- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెట్రోల్, డీజిల్ కోసం గంటల తరబడి క్యూలో వాహనదారులు
పశ్చిమాసియా యుద్ధ ప్రభావం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను తాకింది.

దిశ, కొత్తగూడెం ప్రతినిధి: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను తాకింది. యుద్ధ ప్రభావంతో ఇంధన కొరతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత పది రోజులుగా డీజిల్, పెట్రోల్ కోసం కొంత ఇబ్బంది పడినప్పటికీ రెండు రోజుల నుంచి ఈ సమస్య తీవ్రంగా మారింది. భద్రాద్రి జిల్లాలో పౌరసరఫరాల శాఖ లెక్కల ప్రకారం భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం బంకులు మొత్తంగా 83 ఉండగా ఏ మారుమూల ఉన్న బంకుల్లో సైతం నో స్టాక్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. అధికారులేమో ఇంధన కొరత లేదని చెబుతున్న వాహనదారులు మాత్రం ఇంధనం కోసం బంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మరి అధికారులు చెప్పిన మాటలకు క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యకు ఎక్కడ పొంతన లేదని వాహనదారులు ఆరోపిస్తున్నారు.
పెట్రోల్, డీజిల్ కోసం గంటల తరబడి క్యూలో వాహనదారులు..
జిల్లాలోని కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టగా, మరికొన్ని బంకుల్లో డీజిల్, పెట్రోల్ కోసం గంటల తరబడి వాహనదారులు క్యూలో నిలబడి వేచి చూస్తున్నారు. ప్రధానంగా పొలం పనులు చేసే వాహనాలు, భవనాలకు మెటీరియల్ ను సరఫరా చేసే ట్రాక్టర్లు, లారీల యజమానులు, ఆటో డ్రైవర్లు, అద్దె కార్ల యజమానులు, కార్యాలయాలకు వెళ్ళేందుకు ఉద్యోగులు వినియోగిస్తున్న వాహనదారులు ఇబ్బందులుపడగా, ఇతర ప్రాంతాల నుంచి భద్రాచలం దర్శనానికి సొంత వాహనాలు, అద్దె వాహనాల్లో వచ్చిన భక్తులు, పర్యాటకులు భద్రాద్రి జిల్లాలోని బంకుల్లో ఇంధన కొరత చూసి అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది ఖమ్మం, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో ఆరోగ్య చెకప్ కోసం హాస్పిటల్స్ కు వెళ్లేందుకు అనారోగ్యంతో బాధపడుతున్న రోగులు పడుతున్న బాధ వర్ణనాతీతం.
ఇంధన కొరత మూలంగా ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయని తద్వారా రోజువారీ పనులపై తీవ్ర ప్రభావం పడుతోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో బంకుకు ఆ ప్రాంతంలో ఉన్న డిమాండ్ ను బట్టి బంకు యజమానులు ఇండెంట్ ఇచ్చిన ప్రకారం ఇందన కంపెనీలు సరఫరా చేస్తున్నాయి. అయితే ప్రధాన రోడ్లపై ఉన్న బంకులే కాకుండా మారుమూల గ్రామాలలో ఉన్న బంకులలో కూడా ఇంధనం కోసం వాహనదారులు బారులు తీరడంతో సమస్య తీవ్రతరమైంది. జిల్లా కేంద్రంలోని పలు బంకుల్లో ఇంధనం కావాలని కోరినప్పటికీ రెండు రోజుల కొకసారి పెట్రోల్, డీజిల్ ట్యాంకులను ఆయిల్ కంపెనీలు పంపిస్తున్నాయని తద్వారా వాహనదారులకు ఇంధనం లేదని ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పలేకపోతున్నామని బంక్ యజమానులు వాపోతున్నారు.
కిరాణా షాపుల్లో పెట్రోల్, డీజిల్ లీటర్ రూ.150..
బంకుల్లో ఇంధన కొరత ఉండటంతో డీజిల్, పెట్రోల్ ను వివిధ కిరాణా షాపులు లీటర్ రూ.150 చొప్పున వాహనదారులకు విక్రయిస్తున్నారు. డీజిల్ రూ.95లు, పెట్రోల్ రూ.108లు బంకుల్లో విక్రయిస్తుండగా, ఇంధన కొరతను తమకు అనుకూలంగా మార్చుకుని పలు షాపుల యజమానులు రూ.150కి అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. చేసేదేమీ లేక అవసర నిమిత్తం వాహనదారులు కొనుగోలు చేసి రోజువారీ అవసరాలు తీర్చుకుంటున్నారు. ఇంధన సమస్యను దృష్టిలో ఉంచుకొని ద్విచక్ర వాహనదారులకు 2 లీటర్లు, కారుకు 10 లీటర్లు, లారీలకు, భారీ వాహనాలకు బంకులో పరిస్థితిని బట్టి ఇంధనం విక్రయించాలని, బాటిల్స్, డమ్ములు, క్యాన్లలో, విడిగా ఇంధనం విక్రయించ వద్దని పౌరసరఫరాల శాఖాధికారులు స్పష్టంగా బంక్ యజమానులను ఆదేశించారు. అయినప్పటికీ బంకుల్లో రద్దీ మాత్రం తగ్గడం లేదు. ఈ సమస్య ఈ విధంగానే కొనసాగితే ఇతర ప్రాంతాల నుంచి రవాణా ద్వారా దిగుమతి చేసుకునే నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు ఆకాశాన్నంటే పరిస్థితి ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పరిస్థితిని సమీక్షిస్తున్నాం:ప్రేమ్ కుమార్ (పౌరసరఫరాల శాఖాధికారి)
ఇంధన కొరత పై ప్రస్తుత పరిస్థితిని సమీక్షిస్తున్నాం. ప్రస్తుతానికి కొరత అయితే లేదు కానీ ప్రజల్లో నెలకొన్న అపోహల వల్లనే వాహనదారులు ముందస్తు జాగ్రత్తలు పడుతున్నారు. అందుకే ఈ సమస్య తలెత్తింది. రెండు రోజుల్లో అంత మామూలు స్థితికి వచ్చేస్తుంది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వాటర్ బాటిల్, క్యాన్ , డ్రమ్ములలో ఇంధనం నింపవద్దని బంక్ యజమానులను ఆదేశించామని తెలిపారు.






