కవితకు దానం నాగేందర్ క్లాస్.. అనూహ్యంగా కేసీఆర్‌పై పాజిటివ్ కామెంట్స్

by Gantepaka Srikanth |   (  Updated:2026-05-02 07:25:22  IST  )

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయ ప్రస్థానం, కుటుంబ వ్యవహారాలపై ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్రంగా స్పందించారు.

కవితకు దానం నాగేందర్ క్లాస్.. అనూహ్యంగా కేసీఆర్‌పై పాజిటివ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయ ప్రస్థానం, కుటుంబ వ్యవహారాలపై ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్రంగా స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కవిత తన రాజకీయ స్వార్థం కోసం తండ్రిని, ఇంటి సమస్యలను వీధిలోకి తీసుకురావడం సరికాదని ఆయన హితవు పలికారు. "కవిత కలలు కనొచ్చు కానీ, అనవసరమైన కబుర్లు చెప్పడం మానుకోవాలి" అంటూ దానం ఎద్దేవా చేశారు. రాజకీయంగా ప్రత్యర్థులను విమర్శించడం వేరని, కానీ పదే పదే సొంత తండ్రిని టార్గెట్ చేస్తూ మాట్లాడటం తగదని ఆయన పేర్కొన్నారు. మరో పదేళ్ల పాటు ఆరోగ్యంగా, చురుగ్గా ఉండాల్సిన కేసీఆర్‌ను కవిత తన మాటలతో మానసికంగా బలహీనపరుస్తున్నారని విమర్శించారు.

కేసీఆర్ ప్రజా నాయకుడు..

కేసీఆర్ ఒక మాస్ లీడర్ అని, ఆయన ఎప్పుడు ప్రజల్లోకి రావాలో ఆయనకు తెలుసని దానం వ్యాఖ్యానించారు. సందర్భాన్ని బట్టి ఆయన తప్పకుండా బయటకు వస్తారని, ఈ విషయంలో కవిత అనవసర ఆందోళన వ్యక్తం చేయాల్సిన పనిలేదని అన్నారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలకు ఈ మధ్య కాలంలో 'యాంగ్జయిటీ' (ఆందోళన) ఎక్కువైందని, అందుకే ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియడం లేదని విమర్శించారు. గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్‌లకు పాల్పడిన వారే ఇప్పుడు తిరిగి ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందని దానం నాగేందర్ అన్నారు. "ట్యాపింగ్ చేసిన వారే నీతులు చెప్తుంటే నవ్వు వస్తోంది" అని ఆయన ఎద్దేవా చేశారు. ఎవరినీ వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంపై భారీ ఆర్థిక భారం ఉన్నప్పటికీ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తూ ముందుకు వెళ్తోందని దానం వివరించారు. సంక్షేమ పథకాల విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఆయన పునరుద్ఘాటించారు.

తెలంగాణ జాగృతి భవిష్యత్ తేల్చేసిన కవిత.. TRS పార్టీపై కీలక వ్యాఖ్యలు

Next Story