Munugode by-poll: రంగంలోకి కాషాయ దళపతి బండి సంజయ్.. ప్రచార అస్త్రం ఇదే!

by Disha Web |
Munugode by-poll: రంగంలోకి కాషాయ దళపతి బండి సంజయ్.. ప్రచార అస్త్రం ఇదే!
X

దిశ, తెలంగాణ బ్యూరో: మునుగోడు.. మునుగోడు.. మునుగోడు.. ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఏ నలుగురు కలిసినా ఇదే పేరు వినిపిస్తోంది. ఇక్కడ జరిగే ఉప ఎన్నిక గురించే చర్చ సాగుతోంది. గెలిచేది ఎవరు, ఓడేదెవరు అనే పందాలు కూడా జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. కాగా ఈనెల 18వ తేదీ నుంచి మునుగోడు బైపోల్ బ్యాటిల్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెళ్లనున్నారు. మంగళవారం నుంచి అక్కడే ఆయన మకాం వేయనున్నారు. బీజేపీ ప్రచారాన్ని మరింత స్పీడప్ చేయనున్నారు. దాదాపు 12 రోజుల పాటు బండి సంజయ్ మునుగోడు నియోజకవర్గం వ్యాప్తంగా ప్రచారం చేయనున్నారు. ప్రతి రోజు రోడ్డు షోలు నిర్వహించి ఓటర్లను తమ వైపునకు లాక్కునే ప్రయత్నం చేయడంతో పాటు పార్టీ శ్రేణులు సైతం మరింత కష్టపడి ప్రచారం చేసేలా జోష్ పెంచనున్నారు.

మునుగోడు ఉప పోరులో కమలనాథులు ప్రచారాన్ని హోరెత్తించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ముమ్మరంగా ప్రచారం చేస్తోన్న కాషాయదళం మరింత వేగవంతం చేయనుంది. ఇప్పటికే కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్షణ్‌, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎమ్మెల్యే మోహన్ బాబు సైతం రంగంలోకి దిగారు. ఇక కాషాయ దళపతి బండి సంజయ్ 18 నుంచి ప్రచార పర్వంలోకి దిగి 12 రోజుల పాటు రోడ్‌ షోలతో కదం తొక్కనున్నారు. ఇన్ని రోజులు ఢిల్లీ పర్యటనలో ఉండటంతో ఆయన రాలేకపోయారు. మంగళవారం నుంచి అక్కడే మకాం వేసి తనదైన శైలిలో ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు. అధికార పార్టీ టీఆర్ఎస్ మునుగోడుకు చేసిందేమిటి? ఎన్ని నిధులిచ్చింది? అనే అంశాలపై ప్రస్తావించి ప్రజలకు వివరించనున్నారు. ఓటర్లను చైతన్యవంతుల్ని చేసి కాషాయ పార్టీ వైపు ఆకర్షితులయ్యేలా ప్రణాళికలు చేస్తున్నారు. అంతేకాకుండా ఇతర పార్టీల నేతలను కూడా బీజేపీలోకి తీసుకొచ్చి ప్రత్యర్థి పార్టీలకు చుక్కలు చూపించాలనే ప్లాన్‌తో బండి సంజయ్ ఉన్నారు. ఇదిలా ఉండగా ఈనెల చివరి వారంలో కాషాయదళం రాకెట్ వేగంతో ప్రచారం చేపట్టాలని భావిస్తోంది. కేంద్ర మంత్రలు, ఢిల్లీ అగ్ర నేతలతో వరుసగా సభలు నిర్వహించి ఓటర్లను తమ వైపునకు లాక్కోవాలని బీజేపీ ప్రయత్నాలను ముమ్మరం చేసింది.

ఈనెలాఖరులో ప్రచార పర్వం చివరి రోజున భారీ సభలు నిర్వహించాలని కమలనాథులు ఏర్పాట్లు చేస్తున్నారు. జాతీయ నాయకులతో పాటు కేంద్ర మంత్రులను కూడా తీసుకొచ్చేందుకు కాషాయదళం ప్లాన్ చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు, కేంద్ర మంత్రులు అమిత్ షా, స్మృతి ఇరానీ, నిర్మలా సీతారామన్‌ను తీసుకురావాలని చూస్తున్నారు. వారి షెడ్యూల్‌కు అనుగుణంగా సభలు నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది. ఈనెల 27న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ముఖ్య అతిథిగా తీసుకొచ్చి సభ నిర్వహించాలని కమలనాథులు ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ ఆరోజు నడ్డా షెడ్యూల్ బిజీగా ఉంటే మరుసటి రోజు సభ నిర్వహించేలా ప్రణాళికలు చేస్తున్నారు. ఇక ప్రచార పర్వం చివరి రోజైన నవంబర్ 1వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రచారానికి రానున్నారు. మునుగోడు బైపోల్‌ను బీజేపీ చాలా సీరియస్‌గా తీసుకుంటోంది. ఆయన ప్రచారంతో బీజేపీకి మరింత కలిసొస్తుందని శ్రేణులు భావిస్తున్నాయి. ఈ సభలతో పాటు ప్రచారానికి గాను కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, నిర్మలా సీతారామన్ కూడా వచ్చే అవకాశాలున్నాయి. ఇక ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ప్రచారానికి రావాలని రాష్ట్ర నాయకత్వం సంప్రదింపులు చేసినట్లు సమాచారం. అయితే ఆయన షెడ్యూల్ ఇంకా ఖరారవ్వలేదు. మరికొద్ది రోజుల్లో ఆయన రాకపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా నడ్డా, షా సభలకు సంబంధించిన సభా స్థలి ఎక్కడనే అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది.

మునుగోడు దంగల్‌లో కాషాయ జెండా ఎగరవేసేందుకు కాషాయదండు విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ప్రతి గడపకూ తిరుగుతూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, యువతతో పాటు కొత్తగా ఓటు వేయబోయే వాళ్లను లక్ష్యంగా భాజపా శ్రేణులు ప్రచారం నిర్వహిస్తున్నాయి. సామాజిక వర్గాల వారీగా ఓట్లను కొల్లగొట్టేందుకు పక్కా వ్యూహాంతో ముందుకు సాగుతోంది. ఇప్పటికే చౌటుప్పల్‌లో యాదవ సంఘాలతో అదే సామాజిక వర్గానికి చెందిన కేంద్రమంత్రి భూపేంద్రయాదవ్‌ సమావేశమయ్యారు. కుర్మసంఘం సైతం బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించింది. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో బలంగా ఉన్న గౌడ, పద్మశాలితో పాటు ఎస్సీ, ఎస్టీల ఓట్లను తమకే పడేలా ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే ఆ సామాజిక వర్గాలకు చెందిన రాష్ర్ట నేతలు ప్రచారం నిర్వహిస్తుండగా జాతీయ, కేంద్రమంత్రులను ప్రచారానికి రప్పించి కుల సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ ఎన్నిక బీజేపీకి అత్యంత కీలకం కావడంతో జాతీయ నాయకత్వం సైతం అన్ని విధాలుగా సహకరిస్తామని అభయమిచ్చింది.

ఇవి కూడా చదవండి : బరిలో నిలిచేదెవరో.. మునుగోడు తేలేది నేడే!


Next Story