మొదట 21 కి.మీ మేర మూసీ పునరుద్ధరణ పనులు.. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-02 06:53:37  IST  )

నదీ పరివాహక ప్రాంతంలోనే అభివృద్ధి శరవేగంగా జరుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు.

మొదట 21 కి.మీ మేర మూసీ పునరుద్ధరణ పనులు.. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: నదీ పరివాహక ప్రాంతంలోనే అభివృద్ధి శరవేగంగా జరుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఇవాళ అసెంబ్లీలో మూసీ పునరుద్ధరణ (Musi Restoration)పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనంతగిరి హిల్స్ నుంచి వాడపల్లి వరకు మూసీ ప్రవాహం దాదాపు 240 కి.మీ ప్రవహిస్తుందని తెలిపారు. మూసీ, ఈసా నదులు కలిసే చోటు బాపూఘాట్ ఉందని.. అందుకే అక్కడ గాంధీ సరోవర్ ప్రాజెక్టు (Gandhi Sarovar Project)కు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. మూసీ ప్రక్షాళనకు రెండేళ్లు ఎన్నో సమీక్షలు జరిపామని అన్నారు. వరద ముప్పును తప్పించేందుకు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ఆనాడు నిజాం నవాబులు నిర్మించారని రేవంత్ పేర్కొన్నారు.

మమ్మల్ని బద్నాం చేసేందుకు రూ.లక్షల కోట్లు ఖర్చు..

వికారాబాద్ (Vikarabad) అడవుల్లో వనమూలికలను నిజాం పెంచారని.. కానీ, నగర శివారులో కొందరు ఫాంహౌస్‌లు కట్టి డ్రైనేజీలు తీసుకెళ్లి గండిపేటలో కలిపారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ముగ్గురు నీరంతా తీసుకెళ్లి మూసీలో కలిపారని.. ఇవాళ నదీ పరివాహక ప్రాంతాన్ని కూడా నివాసయోగ్యం కాకుండా చేశారని ఫైర్ అయ్యారు. తాము అధికారంలోకి వచ్చాక ఫాంహౌస్‌లపై కఠిన చర్యలు తీసుకున్నామని తెలిపారు. కానీ, కొందరు పనిగట్టుకుని మాపై సోషల్ మీడియా (Social Media)లో రూ.లక్షల కోట్లు ఖర్చు చేసి బద్నాం చేశారని ఆరోపించారు. గుజరాత్‌లో కూడా ఇలాంటి పరిస్థితి ఉంటే.. అక్కడ సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టారని, అక్కడి నుంచి 60 వేల కుటుంబాలను కూడా తరలించారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. యూపీలో గంగానది ప్రక్షాళనకు వేలాది మందిని తరలించారని, ఢిల్లీలో యమునాను ప్రక్షాళన చేస్తామంటేనే బీజేపీ వాళ్లు గెలిచారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

మూసీ మురుగుతో నల్గొండకు శిక్ష..

మూసీ మురుగు శిక్షను నల్గొండ ప్రజలు అనుభవిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మరోవైపు ఫ్లోరైడ్‌తో ఆ జిల్లా ప్రజలకు దేవుడు శిక్ష వేశాడని సభలో ప్రస్తావించారు. మూసీ నీళ్లు నల్గొండ జిల్లా ప్రజలకు గుడిబండలా మారాయని పేర్కొన్నారు. అక్కడి మూసీ పరివాహకంలో నీళ్లు తాగితే పిల్లలు పుట్టని పరిస్థితి ఉందని ఎమోషనల్ అయ్యారు. చివరికి పంటలు పండించలేని దుస్థితి దాపురించిందని తెలిపారు.

51 కి.మీ మేర ఎలివేటెడ్ కారిడార్లు

మూసీ ప్రక్షాళనకు మొదట 21 కి.మీ మేర పనులు ప్రారంభిస్తామని సభలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు మొదట అభివృద్ధి చేస్తామని అన్నారు. ఫస్ట్ ఫేజ్ పనులు మార్చిలో ప్రారంభం అవుతాయని.. సంక్రాంతిలోగా ఫస్ట్ ఫేజ్ డీపీఆర్‌ (DPR)పై క్లారిటీ వస్తుందని పేర్కొన్నారు. గండిపేట నుంచి గౌరెల్లి వరకు 51 కి.మీ మూసీని అభివృద్ధి చేస్తామని అన్నారు. అదేవిధంగా ఆ 51 కి.మీ మేర ఎలివేటెడ్ కారిడార్లు (Elevated Corridors) నిర్మిస్తామని తెలిపారు. మీరాలం ట్యాంక్ కూడా మూసీ అభివృద్ధిలో భాగమేనని అందుకు రూ.450 కోట్లతో బ్రిడ్జి కడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి సభ దృష్టికి తీసుకొచ్చారు.

Read More : అసలు మూసీ సుందరీకరణకు ఎంత ఖర్చు అవుతుంది? : హరీశ్‌రావు డిమాండ్

మూసీ ప్రక్షాళన కావాలా.. వద్దా? ప్రధాన ప్రతిపక్షానికి సీఎం రేవంత్ సూటి ప్రశ్న

Next Story