- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేవంత్ సీఎం కావడానికి అవే కారణం: బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి అబద్ధాల పునాదులపై ముఖ్యమంత్రి అయ్యారని, అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు ప్రజలను, ముఖ్యంగా మహిళలను మోసం చేస్తూనే ఉన్నారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బండి సంజయ్ విమర్శించారు. మహిళలకు ప్రతినెలా రూ.2500 ఇస్తానని రేవంత్ రెడ్డి మాట తప్పారు. నెలలు గడుస్తున్నా ఆ ఊసే ఎత్తడం లేదు. తులం బంగారం, స్కూటీల పేరుతో ఆశలు రేపి మహిళలను నిలువునా ముంచారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు, ఇప్పుడు చేస్తున్న పాలనకు అసలు పొంతన లేదు. మహిళా బిల్లును అడ్డుకోవాలని చూస్తూ రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాలకు ద్రోహం చేస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం పార్లమెంటరీ నియోజకవర్గాల విభజనపై అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు అని బండి సంజయ్ ఆరోపించారు.
కేసీఆర్ తరహాలోనే రేవంత్ పాలన..
బీఆర్ఎస్ హయాంలో జరిగిన మోసాలే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ పునరావృతమవుతున్నాయని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. గతంలో కేసీఆర్ ఏ విధంగా అయితే అబద్ధాలు, మోసాలతో తెలంగాణను పాలించారో, రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో నడుస్తున్నారు. పేరు మారింది కానీ, ప్రజలను వంచించే తీరు మాత్రం మారలేదు. అబద్ధాలతో ఎంతో కాలం నెట్టుకు రాలేరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా అబద్ధాలు మాని, మహిళలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను సంపూర్ణంగా అమలు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.






