పాలసీలను అమలు చేయనుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం ఐటీ ఎగుమతులను రూ.3.60 లక్షల కోట్లకు చేర్చడంతోపాటు 11 లక్షలకు పైగా ఉపాధి కల్పన లక్ష్యంగా పెట్టుకుంది. గత ఆర్థిక సంవత్సరాలతో పోలిస్తే ఈ లక్ష్యాలు గణనీయంగా పెరిగాయి. పరిశ్రమల నుంచి నేరుగా నిపుణులను తీసుకొచ్చి ఐటీ పెట్టుబడుల ప్రోత్సాహం, అంతర్జాతీయ భాగస్వామ్యాలను బలోపేతం చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకుంది. జీసీసీ, ఇమేజ్ 2.0 పాలసీలతో పాటు అంతర్జాతీయ ప్రచార కార్యక్రమాల ద్వారా తెలంగాణను దేశంలోనే కాకుండా ప్రపంచ ఐటీ మ్యాప్‌లో మరింత బలమైన స్థానంలో చూపించే ప్రయత్నం చేస్తుంది.
జీసీసీలను ఆకర్షించడమే లక్ష్యం..
వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్ సమావేశాల సందర్భంగా ఈ నెల 19న మరోసారి సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెళ్తున్నారు. ఈ సమావేశాల్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) ఆకర్షించే లక్ష్యంతో రోడ్ షోను నిర్వహించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బహుళజాతి కంపెనీలను ఆకర్షించడం, హైదరాబాద్‌ను జీసీసీ హబ్‌గా ప్రచారం చేయడం.. తదుపరి ఐటీ, డిజిటల్ సేవలు, ఆర్అండ్‌డీ రంగాల్లో పెట్టుబడులు పెంచడమే ఉద్దేశంగా ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈ రోడ్‌షోలో గ్లోబల్ సీఈవోలు, సీనియర్ ఎగ్జిక్యూటివ్లతో వన్ టు వన్ సమావేశాలు, జీసీసీ పాలసీ, ప్రోత్సాహకాలు (ఇన్సెంటివ్స్)పై ప్రజెంటేషన్లు, యూరప్, అమెరికా, ఆసియా కంపెనీలతో పెట్టుబడి చర్చలు, తెలంగాణ ఐటీ ఎకో సిస్టంపై అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేయనున్నారు. దీని ద్వారా కొత్త జీసీసీల స్థాపనకు మార్గం సుగమం, భారీ పెట్టుబడులు, ఉన్నత స్థాయి ఉద్యోగాలు, ఐటీ ఎగుమతుల వృద్ధి, ప్రపంచ ఐటీ మ్యాప్‌లో తెలంగాణ స్థానం మరింత బలపడటం వంటి ప్రయోజనాలు రాష్ట్రానికి చేకూరనున్నాయి. ప్రపంచ ఐటీ దిగ్గజాల ముందు రాష్ట్ర సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు ప్రభుత్వం మరింతగా ఫోకస్ పెట్టింది. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ లక్ష్యంగా మిషన్ 2047 ప్రభుత్వం ముందుకు సాగుతోంది. జీసీసీల ద్వారా సాఫ్ట్‌వేర్ డెవలప్మెంట్, కృత్రిమ మేధ (ఏఐ), మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, ఫైనాన్షియల్ సర్వీసులు, బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టనున్నారు. జీసీసీల రాకతో ఐటీ ఎగుమతులు సైతం భారీగా పెరుగతాయని ప్రభుత్వం భావిస్తున్నది. అంతేకాకుండా.. ఉన్నత స్థాయి ఉద్యోగాలు కల్పన సాధ్యమవుతుంది. రాష్ట్ర ఆదాయం, అంతర్జాతీయ గుర్తింపు పెరుగుతుంది.
ఎంటర్‌టైన్‌మెంట్ రంగం లక్ష్యంగా ఇమేజ్ 2.0
రాష్ట్రంలో కొత్తగా ఇమేజ్ 2.0 (ఇన్నోవేషన్ ఇన్ మల్టీ మీడియా, యానిమేషన్, గేమింగ్అండ్ ఎంటర్‌టైన్‌మెంట్) పాలసీని ప్రభుత్వం తీసుకురాబోతున్నది. మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ రంగ అభివృద్ధికి ఇది దోహదపడనుంది. ఇది ఇప్పటికే అమలులో ఉన్న ఇమేజ్ పాలసీకి ఆధునిక రూపంలో తీసుకొస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇమేజ్ 2.0 పాలసీతో యానిమేషన్, గేమింగ్, విజువల్ ఎఫెక్ట్స్, డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగాల్లో తెలంగాణను జాతీయ-అంతర్జాతీయ హబ్‌గా మార్చడం, కొత్త టెక్నాలజీల ఆధారంగా సృజనాత్మక పరిశ్రమలను ప్రోత్సహించడం, యువతకు క్రియేటివ్, హైస్కిల్ ఉద్యోగాలు కల్పించడం సాధ్యమవుతుంది. ఈ పాలసీ కింద యానిమేషన్ అండ్ వీఎఫ్ఎక్స్, గేమింగ్, మొబైల్, కన్సోల్, స్పోర్ట్స్, ఫిల్మ్ అండ్ డిజిటల్ కంటెంట్ ప్రొడక్షన్, ఏఆర్, వీఆర్, టెక్నాలజీలు, మెటావర్స్, డిజిటల్ స్టోరీ టెల్లింగ్ వంటి రంగాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. దీంతో క్రియేటివ్ ఇండస్ట్రీలో పెట్టుబడులు పెరుగనున్నాయి. అలాగే.. స్టార్టప్‌లకు సైతం కొత్త అవకాశాలు లభిస్తాయి. గ్లోబల్ ప్రొడక్షన్ హౌసులు, గేమింగ్ కంపెనీలు రాష్ట్రానికి వస్తాయి.
కన్సల్టెంట్ల నియామకంపై ఫోకస్
రాష్ట్ర ప్రభుత్వం ఐటీ రంగాన్ని ప్రోత్సహించేందుకు కొత్త పాలసీలు, అంతర్జాతీయ రోడ్ షోలు చేపడుతున్నప్పటికీ, వాటిని అమలు చేసే స్థాయిలో అనుభవజ్ఞులైన సిబ్బంది కొరత వేధిస్తోంది. ఐటీ ప్రమోషన్లు, గ్లోబల్ పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేక నైపుణ్యాలు, అంతర్జాతీయ అనుభవం ఉన్న అధికారులు అవసరం ఉంది. అయితే.. ఖాళీగా ఉన్న పోస్టులను ఫిల్ చేయడానికి తగిన అర్హతలున్న సిబ్బంది అందుబాటులో లేరు. వేగంగా మారుతున్న టెక్నాలజీ ట్రెండ్స్‌కు అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగంలో స్కిల్ గ్యాప్ ఉండటం ప్రధాన సమస్యగా మారింది. దీంతో పెట్టుబడి చర్చలు ఆలస్యం కావడం, అంతర్జాతీయ కంపెనీలతో సమర్థవంతమైన ఫాలోఅప్ లేకపోవడం, పాలసీల అమలు వేగం తగ్గే అవకాశం కనిపిస్తోంది. అందుకే ఈ సవాల్‌ను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల నుంచి నేరుగా అనుభవజ్ఞులైన కన్సల్టెంట్లను నియమించాలనే దిశగా ఆలోచన చేస్తున్నది. దీని ద్వారా ఐటీ ప్రమోషన్లు, జీసీసీ పెట్టుబడుల సమీకరణకు అవసరమైన నైపుణ్య లోటును పూరించాలని లక్ష్యంగా పెట్టుకున్నది.
ఈ నేపథ్యంలోనే పరిశ్రమల కన్సల్టెంట్ల నియామకంపై దృష్టి పెట్టింది. గ్లోబల్ కంపెనీలతో నేరుగా సంప్రదింపులు, జీసీసీ పాలసీ అమలు, ఇన్సెంటివ్స్ రూపకల్పనలో సహకారం, దావోస్ వంటి అంతర్జాతీయ వేదికలపై పెట్టుబడి ప్రచారానికి వ్యూహాత్మక మద్దతు, ఐటీ ప్రమోషన్లలో ప్రభుత్వానికి టెక్నికల్ అడ్వైజరీ అంశాల్లో కన్సల్టెంట్లు కీలక పాత్ర పోషించనున్నారు. వీరి నియామకం ద్వారా పెట్టుబడి చర్చల్లో వేగం పెరగడం, కొత్త జీసీసీల స్థాపనకు దారి వేయడం, ఐటీ ఎగుమతులు, ఉపాధి లక్ష్యాల సాధన సులభతరం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. అందుకే వీలైనంత త్వరగా వీరి నియామకాలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది.
Read More..






