రాహుల్ గాంధీకి మద్దతుగా ఆందోళనలు కొనసాగిస్తూనే ఉంటాం

by Taduka Kalyani |

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మద్దతుగా తమ ఆందోళనలు కొనసాగుతూనే ఉంటాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పష్టం చేశారు.

రాహుల్ గాంధీకి మద్దతుగా ఆందోళనలు కొనసాగిస్తూనే ఉంటాం
X

దిశ, సంగారెడ్డి : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మద్దతుగా తమ ఆందోళనలు కొనసాగుతూనే ఉంటాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ ఆయన రెండో రోజు నిరసనలో భాగంగా సంగారెడ్డి పట్టణంలో తన సతీమణి నిర్మలతో కలిసి భారీ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడారు. రాహుల్ గాంధీ ఆందోళన చేసినన్ని రోజులు సంగారెడ్డిలో ఆందోళనలు జరుగుతూనే ఉంటాయని తెలిపారు. జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై విచక్షణారహితంగా లాఠీ ఛార్జ్ చేయడం, ఢిల్లీలో ప్రధానమంత్రి ఇంటి వద్ద నిరసన తెలుపుతున్న రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని ఖండించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విద్యార్థుల పట్ల అమానుషంగా వ్యవహరించిందంటూ మండిపడ్డారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని, మూడో సారి మోదీ ప్రధాని అయినా యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. నీట్ పేపర్ లీకేజీ ఘటనపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనీ ఆయన డిమాండ్ చేశారు. రాహుల్, ప్రియాంక గాంధీలతో పాటు విద్యార్థులకు మద్దతుగా ప్రతి రోజు నిరసన కార్యక్రమాలు చేస్తామన్నారు.

రేపు వెయ్యి మందితో భారీ ర్యాలీ

మూడో రోజు నిరసనలో భాగంగా ఈ నెల 23న వెయ్యి మందితో భారీ ర్యాలీ ఉంటుందని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరూ నల్ల షర్టు, టీ షర్ట్ ధరించి రావాలని ఆయన పిలుపునిచ్చారు. సంగారెడ్డి పట్టణంలో ఐదు కిలోమీటర్ల వరకు ఈ భారీ నిరసన ర్యాలీ నిర్వహించబోతున్నట్లు ఆయన తెలిపారు.

Next Story