- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సాగునీటి కష్టాలకు చెక్.. చనాక–కొరాటతో రైతాంగానికి ఊపిరి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసుల సాగునీటి కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రారంభించిన చనాక-కొరాట ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకొచ్చేలా ముందుకు సాగుతున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసుల సాగునీటి కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రారంభించిన చనాక-కొరాట ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకొచ్చేలా ముందుకు సాగుతున్నది. ఈ ప్రాజెక్టు తెలంగాణ, మహారాష్ట్రల సంయుక్త ప్రాజెక్టు కాగా.. ఇరు రాష్ట్రాల భాగస్వామ్యంతో నిర్మితమైంది. ఇది పెన్‌గంగా నదిపై 6,677 హెక్టార్ల విస్తీర్ణానికి నిర్మింతమైంది. తెలంగాణలో 5,463 హెక్టార్లు, మహారాష్ట్రలో 1,214 హెక్టార్లకు సాగునీరు అందించడానికి ప్రతిపాదించారు. కమాండ్ ఏరియా మూడు మండలాల్లోని 14 గ్రామాలలో ఉంది. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలోని తాంసి, ఆదిలాబాద్, జైనథ్, మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లాలోని కేలాపూర్ తహసీల్‌లోని తొమ్మిది గ్రామాలకు సాగునీరు అందించనున్నారు.
2016లో ఒప్పందం..
ఆగస్టు 23, 2016న ముంబైలో జరిగిన అంతర్రాష్ట్ర బోర్డు సమావేశంలో తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాలు చనాక-కొరాట బ్యారేజీ నిర్మాణం కోసం ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ప్రాజెక్టు కారణంగా 23 గ్రామాల్లోని 283 మంది ప్రజలు ప్రభావితమయ్యే అవకాశం ఉన్నది. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.399.16 కోట్లు కాగా.. ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే పర్యావరణ అనుమతులు సైతం లభించాయి. 2016లో జరిగిన ఒప్పందం ప్రకారం తెలంగాణ, మహారాష్ట్ర సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టాయి. తెలంగాణలోని 5,463 హెక్టార్లకు, మహారాష్ట్రలోని 1,214 హెక్టార్లకు ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందనుంది. ఇందుకోసం పెన్ గంగ నదిపై లోయర్ పెన్ గంగ దిగువన 23 గేట్లతో 0.8 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీ నిర్మించనున్నారు. చనాక-కొరటా బ్యారేజీ ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 13వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఆనకట్ట నుంచి లోయర్ పెన్ గంగ కాల్వల ద్వారా మరో 47వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. మొత్తంగా ఆదిలాబాద్ జిల్లాలో 50 వేల ఎకరాలకు పైగా సాగునీరు అందనుంది.
23 గేట్లతో బ్యారేజీ నిర్మాణం..
ఇప్పటికే 23 గేట్లతో చనాక-కొరాట బ్యారేజీ నిర్మాణం పూర్తయింది. ప్రాజెక్టులో భాగంగా 35మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఆరు మోటార్ల ద్వారా 13,500 ఎకరాలకు సాగునీరు, గ్రావిటీ కెనాల్ ద్వారా 47,500 ఎకరాలకు నీరు అందించాలని నిర్ణయించారు. ఆదిలాబాద్ జిల్లాలోని పలు మండలాలకు తాగు, సాగునీటిని అందించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. వాస్తవానికి 1975లో చనాక కొరాటా ప్రాజెక్టు నిర్మాణం కోసం మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ మధ్య ఒప్పందం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రక్రియలు పూర్తిచేసుకున్నా.. పనులు ఆలస్యమయ్యాయి. ఆరు మోటార్లకుగాను ఒక మోటార్ డ్రైరన్ ఇప్పటికే పూర్తి కాగా.. వెట్‌రన్‌ను సైతం పూర్తిచేశారు. అయితే.. ఈ ప్రాజెక్టు పనులు పదేండ్లుగా కొసాగుతూనే ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2015లో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో ఇప్పటికీ చుక్క నీరందడం లేదు. నిధులు కేటాయించడంతోపాటు వెంటనే రిలీజ్ చేస్తేనే కాలువలు, డిస్ట్రిబ్యూటర్ల నిర్మాణాలు చేపట్టే అవకాశం ఉంది.
పెండింగ్ ప్రాజెక్టులకు కాంగ్రెస్ ప్రాధాన్యం..
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తిచేయాలని నిర్ణయించింది. ఇందులో చనాక-కొరాటను సైతం తీసుకుంది. గత బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టు పూర్తికి రూ.179 కోట్లు సైతం కేటాయించింది. గత బీఆర్ఎస్ హయాంలో పంప్‌హౌజ్, రిజర్వాయర్, డిస్ట్రిబ్యూటర్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. ముందుగా రూ.386 కోట్ల అంచనాతో చేపట్టగా, ఫండ్స్ సరిపోవడం లేదంటూ రూ.1,227 కోట్లకు పెంచారు. అయినా.. ప్రాజెక్టు పూర్తి కాలేదు. రూ.2 వేల కోట్లకు అంచనాలు పెంచినప్పటికీ, నిధులు విడుదల చేయకపోవడంతో సాగునీరు అందని పరిస్థితి నెలకొంది. 2018లోనే ఈ ప్రాజెక్టు పూర్తిచేయాల్సి ఉండగా నిధుల కొరతతో పదేళ్లుగా గడువు పెంచుతూ వస్తున్నారు.
ఈ నెల 16న సీఎం పర్యటన..
ఈ ప్రాజెక్టును కీలకంగా తీసుకున్న ప్రభుత్వం పూర్తిచేసే దిశగా ముందుకు సాగుతున్నది. అందులో భాగంగానే సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 16న ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్నారు. భోరాజ్ మండలం హాతీఘాట్ గ్రామంలో పంప్‌హౌస్‌ను ప్రారంభించనున్నారు. కాగా.. ఈ నెల 16న సీఎం రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఇతర మంత్రులు, ఉన్నతాధికారుల ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో నేపథ్యంలో మంగళవారం భోరాజ్ మండలం హాతీఘాట్ గ్రామంలో చనాక-కొరాట పంప్ హౌస్ వద్ద ప్రారంభోత్సవ ఏర్పాట్లను కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, అధికారులు పరిశీలించారు. అలాగే.. సీఎం అదే రోజు నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ గ్రామంలో సదర్మాట్ బ్యారేజీని ప్రారంభించనుండగా దీనికి సంబంధించిన ఏర్పాట్లను నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం పరిశీలించారు.
2027 డిసెంబర్ నాటికి పూర్తి..
చనాక-కొరాట బ్యారేజికి భూసేకరణ పెండింగులో ఉన్నందున షెడ్యూల్ ప్రకారం పని పూర్తి కాలేదు. ఇప్పటివరకు భూసేకరణ ఇతర వ్యయాలతోపాటు ఈ ప్రాజెక్టుపై చేసిన వ్యయం రూ.1244.66 కోట్లు. ఇంకా కావలసిన నిధులు రూ. 792.91 కోట్లు. 2027, డిసెంబరు నాటికి పూర్తి చేసేలా కేటగిరి-బి క్రింద ప్రాజెక్టుకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. ఆ ప్రకారంగా, 2025-26 ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భూసేకరణ, ఇతర పనుల కోసం రూ.147.00 కోట్ల నిధులను కేటాయించడమైంది. రూ.71.96 కోట్ల భూసేకరణ బిల్లులను జిల్లా కలెక్టరు, ఆదిలాబాద్ విడి ఖాతాకు జమ చేయడమయింది. ఈ ప్రాజెక్టు డిసెంబరు, 2027 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించడం జరిగింది.
READ MORE ....






