హయత్‌నగర్‌లో ఆయిల్‌ ట్యాంకర్‌ బీభత్సం.. ఎన్‌హెచ్ 65పై భారీగా ట్రాఫిక్ జామ్

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-04 14:00:44  IST  )

హయత్‌నగర్‌లోని హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై ఇండియన్ ఆయిల్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది.

హయత్‌నగర్‌లో ఆయిల్‌ ట్యాంకర్‌ బీభత్సం.. ఎన్‌హెచ్ 65పై భారీగా ట్రాఫిక్ జామ్
X

దిశ, వెబ్‌డెస్క్: హయత్‌నగర్‌లో ఇవాళ సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి (NH‌ 65)పై ఇండియన్ ఆయిల్‌కు చెందిన పెట్రోల్ ట్యాంకర్ అదుపుతప్పి ముందుగా వెళ్తున్న 2 కార్లను బలంగా ఢీకొట్టి అనంతరం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రెండు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయితే, ప్రమాద సమయంలో కార్లలో ఉన్న ప్రయాణికులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు, పోలీసులు కలిసి సమీప ఆస్పత్రులకు తరలించారు.

ట్యాంకర్ నుంచి పెట్రోల్ లీక్..

ప్రమాదం అనంతరం ట్యాంకర్ నుంచి పెట్రోల్ లీక్ అవుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గురైన ట్యాంకర్‌లో డ్రైవర్ ఇరుక్కుపోయినట్లుగా సమాచారం. అతడిని సురక్షితంగా బయటకు తీసేందుకు రెస్క్యూ బృందాలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారి 65పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలు కిలో మీటర్ల మేర నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పెట్రోల్ లీకేజీ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమై ట్రాఫిక్‌ను ప్రత్యామ్నాయ మార్గాల వైపు మళ్లిస్తున్నారు.

Next Story