బీ ఫాంల కోసం పోటీ.. బరిలోకి కొత్త ముఖాలు?

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-01-24 04:19:15  IST  )

మున్సిపల్ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారైనప్పటి నుండి రాజకీయ పార్టీల్లో సందడి నెలకొంది. అనుకూల రిజర్వేషన్లు ఖరారైన ఆశావహులంతా టికెట్ల కోసం హోరాహోరీ ప్రయత్నాల్లో ఉన్నారు.

బీ ఫాంల కోసం పోటీ.. బరిలోకి కొత్త ముఖాలు?
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : మున్సిపల్ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారైనప్పటి నుండి రాజకీయ పార్టీల్లో సందడి నెలకొంది. అనుకూల రిజర్వేషన్లు ఖరారైన ఆశావహులంతా టికెట్ల కోసం హోరాహోరీ ప్రయత్నాల్లో ఉన్నారు. శక్తిమేర పైరవీలు చేస్తున్నారు. రోజురోజుకూ టికెట్లు ఆశించే వారి సంఖ్య పెరుగుతుండటంతో ఎవరికి భరోసా ఇవ్వాలి, టికెట్ ఎవరికివ్వాలో అర్థం కాని పరిస్థితుల్లో నేతలకు తలపోటెక్కుతోంది. మున్సిపల్ పోరులో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడమే ఈజీ నేమో కానీ, అభ్యర్థులను ఎంపికి చేయడం, అసంతృప్తికి తావివ్వకుండా టిక్కెట్లు కేటాయించడం శక్తికి మించిన పని అవుతోందని కాంగ్రెస్, బీజేపీ లకు చెందిన ప్రధాన నేతలు తమ రాష్ట్ర స్థాయి నేతల వద్ద నెత్తి కొట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక కార్పొరేషన్ (నిజామాబాద్) మినహా ఆరు మున్సిపాలిటీలున్నాయి. నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ కార్పొరేషన్, ఆర్మూర్, భీమ్‍గల్, బోధన్ మున్సిపాలిటీలు, కామారెడ్డి జిల్లాలో కామారెడ్డితోపాటు బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద మున్సిపాలిటీలున్నాయి. దాదాపు అన్ని చోట్లా ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటమే కాకుండా ఇతర పార్టీల నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలోకి చేరిన వారితో ఆ పార్టీ నేతలకు తలనొప్పి ఎక్కువైంది.

పట్టుమంటే పాముకు.. విడువు మంటే కప్పకు అన్నచందంగా..

బీఆర్ఎస్ హయాంలో దాదాపు కనుమరుగైందన్నట్లు కనిపించిన కాంగ్రెస్ పార్టీలోని చాలా మంది నాయకులు స్వప్రయోజనాలు ఆశించి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎప్పటి నుంచో కష్టకాలంలో కూడా పార్టీని అంటి పెట్టుకున్న వారితో పాటు నిన్న గాక మొన్న పార్టీలోకి చేరిన వారు సైతం టికెట్ల కోసం పోటీ పడుతున్న తీరు కాంగ్రెస్ పార్టీలో నిప్పు పెట్టే పరిస్థితిని కల్పిస్తోంది. పైకి ఫీల్ గుడ్ లా ఉన్నప్పటికీ ఒక్కసారి టికెట్ల కేటాయింపు జరిగితే కాంగ్రెస్ లో అసంతృప్తి జ్వాలలు పాశర్లపూడి బ్లో అవుట్ లా ఉవ్వెత్తున ఎగిసేలా ఉన్నాయనే టాక్ పార్టీలో వినిపిస్తోంది. ఈ పరిస్థితి జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ నగేష్ రెడ్డితో పాటు, టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి లకు కూడా తలపోటులా మారిందని పార్టీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. వీటికి తోడు పెద్ద నాయకులు ఎవరికి వారే తమకు అనుకూలంగా ఉన్న తమ వర్గానికి చెందిన వారికే టిక్కెట్లిప్పించేందుకు ఫిక్స్ అయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. పైకి సర్వే ఆధారంగానే టికెట్లు కేటాయిస్తామని రాష్ట్ర నాయకత్వం చెపుతున్నా, చివరకు సర్వే రిపోర్టలన్నీ పక్కన పెట్టి అనుకున్న వారికే, తమ వర్గం వారికే టికెట్లు ఇస్తారని, అదే జరిగితే జిల్లా కాంగ్రెస్ లో ఎన్నికలకు ముందే పెద్ద యుద్ధం జరుగుతుందని కొందరు నాయకులు పైకి బాహాటంగా చెప్పుకోవడం గమనార్హం.

ఆర్మూర్ లో కొత్తవారికీ, పాత వారికీ మధ్య పోటీ..

ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ల గొడవ తారాస్థాయికి చేరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ చైర్మన్ పదవిని ఆశించే వారి సంఖ్య ఎక్కువగా ఉండటం, ఎవరికి వారే రాష్ట్ర స్థాయి నాయకుల ద్వారా టికెట్ల కోసం ఫైరవీలు చేస్తుండటంతో పార్టీని కష్టకాలంలో కూడా అంటిపెట్టుకుని ఉన్న నేతలు ఆత్మరక్షణలో ధోరణిలో పడ్డారు. టికెట్లు తమకు దక్కుతాయో లేవోననే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. టికెట్ల పోటీలో వెనక బడిపోతే ఏం చేయాలనే విషయంలో ఇప్పుడే బయటపడక పోవడమే మంచిదని సైలెంట్ గా ఉంటున్నట్లు చెప్పుకుంటున్నారు. ఆర్మూర్ లో బీజేపీ, బీఆర్ఎస్ కూడా చాలా బలంగా ఉంది. ఈ రెండు పార్టీలతో కాంగ్రెస్ పార్టీకి పోటీ తప్పే పరిస్థితి లేదు. దీనికి తోడు పార్టీలో అంతర్గత పోరు, అసంతృప్తి జ్వాలలు తోడైతే ఆర్మూర్ మున్సిపాలిటీని చేజేతులా చేజార్చుకునే పరిస్థితి కూడా ఉండొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

బీజేపీ లో టిక్కెట్ల కోసం పోటీ..

నిజామాబాద్ కార్పొరేషన్ లో కూడా బీజేపీలో టికెట్ల కోసం పోటీ ఎక్కువైంది. కిందటి సారి తృటిలో చేజారిన మేయర్ పీఠాన్ని ఈ సారి ఆరునూరైనా దక్కించుకునేందుకు బీజేపీ కృత నిశ్చయంతో ఉంది. అందుకోసం ఎంపీ అర్వింద్ ధర్మపురి చేయాల్సిన వ్‌యూహరచన అంతా చేస్తున్నారు. కిందటిసారి బీజేపీ టికెట్ పై గెలిచి బీఆర్ఎస్ పార్టీలో చేరిన కొందరు తిరిగి బీజేపీలో చేరారు. వారు ఈసారి కూడా బీజేపీ టికెట్ ఆశిస్తున్నారు. పార్టీ టికెట్ మీద గెలిచి పార్టీకి వెన్ను పోటు పొడిచిన వారికి మళ్లీ పార్టీలో చేరి టికెట్లు ఆశిస్తుండటం మిగతా వారికి మింగుడు పడటం లేదు. టికెట్ల కేటాయింపు విషయంలో బీజేపీ లో అసంతృప్తికి తావివ్వకుండా ఎంపీ అర్వింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణలు ఎలా ముందుకెళతారోననే ఆసక్తి నెలకొంది. అవసరమైతే ముస్లీంలకు కూడా టికెట్లు కేటాయిస్తామని ఎంపీ అర్వింద్ ధర్మపురి ఇటీవల ప్రకటించడం ఆయన రాజకీయ దూరదృష్టికి నిదర్శనమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Read More..

పురపోరుపై ఫోకస్.. క్లీన్ స్వీప్ కోసం కాంగ్రెస్ సన్నాహాలు

Next Story