మున్సి"పోల్స్"కు కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యూహాలు.. సర్వేలపై ఉత్కంఠ

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-01-11 10:36:13  IST  )

మున్సిపల్​ఎన్నికలకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ ఎలక్షన్స్‌ను సైతం ఆయా పార్టీలు సవాల్‌గా తీసుకుంటున్నాయి.

మున్సిపోల్స్కు కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యూహాలు.. సర్వేలపై ఉత్కంఠ
X

దిశ, తెలంగాణ బ్యూరో : మున్సిపల్​ఎన్నికలకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ ఎలక్షన్స్‌ను సైతం ఆయా పార్టీలు సవాల్‌గా తీసుకుంటున్నాయి. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా వార్డులు, డివిజన్లలో సర్వేలు చేయించి క్యాండిడేట్లను ఫైనల్ చేయాలని అనుకున్నాయి.

మొదటి దఫాలో పార్టీకి ఉన్న ఆదరణపై సర్వే

మున్సిపల్ ఎన్ని్కల్లో పై చేయి సాధించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతున్నాయి. మొదటి దఫాలో ఆయా వార్డులు, డివిజన్లలో ఏ పార్టీకి ఆదరణ ఉంది.. ప్రజలు ఏ గుర్తుకు ఓటు వేస్తారంటూ సర్వేలు చేయించాయి. దీన్ని బట్టి వార్డుల్లో తమ తమ పార్టీకి ఉన్న ఆదరణ ఎంత అన్న క్లారిటీకి రానున్నాయి. తాము అక్కడ ఏ మేరకు ప్రభావం చూపుతాము.. గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి? మేయర్, చైర్మన్​స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉందా? లేదా? అనే విషయంలో క్లారిటీకి రానున్నాయి.

రిజర్వేషన్లు వచ్చాక మరోసారి..

ఇప్పటి వరకు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారు చేయలేదు. రిజర్వేషన్లు వచ్చాక​వార్డుల వారీగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మరో సారి సర్వే చేయించనున్నాయి. ఏ సామాజిక వర్గానికి సీటు రిజర్వ్​అయ్యింది.. అనే కోణంలో ఒక్కో పార్టీ నుంచి ముగ్గురు లేదా ఐదుగురు క్యాండిడేట్ల పేరుతో సర్వే చేయించాలని నిర్ణయించాయి. ఇందులో ఎవరికి అనుకూలంగా ఫలితాలు వస్తే వారికే టిక్కెట్ ఇవ్వాలని అనుకున్నాయి. తమకు గెలుపు గుర్రాలే ముఖ్యమని, సీనియరిటీ, డబ్బులు ఉన్నాయా.. లేవా అనే దానిని పట్టించుకోకుండా గెలుపు అవకాశాలే ప్రామాణికంగా తీసుకొని ముందుకెళ్లాలని నిర్ణయించాయి.

ఐదు పేర్లు ఇవ్వాలని కాంగ్రెస్​ఆదేశం

మున్సిపల్​ఎన్నికల్లో ఎలాగైనా ఏకపక్షంగా ఫలితాలు సాధించాలనే ఉద్దేశంతో ఒక్కో వార్డు, డివిజన్​నుంచి ఐదు పేర్లు ఇవ్వాలని కాంగ్రెస్​పార్టీ తమ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలకు సూచించింది. తమకు ఇష్టం వచ్చిన వారికి టిక్కెట్లు ఇవ్వకుండా గెలుపు గుర్రాలే ప్రామాణికంగా పేర్లు ఇవ్వాలని ఆదేశించింది. సర్వే చేయించి గెలిచే వారి పేర్లను పీసీసీ స్థాయిలో కాకుండా స్థానిక ఎమ్మెల్యే లేదా ఇన్‌చార్జి ద్వారానే ప్రకటించనున్నారు. దీని ద్వారా అభ్యర్థులు వారికే విధేయులుగా ఉంటారని, పీసీసీ ప్రకటిస్తే భవిష్యత్‌లో స్థానికంగా ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో కాంగ్రెస్ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.

సర్వే దారిలోనే బీఆర్ఎస్

మున్సిపల్ ఎన్నికల్లో తమ క్యాండిడేట్లను సర్వేల ద్వారానే ఎంపిక చేయించాలని బీఆర్ఎస్ పార్టీ సైతం నిర్ణయం తీసుకున్నది. కాంగ్రెస్​ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, దానిని ఓటు రూపంలో మల్చుకోవాలని, ఇప్పటికే సర్పంచ్​ఎలక్షన్స్‌లో ప్రజలు తమ మూడ్​తెలిపారని, దాని ద్వారా మున్సిపల్​ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇందు కోసం మంచి అభ్యర్థులను ఎంపిక చేయాలని డిసైడ్ అయ్యారు. స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండి, వారి కష్టసుఖాల్లో పాలు పంచుకునే వారు ఉంటేనే ప్రజలు ఓట్లు వేస్తారని పార్టీ స్థానిక నాయకులకు రాష్ట్ర నాయకత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఒక్కో డివిజన్, వార్డు నుంచి మూడు నుంచి 5 పేర్లు ఇవ్వాలని నిర్ణయించారు. వీరిపై సర్వే చేయించి టిక్కెట్లు ఇవ్వనున్నారు.

READ MORE .....

TG: తెలంగాణలో మరోసారి ఘర్ వాపసీ రాజకీయాలు! మున్సిపల్ ఎన్నికలు ముగియగానే బిగ్ బ్లాస్టింగ్?

Next Story