రిజర్వు ఫారెస్ట్‌గా 13,178.03 ఎకరాల భూమి.. నోటిఫికేషన్ జారీ చేసిన అటవీ శాఖ

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-13 14:55:49  IST  )

యాదాద్రి భువనగిరి జిల్లాలో 13,178.03 ఎకరాల సాధారణ (రక్షిత) అటవీ భూభాగాన్ని (విస్తీర్ణాన్ని) రాష్ట ప్రభుత్వ రిజర్వు ఫారెస్ట్ కిందకు బదిలీ చేసింది.

రిజర్వు ఫారెస్ట్‌గా 13,178.03 ఎకరాల భూమి.. నోటిఫికేషన్ జారీ చేసిన అటవీ శాఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: యాదాద్రి భువనగిరి జిల్లాలో 13,178.03 ఎకరాల సాధారణ (రక్షిత) అటవీ భూభాగాన్ని (విస్తీర్ణాన్ని) రాష్ట ప్రభుత్వ రిజర్వు ఫారెస్ట్ కిందకు బదిలీ చేసింది. అందుకు సంబంధించి ఉత్తర్వులను పర్యావరణం, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ముఖ్య కార్యదర్శి నదీం అహ్మద్ జారీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని నారాయణపూర్ మండలం మహమ్మదాబాద్, నారాయణపూర్, రాచకొండ గ్రామాల పరిధిలో విస్తరించిన 13,178.03 ఎకరాల అటవీ భూమిని రిజర్వు ఫారెస్ట్ కిందకు మార్చుతూ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ రిజర్వు ఫారెస్ట్ ప్రాంతానికి హద్దులు సైతం నిర్ధారించారు. సరిహద్దులకు జియో ట్యాగింగ్ కూడా అనుసంధానం చేశారు. తర్వలోనే కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తూ గెజిట్‌ను విడదల చేయనున్నది.

రిజర్వు ఫారెస్ట్ అంటే..?

రిజర్వు ఫారెస్ట్‌గా డీ నోటిఫైడ్ చేసిన అటవీ ప్రాంతంలోకి ఇక నుంచి ఎవరు అనుమతి లేకుండా ప్రవేశించకూడదు. అక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకూడదు. ప్రత్యేక అనుమతులు ఉంటేనే అడవిలోకి అనుమతిస్తారు. సాధారణ (రక్షిత) అడవుల్లోకి అనుమతి లేకపోయినా వెళ్లి రావచ్చు. అంతే కాకుండా అక్కడి ప్రజలు అటవీ వనరులు, ఇతర ఉత్పత్తులపై పాక్షికంగా లేదా పూర్తి జీవనోపాధి పొందవచ్చు. సాధారణ అటవీ నుంచి రిజర్వు (అభయారణ్యం) ఫారెస్ట్‌గా మార్చితే అటవీ చట్టాల ప్రకారం అనేక నిబంధనలు అమల్లోకి వస్తాయి. ప్రత్యేక ఆదేశాలు కూడా జారీ అవుతాయి. సాధారణ కార్యకలాపాలు పూర్తిగా నిషేధించనున్నారు.

వివిధ మార్గాలకు ప్రత్యేక స్థలం కేటాయింపు..

అటవీ శాఖ పేర్కొన్న ఈ మార్గాల ద్వారా మాత్రమే వెళ్లేందుకు అనుమతిస్తారు. నారాయణపూర్ నుంచి తిప్పాయిగూడ గ్రామానికి వెళ్లే మార్గంలో రహదారుల ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించారు. అటవీ బ్లాక్‌లోకి ప్రవేశించేందుకు ఉత్తర-పశ్చిమ దిశలో రహదారికి స్థలం కేటాయించారు. ఎన్‌క్లోజర్ లైన్ మధ్య ఉన్న మరో ఎన్‌క్లోజర్ నంబర్‌లోకి ప్రవేశించేందుకు, అటవీ బ్లాక్‌లోకి వెళ్లేందుకు కొంత స్థలం కేటాయించారు. అల్లాపూర్ గ్రామం నుంచి ఫారెస్ట్ రోడ్డు వరకు ట్రాక్ ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించారు. నారాయణపూర్ నుంచి తిప్పయ్యగూడ మీదుగా ఫారెస్ట్ రోడ్డును కలుపుతూ ట్రాక్ ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించారు. మహమ్మదాబాద్ నుంచి పీపల్‌పహాడ్ గ్రామానికి కాలినక మార్గం కోసం ఫారెస్ట్ బ్లాక్‌లోకి ప్రవేశించేందుకు ప్రత్యేక స్థలం కేటాయించారు. కేటాయించిన ఈ మార్గాల ద్వార మాత్రమే అక్కడి ప్రజలు, జంతువులు, వాహనాలు రాకపోకలు సాగించేందుకు మాత్రమే అటవీ అధికారులు అనుమతిస్తారు.

Next Story