ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జీని ఖండించిన ఐక్య విద్యార్థి సంఘాలు

by Kodari Anjali |

విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జీ జరపడం దుర్మార్గమైన చర్య అని ఉస్మానియా యూనివర్సిటీ ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు.

ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జీని ఖండించిన ఐక్య విద్యార్థి సంఘాలు
X

దిశ, సికింద్రాబాద్: నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జీ జరపడం దుర్మార్గమైన చర్య అని ఉస్మానియా యూనివర్సిటీ ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. బుధవారం విద్యార్థి నాయకుడు ఆజాద్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శిస్తూ కేంద్ర ప్రభుత్వం నీట్ పేపర్ లీకేజీ ఘటనపై తక్షణమే సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్..

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, విద్యార్థుల శాంతియుత ఆందోళనలను అణచివేయడానికి లాఠీచార్జీలకు పాల్పడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలు విద్యా వ్యవస్థపై ప్రజల్లో అనుమానాలు పెంచాయని ఆందోళన వ్యక్తం చేశారు. నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ వ్యవహారంపై పారదర్శక విచారణ చేపట్టి కుట్రలో పాల్గొన్న వారందరిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల హక్కులను కాలరాసే చర్యలను సహించబోమని, దేశ యువత భవిష్యత్తు కోసం అవసరమైతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని విద్యార్థి నాయకుడు ఆజాద్ హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన వివిధ విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Next Story