- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: భూ రికార్డుల్లో సరికొత్త శకం: సర్వే మ్యాప్‌తో తొలి రిజిస్ట్రేషన్
రైతు జీవితం భూమితో ముడిపడి ఉందని, ఆ భూమిపై హక్కులు స్పష్టంగా ఉన్నప్పుడే జీవితం భద్రంగా ఉంటుందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రైతు జీవితం భూమితో ముడిపడి ఉందని, ఆ భూమిపై హక్కులు స్పష్టంగా ఉన్నప్పుడే జీవితం భద్రంగా ఉంటుందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆ హక్కును సర్వే మ్యాప్, భూధార్ నంబర్‌తో శాశ్వతంగా నిర్ధారించినపుడే రైతుకు ధైర్యం, కుటుంబానికి భరోసా, భవిష్యత్తుపై నమ్మకం కలుగుతుందన్నారు. రెవెన్యూ వ్యవస్థను సమూలంగా బలోపేతం చేస్తూ, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందన్నారు. ఇందులో భాగంగా ల్యాండ్, సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలను ఒకే గొడుగు కిందికి తీసుకువచ్చి రూపొందించిన ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్‌ను ఈ నెల 2వ తేదీ నుంచి ఐదు మండలాల్లో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామన్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాప్ తప్పనిసరి అనే నిబంధనను భూ భారతి చట్టంలో పొందుపరిచామని, అదే విధంగా ఎవరైనా స్వచ్ఛందంగా వారి ఆస్తులకు సంబంధించిన సర్వే సర్టిఫికేట్ కు కూడా దరఖాస్తు చేసుకొని దృవీకరించుకోవచ్చన్నారు. ఇందులో భాగంగా భూ భారతి చట్టంలో పేర్కొన్న విధంగా రిజిస్ట్రేషన్‌కు సర్వే మ్యాప్ ఉండాలన్న నిబంధనను ఐదు మండలాల్లో అమలు చేస్తున్నామన్నారు. మంగళవారం ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని కుసుమంచి మండలం మోటాపురంలో సర్వే మ్యాప్‌తో తొలి రిజిస్ట్రేషన్ చేసి చారిత్రాత్మకమైన అడుగు వేశామన్నారు. సర్వే మ్యాప్‌తో తొలి రిజిస్ట్రేషన్ అయిన సందర్బంగా మంత్రి స్పందిస్తూ ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు.
హద్దులతో మ్యాప్..
కూసుమంచి మండలం మోటాపురం సర్వే నం.156/ఇ/1 లోగల ఒక 1.04 ఎకరాలను నేలకొండపల్లి మండలం ముత్తాపురం గ్రామానికి చెందిన చెందిన భాగం కిషన్‌రావు అనే రైతు అదే గ్రామానికి చెందిన కట్టా వెంకటేశ్వరరావుకు విక్రయించారు. ఈ సందర్బంగా తన భూమి హద్దులతో కూడిన మ్యాప్ ను జతచేసి కూసుమంచి తహశీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేశారు. దీనికి సంబంధించి ( భూ కమత పటము-1, భూధార్ నెంబర్ 795GCHDCUPJ7H0) ను తహశీల్ధార్ కేటాయించారు. ఇదే విధానాన్ని దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి భూవివాదాలకు శాశ్వత పరిష్కారం లభించే విధంగా తమ ప్రభుత్వం చిత్తశుద్దితో పని చేస్తుందన్నారు. భూ భారతి చట్టం ద్వారా ప్రభుత్వం భూ వ్యవహారాల్లో పూర్తి స్థాయి పారదర్శకతను తీసుకొచ్చిందన్నారు. ప్రతి భూమికి ఖచ్చితమైన సర్వే మ్యాప్, ప్రత్యేక భూధార్ నంబరు కేటాయించడం ద్వారా యాజమాన్యంపై ఎలాంటి సందేహాలకు తావు లేకుండా చేస్తోందన్నారు. సర్వే విషయంలో పాత విధానాలకు స్వస్తి చెప్పి అధునాతన రోవర్లను వినియోగిస్తూ కచ్చితత్వంతో సర్వే పూర్తి చేయిస్తున్నామన్నారు.






