రిటైర్మెంట్ రోజే గుడ్‌న్యూస్.. స్టేట్ సెక్యూరిటీ అడ్వైజర్‌గా DGP శివధర్ రెడ్డి?

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-30 04:27:13  IST  )

రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలక బాధ్యతలు అప్పగించనుంది.

రిటైర్మెంట్ రోజే గుడ్‌న్యూస్.. స్టేట్ సెక్యూరిటీ అడ్వైజర్‌గా DGP శివధర్ రెడ్డి?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర భద్రతా సలహాదారుగా బత్తుల శివధర్ రెడ్డి (Bathula Shivadhar Reddy) నియామకం ఖరారైనట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన, ఇవాళ పదవీ విరమణ చేయనున్నారు. రిటైర్మెంట్ అనంతరం ఆయన ఈ కొత్త బాధ్యతలను చేపట్టే అవకాశం ఉంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాతో కూడిన ఈ పదవిలో శివధర్ రెడ్డి మూడేళ్ల పాటు కొనసాగనున్నట్లుగా సమాచారం. అయితే, ఆయన నియామకానికి సంబంధించి మరికొద్దిసేపట్లో అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam) మండలం తులేకలాన్ గ్రామానికి చెందిన శివధర్ రెడ్డి, 1994 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ఆయన గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏఎస్పీగా, ఎస్పీగా వివిధ జిల్లాల్లో సేవలందించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్‌గా, పర్సనల్ విభాగంలో ఐజీపీగా, అదనపు డీజీపీగా పనిచేశారు. రోడ్డు భద్రతా విభాగంలోనూ అదనపు డీజీపీగా బాధ్యతలు నిర్వర్తించారు. 2023 డిసెంబర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శివధర్ రెడ్డిని తిరిగి ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమించింది. ఆ తర్వాత అక్టోబర్‌లో ఆయన డీజీపీగా పదోన్నతి పొందారు. ఇక తెలంగాణ తొలి డీజీపీ అనురాగ్ శర్మ 2017లో పదవీ విరమణ పొందిన తర్వాత, ఆయన మూడేళ్ల పాటు ప్రభుత్వ సలహాదారుగా పనిచేశారు. ఆయన తర్వాత ఏ డీజీపీ కూడా రిటైర్మెంట్ అనంతరం నేరుగా సలహాదారుగా నియమితులు కాలేదు. మళ్లీ ఇన్నేళ్లకు శివధర్ రెడ్డికి ఆ అవకాశం లభించడం విశేషం.

డీజీపీ శివధర్ రెడ్డికి గ్రాండ్ ఫేర్‌వెల్.. చివరి రోజు కీలక విషయం రివీల్ చేసిన డీజీపీ

Next Story