సీఎం రేవంత్ సర్టిఫికెట్ వెనక్కి తీసుకోండి.. హార్వర్డ్ యూనివర్సిటీకి బీఆర్ఎస్ నేత, పూర్వ విద్యార్థి లేఖ

by Ramesh Naini |   (  Updated:2026-02-05 10:39:02  IST  )

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఇటీవల హార్వర్డ్ యూనివర్సిటీ అందజేసిన సర్టిఫికెట్‌ను తక్షణమే వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.

సీఎం రేవంత్ సర్టిఫికెట్ వెనక్కి తీసుకోండి.. హార్వర్డ్ యూనివర్సిటీకి బీఆర్ఎస్ నేత, పూర్వ విద్యార్థి లేఖ
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఇటీవల హార్వర్డ్ యూనివర్సిటీ అందజేసిన సర్టిఫికెట్‌ను తక్షణమే వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ అలాన్ గార్బర్, డీన్ వీన్‌స్టీన్‌లకు గురువారం ఒక ఈమెయిల్ పంపించారు. హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ పూర్వ విద్యార్థిగా (2012 బ్యాచ్) వర్సిటీ నిర్ణయం పట్ల తాను తీవ్ర దిగ్భ్రాంతికి, ఆవేదనకు గురయ్యానని ఆయన లేఖలో పేర్కొన్నారు.

89 కేసులు.. 50 రోజుల జైలు జీవితం

సీఎం రేవంత్ రెడ్డి ట్రాక్ రికార్డును ప్రస్తావిస్తూ ప్రవీణ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. ‘దేశంలో ఏ సీఎం ఎదుర్కోనన్ని (89) క్రిమినల్ కేసులు రేవంత్ రెడ్డి ఎదుర్కొంటున్నారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) ప్రకారం ఇందులో 72 సీరియస్ ఐపీసీ కేసులు ఉన్నాయి. 2015లో 'ఓటుకు నోటు' కేసులో ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికి, దాదాపు 50 రోజులు జైలు జీవితం గడిపిన చరిత్ర ఆయనది’ అని లేఖలో వివరించారు. అలాంటి వ్యక్తికి "లీడర్ షిప్ ఇన్ 21స్ట్ సెంచరీ" (Leadership in the 21st Century) ప్రోగ్రామ్ సర్టిఫికెట్ ఇవ్వడం అవివేకమని తెలిపారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ప్రత్యర్థులపై అభ్యంతరకర భాషను వాడుతున్నారని, కుల, మత పరమైన విభజన రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆర్ఎస్పీ ఆరోపించారు.

నైతిక విలువలు, ప్రజాసేవకు కట్టుబడి ఉండాల్సిన హార్వర్డ్ సంస్థ.. ఇలాంటి వారికి గుర్తింపునివ్వడం ద్వారా తన 400 ఏళ్ల చరిత్రను, ప్రతిష్టను దిగజార్చుకుంటోందని విమర్శించారు. ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ లేకుండా అడ్మిషన్లు ఇవ్వడం చూస్తుంటే.. హార్వర్డ్ కేవలం ఫీజుల కోసమే ఇలాంటి 'షార్ట్ టర్మ్ కోర్సు'లను అమ్ముకుంటున్నట్లుగా అనిపిస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి చట్టబద్ధత కల్పించేలా ఈ సర్టిఫికెట్లు ఉపయోగపడుతున్నాయని, ఇది నాయకత్వం కాదని, నమ్మకద్రోహమని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. తక్షణమే రేవంత్ రెడ్డికి ఇచ్చిన సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా అడ్మిషన్ల ప్రక్రియను పునఃసమీక్షించుకోవాలని ఆయన హార్వర్డ్ యాజమాన్యాన్ని కోరారు.


గ్రూప్‌- 1 నియామకాలపై హైకోర్టు తీర్పు.. సీఎం రేవంత్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Next Story