ఆన్‌లైన్‌లో చైనా మాంజా.. సీపీ సజ్జనార్ హెచ్చరిక.. రూ.1.24 కోట్ల నిషేధిత మాంజా స్వాధీనం

by Ramesh Naini |   (  Updated:2026-01-08 07:40:36  IST  )

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నగరంలో అక్రమంగా విక్రయానికి సిద్ధంగా ఉంచిన నిషేధిత చైనా మాంజాపై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపారు.

ఆన్‌లైన్‌లో చైనా మాంజా.. సీపీ సజ్జనార్ హెచ్చరిక.. రూ.1.24 కోట్ల నిషేధిత మాంజా స్వాధీనం
X

దిశ, డైనమిక్ బ్యూరో: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నగరంలో అక్రమంగా విక్రయానికి సిద్ధంగా ఉంచిన నిషేధిత చైనా మాంజాపై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో రూ.1.24 కోట్ల విలువైన చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నగరంలో పక్షులు, జంతువులతో పాటు మనుషుల ప్రాణాలకు కూడా తీవ్ర ప్రమాదం కలిగించే చైనా మాంజా విక్రయాలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ క్రమంలో విశ్వసనీయ సమాచారం మేరకు పలు గోదాములు, నిల్వ కేంద్రాలపై దాడులు నిర్వహించి భారీగా చైనా మాంజాను పట్టుకున్నారు.

ఉపేక్షించే ప్రసక్తే లేదు

ఈ సందర్భంగా హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ.. సంక్రాంతి అంటేనే పతంగుల పండుగ, ఆనందాల వేళ.. అయితే, మన సంతోషం మరోకరి ప్రాణానికి ముప్పుగా పరిణమిచకూడదని వివరించారు. పర్యావరణానికి, మనుషుల ప్రాణాలకు హాని కలిగించే చైనీస్ మాంజాపై ప్రభుత్వం సంపూర్ణ నిషేధం విధించిందని గుర్తుకుచేశారు. నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ కొందరు గుట్టుచప్పుడు కాకుండా వీటిని విక్రయిస్తున్నారని తెలిపారు. నగరంలో ఎవరైనా చైనా మాంజాను విక్రయించినా, గోదాముల్లో నిల్వ చేసినా, అక్రమ రవాణాకు పాల్పడినా ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమిస్తే తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.

ఆన్‌లైన్‌లో మాంజా కొనుగోలు చేసినా చర్యలు

దుకాణాల్లో తనిఖీలు ముమ్మరం చేయడంతో వ్యాపారులు ఆన్‌లైన్ బాట పట్టినట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈ-కామర్స్ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా వేదికగా సాగే క్రయవిక్రయాలపై 24 గంటల పాటు ప్రత్యేక నిఘా ఉంచామని తెలిపారు. ఆన్‌లైన్‌లో మాంజా కొనుగోలు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్లాస్టిక్, గాజు పెంకులు, మెటాలిక్ కోటింగ్ ఉండే ఈ మాంజా వల్ల పిల్లలకు విద్యుత్ షాక్ కొట్టే ప్రమాదం ఉందని, తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించి సంప్రదాయ నూలు దారాలనే ప్రోత్సహించాలని సూచించారు. ప్రజలు కూడా చైనా మాంజా విక్రయాలపై సమాచారం అందించాలని, అవసరమైతే ‘డయల్ 100’ లేదా 94906 16555 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.

Read More..

లైసెన్స్‌లు రద్దు చేస్తాం.. ఆహార పదార్థాల కల్తీపై సీపీ సజ్జనార్ వార్నింగ్

Next Story