- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
త్వరలోనే శుభవార్త చెబుతాం: సీఎం రేవంత్
పాలమూరు ప్రాజెక్టు సందర్శన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణా, గోదావరి నదీ జలాల పంపకాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయని, ఈ వివాదాలు అతి త్వరలోనే కొలిక్కి వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: పాలమూరు ప్రాజెక్టు సందర్శన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణా, గోదావరి నదీ జలాల పంపకాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయని, ఈ వివాదాలు అతి త్వరలోనే కొలిక్కి వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే ఈ విషయంలో తెలంగాణ ప్రజలకు ఒక శుభవార్త కూడా చెబుతామని సీఎం వెల్లడించారు. అయితే, ఏపీతో చర్చలు జరుపుతున్నప్పటికీ.. తెలంగాణకు దక్కాల్సిన చట్టబద్ధమైన వాటాలో ఒక్క చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. తాము పొరుగు రాష్ట్రంతో 'పంచాయతీ' కంటే సమస్యల పరిష్కారానికే' ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. కాగా, పాలమూరు, డిండి లాంటి పెండింగ్ ప్రాజెక్టులకు క్లియరెన్స్ (NOCలు) వస్తేనే మిగతా ప్రాజెక్టులపై చర్చలు ముందుకు సాగుతాయని తేల్చి చెప్పారు.
కేసీఆర్‌పై ఫైర్..
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పాలమూరు జిల్లా తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. గత ప్రభుత్వం పాలమూరులో ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కనీసం భూసేకరణ పనులను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేయలేదని, ఫలితంగా ఒక్క ఎకరాకు కూడా సాగునీరు అందించలేకపోయారని ఎండగట్టారు. గత ఎన్నికల్లో కష్టకాలంలో కేసీఆర్‌ను ఆదుకున్న పాలమూరు జిల్లాను.. అధికారంలోకి వచ్చాక ఆయన పూర్తిగా పట్టించుకోవడం మానేశారని సీఎం ఆరోపించారు. వలసల జిల్లాగా పేరొందిన పాలమూరును సస్యశ్యామలం చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందనీ, పాలమూరు ప్రాజెక్టును పూర్తిగా పూర్తి చేసే బాధ్యతను తానే స్వయంగా తీసుకుంటున్నానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.






