తెలంగాణలో డీజిల్, పెట్రోల్ కొరతపై క్లారిటీ

by Gantepaka Srikanth |   (  Updated:2026-04-27 12:05:45  IST  )

తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పందించారు.

తెలంగాణలో డీజిల్, పెట్రోల్ కొరతపై క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పందించారు. రాష్ట్రంలో ఇంధన నిల్వలకు ఎటువంటి ఢోకా లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోందని కమిషనర్ తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో మరో 70 రోజులకు సరిపడా ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నాయి. కేవలం పెట్రోల్, డీజిల్ మాత్రమే కాకుండా వంట గ్యాస్ (LPG) సరఫరాలో కూడా ఎటువంటి అంతరాయం లేదని ఆయన వివరించారు. తప్పుడు వార్తలను నమ్మి ప్రజలు పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరి కంగారు పడవద్దని స్టీఫెన్ రవీంద్ర కోరారు. "తప్పుడు ప్రచారాల వల్ల అనవసరంగా బంకుల వద్ద రద్దీ పెరుగుతోంది. నిల్వలు పుష్కలంగా ఉన్నప్పుడు ఆందోళన చెందాల్సిన పనిలేదు" అని ఆయన పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని పౌరసరఫరాల శాఖ అధికారులు, పోలీస్ మరియు రెవెన్యూ యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తోందని వెల్లడించారు.

అప్రమత్తంగా ఉన్నాం..

రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా కొరత రాకుండా ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతున్నామని, చమురు కంపెనీలతో కూడా సమన్వయం చేసుకుంటున్నామని కమిషనర్ తెలిపారు. ఏదైనా సమస్య తలెత్తితే పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రజలు కేవలం అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మాలని ఆయన సూచించారు.

పెట్రోల్, డీజిల్ కోసం గంటల తరబడి క్యూలో వాహనదారులు

Next Story