TG: తెలంగాణలో మరోసారి ఘర్ వాపసీ రాజకీయాలు! మున్సిపల్ ఎన్నికలు ముగియగానే బిగ్ బ్లాస్టింగ్?

by Prasad Jukanti |   (  Updated:2026-01-11 10:34:55  IST  )

ఇప్పటి వరకు ఒక లెక్క ఇకపై మరో లెక్క అన్నట్లు రాష్ట్ర రాజకీయాల పరిస్థితులు మారుతున్నాయి.

TG: తెలంగాణలో మరోసారి ఘర్ వాపసీ రాజకీయాలు! మున్సిపల్ ఎన్నికలు ముగియగానే బిగ్ బ్లాస్టింగ్?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు (Telangana Politics) మంచి రసపట్టుగా సాగుతున్నాయి. అధికార,విపక్షాల మధ్య ఎత్తుకు పై ఎత్తులతో పొలిటికల్ గ్రౌండ్ హీటెక్కుతోంది. కాంగ్రెస్ పార్టీ (Congress) అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకోవడంతో ఆ పార్టీకి ఇచ్చిన గడువు ముగిసిందని ఇక ప్రజాక్షేత్రంలో పూర్తిస్థాయిలో ఎండగడుతామని ప్రతిపక్షాలు అల్టిమేటం ఇస్తుంటే గడిచిన పదేళ్లలో జరగని అభివృద్ధి, సంక్షేమం ఈ రెండేళ్లలో చేసి చూపామని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో పార్టీల బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. దీంతో రాష్ట్ర రాజకీయాలు ఇప్పటి వరకు ఒక లెక్క ఇకపై మరో లెక్క అన్నట్లు పరిస్థితులు మారుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఘర్ వాపసీ రాజకీయం (Ghar Wapsi Politics) హాట్ టాపిక్‍గా మారింది. పార్టీ వీడి పలు పార్టీల్లో చేరిన వారికి తలుపులు తెరిచే ఉంటాయనే సంకేతాలు అన్ని ప్రధాన పార్టీలు ఇవ్వడంతో త్వరలోనే రాష్ట్రం రాజకీయ చదరంగంలో సంచలనం తప్పదా? అనే చర్చ వినిపిస్తోంది.

ప్రధాన పార్టీల ఘర్ వాపసీ మంత్రం:

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు ఆ తర్వాతా ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఆపై జీహెచ్ఎంసీ వంటి కీలక ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలంటే అంతకు ముందు ఈ ఎన్నికల్లో విజయం సాధించి పార్టీ పట్టును ప్రజాక్షేత్రంలో నిలుపుకోవడం అన్ని పార్టీలకు అనివార్యమైన పరిస్థితి. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‍గా రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఓ వైఫ ఘర్ వాపసీ పేరుతో ప్రధాన పార్టీలు తమ పాత మిత్రులకు గాలం వేసే పనిలో బిజీగా ఉంటే మరో వైపు కల్వకుంట్ల కవిత వంటి వారు కొత్త రాజకీయ పార్టీని ప్రకటించేందుకు కావాల్సిన కసరత్తు చేస్తున్నారు. దీంతో 2026 సంవత్సరం తెలంగాణ రాజకీయ చరిత్రలో అనేక పరిణామాలకు కేరాఫ్‍గా నిలవబోతోందనే చర్చ సోషల్ మీడియాలో గుప్పుమంటోంది. ఈ క్రమంలో అన్ని పార్టీల ఆలోచనలు ఘర్ వాపసీ చుట్టూ తిరగడం ఆసక్తిగా మారుతోంది. మాజీ నేతలకు డోర్లు ఇంకా తెరిచే ఉన్నాయని గతంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రకటించగా, వివిధ కారణాలతో బీజేపీని (BJP) వీడిన వారు తిరిగి వెనక్కి రావాలని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ (BRS) స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఇప్పటికే జిల్లాల్లో చేరికలను మొదలు పెట్టింది.

ఎవరు ఎటువైపు?

ఘర్ వాపసీ విషయంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. అన్ని పార్టీలు తమ పాత నేతలకు గాలం వేస్తుండటంతో ఏ నేత ఎటువైపు ఉండబోతున్నారు అనేది ఉత్కంఠగా మారింది. ఇందులో ప్రధానంగా చర్చ జరుగుతున్న వారిలో ఈటల రాజేందర్ కీలకంగా ఉన్నారు. ఈటల రాజేందర్ తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరబోతున్నారనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో జోరుగా వినిపిస్తోంది. గత కొంత కాలంగా బీజేపీలో జరుగుతున్న పరిణామాలు ముఖ్యంగా కేంద్ర మంత్రి బండి సంజయ్‍కు ఆయనకు మధ్య విభేదాలు తీవ్రతరం అవుతున్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈటల రాజేందర్ కోసం బీఆర్ఎస్ లో కుర్చీ ఎదురు చూస్తోందని ఆయన తిరిగి బీఆర్ఎస్ వైపు ఆలోచిస్తున్నారని బీఆర్ఎస్ మద్దతుదారుల సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టులు ఇటీవల వైరల్‍గా మారుతున్నాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈటలతో పాటు మరికొంత మంది నేతల విషయంలో కేసీఆర్ సైతం వెనక్కి తగ్గారనే ప్రచారం తెరమీదకు వచ్చింది. అయితే పార్టీ మారడం అంత ఈజీ కాదని గతంలోనే ఈ తరహా ప్రచారాన్ని ఈటల ఖండించినా ఆయన విషయంలో ప్రచారం మాత్రం ఆగడం లేదు. ఇక ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం తనకు మంత్రి పదవి రాకపోతే తిరిగి బీజేపీ వైపు వెళ్లేందుకు ఆలోచిస్తున్నారనే ఉహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయా కారణాలతో కాంగ్రెస్‍ను వీడిన వారిని తిరిగి వెన్కకి రప్పించేందుకు హస్తం పార్టీ ఇదివరకు నుంచే ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలో ఘర్ వాపసీ చర్చ ఇలా ఉంటే మరో వైపు వచ్చే ఉగాది నాటికి కవిత కొత్త పార్టీ అనౌన్స్ చేస్తారనే టాక్ అందరిని ఉత్కంఠ పెడుతోంది. రాష్ట్రంలో కొత్త పార్టీలు పుట్టుకు వస్తే వాటి తాలుకా పరిణామాలు రాష్ట్ర రాజకీయాలను ఏ మేరకు ప్రభావితం చేస్తాయనేది కీలకంగా మారబోతున్నాయి. మొత్తంగా రాష్ట్రంలోని రాజకీయ పరిణామాల నేపథ్యంలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో ఓ బిగ్ బ్లాస్ట్ ఉండబోతోందా? సోషల్ మీడియాలో జరుగుతున్న ఊహాగానాల వెనుక రీజన్ ఇదేనా అంటే కాలమే సమాధానం చెప్పనుంది.

READ MORE .....

మున్సి"పోల్స్"కు కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యూహాలు.. సర్వేలపై ఉత్కంఠ

Next Story