బ్యాలెట్ బాక్స్ సీల్ మిస్.. లక్షెట్టిపేట కౌంటింగ్ కేంద్రంలో గందరగోళం

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-13 04:12:04  IST  )

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపల్ కౌంటింగ్ కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. మూడో వార్డుకు చెందిన బ్యాలెట్ బాక్స్‌కు సీల్ లేకపోవడంతో బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు కౌంటింగ్ నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ భారీ నిరసనకు దిగాయి. అధికారులు, పోలీసుల జోక్యంతో కేంద్రం వద్ద గందరగోళ పరిస్థితి ఏర్పడింది.

బ్యాలెట్ బాక్స్ సీల్ మిస్.. లక్షెట్టిపేట కౌంటింగ్ కేంద్రంలో గందరగోళం
X

దిశ, వెబ్‌డెస్క్: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా మంచిర్యాల (Manchiryal) జిల్లా లక్షెట్టిపేట (Lakshettipet)లోని కౌంటింగ్ కేంద్రం వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. ఓ బ్యాలెట్ బాక్స్ సీలింగ్ విషయంలో తలెత్తిన వివాదం రాజకీయ పార్టీల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. వివరాల్లోకి వెళితే.. కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా మూడో వార్డుకు సంబంధించిన బ్యాలెట్ బాక్స్‌ను అధికారులు బయటకు తీశారు. అయితే, ఆ బాక్స్‌కు ఉండాల్సిన అధికారిక సీల్ లేకపోవడాన్ని గమనించిన బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP) అభ్యర్థులు, ఏజెంట్లు నిరసనకు దిగారు.

సీలింగ్ లేని బాక్స్‌ను కౌంటింగ్‌కు ఎలా అనుమతిస్తారని వారు అధికారులను నిలదీశారు. దీంతో వారు ఏకమై కౌంటింగ్ కేంద్రం లోపల, బయట పెద్ద ఆందోళనకు దిగారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, అధికార యంత్రాంగం నిబంధనలను తుంగలో తొక్కిందని వారు ఆరోపించారు. తక్షణమే కౌంటింగ్‌ను ఆపివేయాలని, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేస్తుండటంతో కౌంటింగ్ కేంద్రం వద్ద గందరగోళం నెలకొంది. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. నిరసనకారులను సముదాయించే ప్రయత్నం చేయడంతో పాటు, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కౌంటింగ్ కేంద్రం వద్ద భారీగా బలగాలను మోహరించారు.

లక్షెట్టిపేట మున్సిపాలిటీలో తీవ్ర విషాదం.. ఫలితాల వేళ బీజేపీ అభ్యర్థి మృతి

Next Story