పురపోరుపై ఫోకస్.. క్లీన్ స్వీప్ కోసం కాంగ్రెస్ సన్నాహాలు

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-01-24 04:20:04  IST  )

ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ చైర్మన్ పదవులపై కాంగ్రెస్, బీఆర్​ఎస్ నేతలు గురిపెట్టారు. ఎన్నికలు జరిగే 12 మున్సిపాలిటీల్లో బలమైన అభ్యర్థులను బరిలో నిలిపేందుకు కసరత్తు చేస్తున్నారు.

పురపోరుపై ఫోకస్.. క్లీన్ స్వీప్ కోసం కాంగ్రెస్ సన్నాహాలు
X

దిశ, వరంగల్ బ్యూరో: ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ చైర్మన్ పదవులపై కాంగ్రెస్, బీఆర్​ఎస్ నేతలు గురిపెట్టారు. ఎన్నికలు జరిగే 12 మున్సిపాలిటీల్లో బలమైన అభ్యర్థులను బరిలో నిలిపేందుకు కసరత్తు చేస్తున్నారు. రిజర్వేషన్లకు అనుగుణంగా మెజార్టీ వార్డులను దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. చైర్మన్ పీఠంపై నజర్ పెట్టి అభ్యర్థులను బరిలోకి దించేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల్లో భారీగా ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు.

సిద్ధమవుతున్న ప్రధాన పార్టీలు

మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రానుండటంతో ప్రధాన పార్టీల నేతలు సన్నద్ధం అవుతున్నారు. మున్సిపాలిటీల్లో వార్డుల వారిగా రిజర్వేషన్లను పరిశీలించడంతో పాటు చైర్మన్లకు బలమైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. వార్డు సభ్యులుగా గెలిచిన వారే రిజర్వేషన్లకు అనుగుణంగా చైర్మన్లుగా ఎన్నిక కానుండడంతో ఆయా మున్సిపాలిటీల పరిధిలో పార్టీలో బలమైన నేతలను గుర్తించి పోటీకి సిద్ధం చేస్తున్నారు. చైర్మన్ గిరికి పోటీపడే నేతలు ఎంతైనా ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. పరకాల, తొర్రూరు, వర్ధన్నపేట ఈ దఫా జనరల్ కు రిజర్వు అయ్యింది. ఈ మూడు మున్సిపాలిటీలో చైర్మన్ పదవులకు కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి పోటీ ఎక్కువగా ఉంది. ఇవే కాకుండా మరిపెడ మున్సిపాలిటీ జనరల్ మహిళకు రిజర్వు అయ్యింది. ఈ నాలుగు మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన నేతలు పోటీ పడుతున్నారు. ఎలాగైనా చైర్మన్ పీఠం దక్కించుకోవాలని పార్టీ ఎమ్మెల్యేలు, నేతలను కలుస్తూ ప్రయత్నాలు చేస్తున్నారు. జనగామ, భూపాలపల్లి మున్సిపాలిటీలు బీసీ జనరల్ కు రిజర్వు కాగా, ములుగు, నర్సంపేట్ బీసీ మహిళకు రిజర్వు చేశారు. ఈ మున్సిపాలిటీల పరిధిలోనూ చైర్మన్ పదవులకు పోటీ ఎక్కువగా ఉంది. మహిళలు ఉన్నచోట సీనియర్ నేతలు తమ సతీమణులను బరిలోకి దించేందుకు సిద్ధమవుతున్నారు. మహబూబాబాద్ ఎస్టీ జనరల్, కేసముద్రం ఎస్టీ మహిళకు రిజర్వు అయ్యింది. ఈ మున్సిపాలిటీలో పోటీ కూడా ఎక్కువగానే ఉంది. మహబూబాబాద్ నుంచి ఎమ్మెల్యే సతీమణిని చైర్మన్ పదవికి పోటీకి దించుతున్నట్లు తెలుస్తుంది. స్టేషన్ ఘన్​పూర్, డోర్నకల్ ఎస్సీ జనరల్ కు రిజర్వు అయ్యింది. ఈ మున్సిపాలిటీల పరిధిలోనూ పోటీ ఎక్కువగానే ఉంది.

చైర్మన్​పీఠమే లక్ష్యంగా..

ఉమ్మడి జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో కనీసం 11స్థానాలను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. చైర్మన్ పీఠాలను దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఈ ఎన్నికలను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ తరపున ఇద్దరు మంత్రులను కూడా ఇన్​చార్జిలుగా నియమించారు. వీరి ఆధ్వర్యంలోనే అభ్యర్థులను నిర్ణయించడంతో పాటు పోటీకి దించనున్నారు. వార్డుల వారీగా బలబలాలను పరిశీలించడంతో పాటు ఇతర పార్టీలో బలం ఉన్న నేతలను కూడా పార్టీలో చేర్చుకుని టిక్కెట్ ఇస్తామని హామీలు ఇస్తున్నారు. పోటీకి దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం అధికారంలో ఉండడంతో మున్సిపాలిటీల అభివృద్ధికి భారీగా నిధులు తీసుకువస్తామని ఎమ్మెల్యేలు ప్రకటిస్తున్నారు. హామీలు ఇస్తూనే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు.

గతంలో ఉన్న మున్సిపాలిటీలో పట్టును నిలుపుకునేందుకు బీఆర్ఎస్ నేతలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల ముందే మున్సిపాలిటీలో బలం ఉంటే తమకు కలిసి వస్తుందని భావిస్తున్న నేతలు 12 మున్సిపాలిటీల్లో మెజార్టీ వార్డులను గెలుచుకునే విధంగా బీఆర్ఎస్ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఎన్నికలను రెండు పార్టీలు సవాల్ గా తీసుకోవడంతో పోరు రసవత్తరంగా మారనుంది. బీజేపీ అన్ని మున్సిపాలిటీల్లో పోటీకి సిద్ధమవుతున్నా కొన్నింటి పరిధిలో బలం లేకపోవడంతో ఇతర పార్టీల నేతలను చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రెండు పార్టీల నేతలు మాత్రం షెడ్యూల్ కు ముందే అభ్యర్థులను నిర్ణయించేందుకు సిద్ధమవుతున్నారు.

Read More..

బీ ఫాంల కోసం పోటీ.. బరిలోకి కొత్త ముఖాలు?

Next Story