- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాళేశ్వర ముక్తేశ్వరుని సన్నిధిలో CM రేవంత్: అభివృద్ధి పనులకు శంకుస్థాపన!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం చేరుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం చేరుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలిసారిగా ఈ ప్రాంతంలో పర్యటిస్తుండటంతో అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. కాళేశ్వరం చేరుకున్న ముఖ్యమంత్రికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, రవాణా శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, కార్మికశాఖ మంత్రి ఎంపీ వివేక్ వెంకటస్వామి, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. హెలిప్యాడ్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అభిషేకం చేశారు. ఆలయ అర్చకులు ముఖ్యమంత్రికి వేదాశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలను అందజేశారు.
అభివృద్ధి పనులకు శ్రీకారం
ఆలయ దర్శనం అనంతరం, కాళేశ్వర క్షేత్ర అభివృద్ధి కోసం ఉద్దేశించిన పలు కొత్త పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. భక్తులకు కనీస వసతులు కల్పించడం, ఆలయ ప్రాంగణాన్ని విస్తరించడం వంటి అంశాలపై ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆలయ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు వెళ్లనున్నారు. అక్కడ బ్యారేజ్ కుంగిన ప్రాంతాన్ని పరిశీలించి, నీటిపారుదల శాఖ అధికారులతో ప్రాజెక్టు పునరుద్ధరణ, మరమ్మతు పనులపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం కాటారం మండలం నస్తుర్‌పల్లిలో జరిగే బహిరంగ సభలో పాల్గొని, 'రైతు భరోసా' రెండో విడత నిధులను విడుదల చేయనున్నారు. ఈ పర్యటనలో మంత్రులతో పాటు పలువురు ఉన్నతాధికారులు, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.






