- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం అందించాలి
జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణను వేగవంతం చేసి బాధితులకు సకాలంలో న్యాయం, ఆర్థిక ఉపశమనం అందించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు.

దిశ, సంగారెడ్డి అర్బన్ : జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణను వేగవంతం చేసి బాధితులకు సకాలంలో న్యాయం, ఆర్థిక ఉపశమనం అందించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. పీసీఆర్, పీఓఏ చట్టాలను జిల్లాలో మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా అప్రమత్తత, పర్యవేక్షణ కమిటీ సమావేశం, పౌర హక్కుల పరిరక్షణ, అత్యాచారాల నిరోధక చట్టాల అమలుపై సమీక్షా సమావేశం బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… సమాజంలో చోటుచేసుకునే షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలపై వివక్ష, దాడుల ఘటనలను అత్యంత బాధ్యతాయుతంగా పరిగణించాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వెలుగులోకి రాని వాస్తవ ఘటనలను రెవెన్యూ, పోలీసు అధికారులు గుర్తించి, వాస్తవమైన ప్రతి కేసును నిబంధనల ప్రకారం నమోదు చేయాలని సూచించారు. బాధితులకు చట్టప్రకారం అందాల్సిన రక్షణ, సహాయం, ఆర్థిక ఉపశమనం, న్యాయం సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రతి నెల 30వ తేదీన పౌర హక్కుల దినం నిర్వహించాలని, ప్రతి రెవెన్యూ డివిజన్‌లో ఉప విభాగ స్థాయి అప్రమత్తత, పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేయాలని ఉప కలెక్టర్లకు ఆదేశించారు. 2022 నుంచి ఇప్పటివరకు జిల్లాలో నమోదైన 144 షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల దాడుల కేసుల్లో బాధితులకు ఆర్థిక ఉపశమనం కింద సుమారు రూ.2.58 కోట్ల నిధులు అవసరమవగా, ఇప్పటివరకు రూ.1.74 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. అందులో 37 మంది బాధితులకు రూ.68,87,500 విడుదల చేసినట్లు, మిగిలిన అర్హులైన బాధితులకు ఆర్థిక ఉపశమనం అందజేసే ప్రక్రియ కొనసాగుతున్నట్లు వివరించారు.
ప్రతి నెల 30న సివిల్ రైట్స్ డే నిర్వహించాలని ఆదేశం
సమావేశంలో పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతిపై జిల్లా కలెక్టర్ ఉప పోలీసు అధికారులను కేసుల వారీగా వివరాలు అడిగి తెలుసుకుని, దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి_ మాట్లాడుతూ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల దాడుల కేసుల్లో ఎలాంటి జాప్యానికి తావివ్వకుండా బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా అధికారులు పనిచేయాలని సూచించారు. దర్యాప్తును నిర్ణీత గడువులో పూర్తి చేసి అభియోగ పత్రాలు దాఖలు చేయాలని, గ్రామ, మండల స్థాయి కమిటీల ద్వారా అర్హులైన వారికి కుల ధ్రువీకరణ పత్రాలు సకాలంలో అందజేయాలని అన్నారు. జిల్లా పోలీసు అధికారి పరితోష్ పంకజ్_ మాట్లాడుతూ. 2026 జూన్ నెలాఖరు వరకు జిల్లాలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల దాడుల నిరోధక చట్టం కింద 31 కేసులు నమోదయ్యాయని తెలిపారు. అందులో 12 కేసులు దర్యాప్తు దశలో ఉండగా, 19 కేసుల్లో అభియోగ పత్రాలు దాఖలు చేసినట్లు తెలిపారు. ప్రతి కేసులో బాధితులకు పూర్తి రక్షణ కల్పిస్తూ, చట్టప్రకారం సత్వర న్యాయం అందేలా పోలీసు శాఖ చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పాండు, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉప సంచాలకులు అఖిలేష్ రెడ్డి, షెడ్యూల్డ్ కులాల కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు రామాచారి, వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ జిల్లా అధికారి జగదీష్, ప్రభుత్వ న్యాయవాది సత్యనారాయణ, సహాయ పోలీసు అధికారులు, ఉప పోలీసు అధికారులు, రెవెన్యూ డివిజనల్ అధికారులు రాజేందర్, దేవుజ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.






