డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్.. సంస్కరణల సారథికి పోలీసుల గౌరవ వందనం

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-01 06:21:30  IST  )

తెలంగాణ నూతన డీజీపీగా 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు.

డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్.. సంస్కరణల సారథికి పోలీసుల గౌరవ వందనం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ స్టేట్‌గా పోలీస్ బాస్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ (CV Anand) ఇవాళ పదవీ బాధ్యతలు చేపట్టారు.ఉదయం డీజీపీ కార్యాలయానికి చేరుకున్న ఆయనకు పోలీసు ఉన్నతాధికారులు సాదరంగా ఆహ్వానం పలికారు. కార్యాలయ ఆవరణలో పోలీసుల నుంచి ఆయన గౌరవ వందనం (Guard of Honour) స్వీకరించారు. అనంతరం నిర్ణీత సమయానికి తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు.

అనుభవజ్ఞుడైన అధికారిగా ముద్ర

1991 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన సీవీ ఆనంద్‌కు క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు విశేషమైన అనుభవం ఉంది. కెరీర్ తొలినాళ్లలో ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఏఎస్పీ (ASP), ఎస్పీ (SP)గా విధులు నిర్వహించారు. గతంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసి, క్లిష్ట పరిస్థితుల్లో శాంతిభద్రతలను సమర్థవంతంగా కాపాడారు. ఆ తర్వాత హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా, సైబరాబాద్ కమిషనర్‌గా, ట్రాఫిక్ కమిషనర్‌గా మరియు హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అత్యున్నత సేవలందించారు.

పోలీసు శాఖలో టెక్నాలజీకి ఆధ్యుడు..

పోలీస్ శాఖలో సాంకేతికతను జోడించి వినూత్న మార్పులు తీసుకురావడంలో సీవీ ఆనంద్ గుర్తింపు పొందారు. ముఖ్యంగా ట్రాఫిక్ (Traffic) విభాగంలో ఆయన ప్రవేశపెట్టిన పలు పద్ధతులు నేటికీ ఆదర్శంగా నిలుస్తున్నాయి. ట్రాఫిక్ నిబంధనల అమలులో పారదర్శకత కోసం ఈ-చలాన్ (E-Challan), అతివేగాన్ని అడ్డుకోవడానికి స్పీడ్ గన్స్ వ్యవస్థను తీసుకొచ్చారు. నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు రివర్సిబుల్ లేన్లు, ఫ్రీ లెఫ్ట్ వంటి విధానాలను అమలు చేసి వాహనదారుల ప్రయాణాన్ని సులభతరం చేశారు. తెలంగాణ పోలీస్ అడ్మినిస్ట్రేషన్‌లో తనదైన ముద్ర వేసిన సీవీ ఆనంద్, ఇప్పుడు పూర్తిస్థాయి డీజీపీగా రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి పోలీసింగ్ విధానాలను అమలు చేస్తారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

డీజీపీ సీవీ ఆనంద్‌ మార్క్ అడ్మినిస్ట్రేషన్.. తొలిరోజే ఎస్పీలు, సీపీలకు కీలక ఆదేశాలు

Next Story