- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Phone Tapping Case: హరీశ్ రావు బాధితుడా? నిందితుడా? ఫోన్ ట్యాపింగ్ కేసులో అనూహ్య పరిణామం
గత ప్రభుత్వంలో హరీశ్ రావుపై నిరంతరం నిఘా ఉందనే ప్రచారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు (Telangana Phone Tapping Case) సంచలనం సృష్టిస్తోంది. కేసు దర్యాప్తులో ఎప్పటికప్పుడు కొత్త ట్విస్టులు ఉత్కంఠ రేపుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విచారణతో ఈ కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. గత ప్రభుత్వంలో మంత్రిగా కీలకంగా వ్యవహరించిన హరీశ్ రావుపై దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ప్రత్యర్థుల ఫోన్లను ట్యాపింగ్ చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో160 సీఆర్‍పీసీ కింద హరీశ్ రావుకు సిట్ (SIT) నోటీసులు ఇవ్వగా నిన్న ఆయన విచారణకు హాజరయ్యారు. దాదాపు 7 గంటల పాటు సాగిన ఈ విచారణలో మీ ఫోనే ట్యాప్‍కు గురైందని సిట్ అధికారులు హరీశ్ రావుకు వివరించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్‍కు పాల్పడ్డారనే ఆరోపణలు ఉండగా ఇప్పుడీ తాజా ట్విస్ట్ తో ఈ కేసులో హరీశ్ రావు బాధితుడా లేక నిందితుడా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.
ఆధారాలు ముందు పెట్టిన సిట్!:
విచారణ సందర్భంగా పలు కీలక విషయాలపై హరీశ్ రావును ప్రశ్నించిన సిట్ అధికారులు.'2018 శాసనసభ ఎన్నికల తర్వాత మీతో పాటు మీ అనుచురులు, బీఆర్ఎస్‍లోని మరో సీనియర్ నేత ఫోన్లు ఏడాది పాటు నిఘా ఉంచారనే విషయాన్ని సిట్ అధికారులు హరీశ్ రావు దృష్టికి తీసుకువెళ్లారు. అయితే ఈ విషయంపై తొలుత ఖంగుతిన్న హరీశ్ రావు ఆ తర్వాత నేను నమ్మను అని బదులిచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కేసులో నిందితులు ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, శ్రవణ్ రావులతో ఉన్న లింకేంటి అనే విషయాన్ని ఆరా తీసినట్లు తెలిసింది. 2023 నవంబర్ 30న శాసనసభ ఎన్నికలకు ముందురోజు వరకు శ్రవణ్ రావు ఇచ్చిన ఫోన్ నంబర్లను ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు ట్యాప్ చేయించడానికి కారణం ఏమిటని ప్రశ్నించగా హరీశ్ రావు సరైన సమాధానాలు ఇవ్వలేదని తెలిసింది. ఈ క్రమంలో శ్రవణ్ రావు, ప్రణీత్ రావు ల మధ్య జరిగిన చాటింగ్ స్క్రీన్ షార్టులను హరీశ్ రావు ముందుంచి ప్రశ్నించగా తనకు ఆ విషయాలు తెలియదని సమాధానం చెప్పినట్లు సమాచారం. సిట్ ప్రశ్నలకు సమాధానాల సమయంలో చాలా వరకు గుర్తులేదు. తెలియదు, నేను నమ్మను అనే పదాలతో బదులిచ్చినట్లు తెలుస్తోంది.
హరీశ్ రావు దారెటు?:
హరీశ్‍రావు ఫోన్ ట్యాపింగ్‍కు గురైందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. నిజానికి 2018లో రెండోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక హరీశ్ రావుకు మంత్రివర్గంలో చోటు దక్కలేదు. దాంతో హరీశ్ విషయంలో కేసీఆర్ అనుమానిస్తున్నారని అందువల్లే ఆయన్ను కేబినెట్‍లోకి తీసుకోలేదనే గుసగుసలు వినిపించాయి. ఆ సమయంలో తన ఫోన్ ట్యాప్ అవుతోందని అందువల్ల తనకు ఎవరూ ఫోన్ చేయవద్దని హరీశ్ రావు చెప్పేవారని కేసీఆర్ కు సన్నిహితుడిగా పిలువబడే వి.ప్రకాశ్ గతంలో చెప్పిన వీడియో ఇప్పుడు మరోసారి వైరల్ అవుతోంది. అయితే నిన్న సిట్ విచారణ అనంతరం తెలంగాణ భవన్‍కు వచ్చిన హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ తానే సిట్‍కు 100 ప్రశ్నలు వేశానని చెప్పారు. కానీ తన ఫోన్ ట్యాప్ అయిందనే విషయం ప్రస్తావనకు వచ్చినందనే విషయాన్ని ఆయన వెల్లడించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం హరీశ్ రావు ఫోన్ పై నిఘా పెట్టారనే విషయాన్ని సిట్ ప్రస్తావించిందని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో మొదటి నుంచి కేసీఆర్ వెంట నడిచిన హరీశ్ రావు ఫోన్ పైనే నిఘా ఉంచారనే ప్రచారంతో హరీశ్ రావు దారెటు అనేది ఉత్కంఠగా మారింది. మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కుటుంబ సభ్యులలో ఇప్పటి వరకు కవిత, ఆమె భర్తపై నిఘా ఉంచారనే ప్రచారం జరుగగా ఇప్పుడు ఆ జాబితాలో హరీశ్ రావుపై సైతం ఉన్నారనే టాక్ హరీశ్ రావు అభిమానులను షాక్ కు గురి చేస్తోంది. జరుగుతున్న ప్రచారం ప్రకారం హరీశ్ రావు ఫోన్ పై నిఘా ఉంచింది నిజమే అయితే అది కేసీఆర్ చేయించారా? లేక మరెవరైనా చేయించారా అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.






