ధాన్యం కొనుగోలు 80 శాతం జరిగిందనడం ప్రజలను తప్పుదారి పట్టించడమే

by Naga Rani Yarlagadda |

సీఎం రేవంత్​రెడ్డి ధాన్యం కొనుగోలు 80 శాతం జరిగినట్లు చెప్పడం పూర్తిగా ప్రజలను తప్పదారి పట్టించే ప్రయత్నమేనని బీజేఎల్పీ నేత మహేశ్వర్​రెడ్డి ఆరోపించారు.

ధాన్యం కొనుగోలు 80 శాతం జరిగిందనడం ప్రజలను తప్పుదారి పట్టించడమే
X
  • ప్రభుత్వం కేంద్రాలను మూడు రోజుల పాటు బీజేపీ ఎమ్మెల్యేలు పర్యటన
  • గోస పడుతున్న రైతులకు బీజేపీ అండగా నిలుస్తోంది : బీజేఎల్పీ నేత మహేశ్వర్​రెడ్డి

దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం రేవంత్​రెడ్డి ధాన్యం కొనుగోలు 80 శాతం జరిగినట్లు చెప్పడం పూర్తిగా ప్రజలను తప్పదారి పట్టించే ప్రయత్నమేనని బీజేఎల్పీ నేత మహేశ్వర్​రెడ్డి ఆరోపించారు. కొనుగోలు జరిగి ఉంటే ఎక్కడికి తీసుకెళ్లిన తాము సిద్ధంగా ఉన్నామని సవాల్​విసిరారు. బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కలిసి రాష్ట్రంలోని కొనుగోలు కేంద్రాలను పర్యటించి వడ్ల కొనుగోలు ఎంత జరిగింది? జొన్నల కొనుగోలు ఎందుకు ప్రారంభించలేదో వంటి విషయాలు తెలుసుకుని ప్రజలు వివరిస్తామన్నారు. మూడు రోజుల్లో పర్యటన వివరాలను త్వరలో ప్రకటిస్తామన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రైతు సమస్యలను తెలుసుకోవడమే కాకుండా వారు పడుతున్న గోస పట్ల బీజేపీ భరోసాగా నిలబడుతుందన్నారు. ఒకవైపు అకాల వర్షాలు, మరోవైపు జూన్‌లో వచ్చే మాన్సూన్‌కు రైతులు మళ్లీ సిద్ధం కావాల్సిన పరిస్థితి ఉంది. కానీ రాష్ట్రవ్యాప్తంగా వడ్ల కొనుగోలు కేంద్రాలు, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు సక్రమంగా పనిచేయడం లేదు. లారీలు, గన్నీ బ్యాగులు సరిపడ లేకపోవడంతోఅన్నదాతలు అవస్ధలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో 10 పంటలకు గిట్టుబాటు ధరతో పాటు ప్రతి గింజను కొనుగోలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసింది. ఎకరానికి రూ.7,500 రైతు భరోసా ఇస్తామని చెప్పి, ఆ హామీని కూడా నిలబెట్టుకోలేదని విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కేవలం 24 శాతం మాత్రమే వడ్ల కొనుగోలు జరిగింది. సుమారు 1.41 కోట్ల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వస్తే, గత సంవత్సరం కేవలం 90 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. ఈ ఏడాది కూడా అదే లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఇప్పటివరకు ఎంత కొనుగోలు చేశారో చెప్పాలన్నారు.

యూరియా బస్తాల దగ్గర నుంచి గన్నీ బ్యాగులు, పంట అమ్ముకునే దశ వరకు ప్రతి చోట దోపిడీ జరుగుతోంది. మిల్లర్లు, దళారులు పెద్ద మొత్తంలో దోచుకుంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కూడా ఒక బస్తాకు 4 కిలోల దోపిడీ జరుగుతోంది. అంటే రైతు పండించిన పంటలో 10 శాతం మాయమవుతోంది. అది ఎవరి జేబుల్లోకి వెళ్తోందో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్​చేశారు. 90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్ల కొనుగోలు జరిగితే, అందులో 10 శాతం అంటే 9 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు ఎవరి ఖాతాల్లోకి వెళ్తున్నాయని ప్రశ్నించారు. ఈ వేల కోట్ల రూపాయల దందా ఎవరి కోసం జరుగుతోందో కాంగ్రెస్ ప్రభుత్వం జవాబు చెప్పాలన్నారు.

Next Story