టీఎస్ పీఎస్సీలో అంతా కొత్తవాళ్లే.. మరో సభ్యురాలి రాజీనామా

by Disha Web Desk 13 |
టీఎస్ పీఎస్సీలో అంతా కొత్తవాళ్లే.. మరో సభ్యురాలి రాజీనామా
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు మరో సభ్యురాలు రాజీనామా చేశారు. పాత ప్రభుత్వం నియమించిన కోట్ల అరుణ కుమారి వ్యక్తిగత కారణాలతో బోర్డు సభ్యురాలి పదవికి రిజైన్ చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను శనివారం గవర్నర్ కు పంపించారు. తన రాజీనామాకు ఆమోదించాలని కోరారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో నియమితులైన చైర్మన్ తో పాటు ఐదుగురు సభ్యులు రాజీనామా చేయగా వారి రాజీనామాలను గవర్నర్ ఆమోదించారు. మరో మెంబర్ సుమిత్రానందన్ ఇటీవల రాజీనామా చేయగా గవర్నర్ ఇంకా ఆమోదం తెలుపలేదు. తాజాగా అరుణకుమారి సైతం తన రాజీనామా లేఖను గవర్నర్ కు పంపించారు. దీంతో వీరిద్దరి రాజీనామాలు ఆమోదం పొందితే కేసీఆర్ ప్రభుత్వం నియమించిన కమిషన్ స్థానంలో పూర్తి స్థాయిలో కొత్త బోర్డు ఏర్పాటు అయినట్లవుతుంది. రెండు రోజుల క్రితం టీఎస్ పీఎస్సీకి కొత్త చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి, సభ్యులుగా అనితా రాజేంద్ర, అమీరుల్లాఖాన్, నర్రీ యాదయ్య, వై.రాంమోహన్ రావు, పాల్వాయి రజనీకుమారిలను రేవంత్ రెడ్డి సర్కార్ నియమించింది. కొత్త చైర్మన్, సభ్యులు రాగానే అనూహ్యంగా అరుణ కుమారి రాజీనామా నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. టీఎస్ పీఎస్సీ కి చైర్మన్ తో కలిపి మొత్తం 11 ని నియమించవచ్చు. ప్రస్తుతం చైర్మన్ తో కలిపి మొత్తం ఆరుగురిని బోర్డులో ప్రభుత్వం నియమించింది. సుమిత్రానందన్, అరుణ రాజీనామాలను గవర్నర్ ఆమోదిస్తే మరో నలుగురుని నియమించే అవకాశం ఉంటుంది.

రాజీనామా వేళ సంచలన వ్యాఖ్యలు:

రాజీనామా సందర్భంగా రాష్ట్రంలోని నిరుద్యోగులకు అరుణ కుమారి లేఖ రాశారు. టీఎస్ పీఎస్సీలో వెలుగు చూసిన గ్రూప్ వన్ పేపర్ లీకేజీతో పాటు ఇతర ప్రశ్నాపత్రాల లీకేజీలో తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఇందులో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తనకు నా పాత్ర లేదని పేర్కొన్నారు. తాను ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా లేను కాబట్టే తోటి సభ్యులు రాజీనామా చేసినా నేను చేయనవసరం లేదని అని భావించాను. కానీ నేను కొనసాగడం వల్ల పాత బోర్డు మొత్తం రద్దు పరిచినట్టుగా సంపూర్ణం కాదని నావలన నా బిడ్డల లాంటి నిరుద్యోగులకు రావాల్సిన ఉద్యోగాలపై నిర్ణయం తీసుకోలేకపోతున్నట్టుగా ప్రభుత్వం భావిస్తున్న సందర్భంలో తాను నా ఇష్టపూర్వకంగా రాజీనామా లేఖను గవర్నర్ కు పంపిస్తున్నట్లు పేర్కొన్నారు. పత్రికల్లో వచ్చిన వార్తలకు భయపడి రాజీనామా ఇవ్వడం లేదన్నారు. గతంలో తాను తన భర్త ప్రభుత్వ భూములను కాపాడినందుకే మా వలన లాభం పొందని బడానేతలు మామీద ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. టీఎస్ పీఎస్సీ మెంబర్ గా అవకాశం ఇచ్చిన మాజీ సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.



Next Story

Most Viewed